Share News

Jagtial: వాగు మళ్లింపుపై రైతుల ఆందోళన

ABN , Publish Date - Nov 27 , 2026 | 11:44 PM

జగిత్యాల టౌన్‌/జగిత్యాలరూరల్‌, నవంబర్‌ 27(ఆంధ్రజ్యోతి): జగిత్యాల అర్బన్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో సాగునీటికాలువను రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు అక్రమంగా మళ్లించారంటూ రైతులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Jagtial:  వాగు మళ్లింపుపై రైతుల ఆందోళన
నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

జగిత్యాల టౌన్‌/జగిత్యాలరూరల్‌, నవంబర్‌ 27(ఆంధ్రజ్యోతి): జగిత్యాల అర్బన్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో సాగునీటికాలువను రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు అక్రమంగా మళ్లించారంటూ రైతులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రైతులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకొని కొత్తగా తవ్విన కాలువను పూడ్చే ప్రయత్నంచేశారు. కాలువను యథావిధిగా పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణంలోంచి వెళ్లే రెండువాగుల నీరు ఒకేచోట కలిసి కాలువద్వారా ముప్పారం చెరువు, తిమ్మాపూర్‌ చెరువుల మధ్యనుంచి ప్రత్యేకకాలువ ద్వారా అవతలివైపుకు వెళ్తాయి. ఈ కాలువ కింద సుమారు 80ఎకరాల వ్యవసాయ భూమి సాగు అవుతుందని తెలిపారు. సుమారు 50ఏళ్లుగా ఉన్న ఈ కాలువను కొందరు రియల్టర్లు మధ్యలోనే మళ్లించి చెరువులోకి కలిపారని ఆరోపించారు. దీంతో ఆయకట్టు భూములకు నీరందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లించిన కాలువ ద్వారా మురుగునీరు చెరువులోకి చేరి చేపలకు కూడా నష్టం కలిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖల అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని, పాత కాలువను యథావిధిగా పునరుద్దరించాలని కోరారు. కాలువను ఆక్రమించి దారి మళ్లించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 27 , 2026 | 11:44 PM