Jagtial: నిర్మాణ పనులు వేగవంతంగా చేయాలి
ABN , Publish Date - Jul 23 , 2026 | 11:21 PM
ధర్మపురి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణపనులు నాణ్యతతో, వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.
కలెక్టర్ సత్యప్రసాద్
ధర్మపురి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణపనులు నాణ్యతతో, వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని నేరెళ్ల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణపనులను గురువారం క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భవనాల రూపకల్పన, తరగతి గదులు, వసతిగృహాలు, మౌళికసదుపపాయాల ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంతో పాటు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీపడవద్దని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతిపనిని అత్యంత భాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
‘సర్’ను పకడ్బందీగా నిర్వహించాలి
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్)కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ధర్మపురి మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో 33వ నెంబర్ పీఎస్ పరిధిలో ఇంటింటా నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను గురువారం ఆయన పరిశీలించారు. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి దరఖాస్తు ఫారాలను పంపిణ చేయగా, ఫారాలను కూడా ఆగస్టు 3 వరకు సంబంధిత బీఎల్‌వోలకు అందించాలని ప్రజలను ఆయన కోరారు. ప్రజలకు ఫారాలు నింపడంలో ఏవైన సందేహాలు ఉంటే తమ పరిధిలోని బీఎల్‌వోలను లేదా ఎన్నికల అధికారులను సంప్రదించాలని సూచించారు. ఫారాల సేకరణ, డిజిటైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సహకారంతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము, ఇంజనీరింగ్ శాఖ అధికారులు, జగిత్యాల ఆర్‌డీవో మదుసూధన్, ధర్మపురి మండల తహసీల్దార్ ఏరుకొండ శ్రీనివాస్, ఆర్‌ఐలు భాస్కర్‌రావు, శ్రీనివాస్, బీఎల్‌వోలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి
జగిత్యాల అగ్రికల్చర్ : జిల్లా కేంద్రంలోని ధరూర్‌క్యాంప్‌లోగల ఎస్సీ ప్రభుత్వవసతిగృహంలో నిర్మిస్తున్న కిచెన్‌షెడ్ లను గురువారం జగిత్యాల కలెక్టర్ బి సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా షెడ్యూల్డ్‌కులాల అభివృద్ది అధికారి రాజ్‌కుమార్ తదితరులున్నారు.