Share News

Jagitiala : కో ఆప్షన్‌ సభ్యుల నియామకమెప్పుడో..?

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:56 AM

జగిత్యాల, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో కో ఆప్షన్‌ పదవులను దక్కించుకోవడానికి ఆశావహులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

Jagitiala :  కో ఆప్షన్‌ సభ్యుల నియామకమెప్పుడో..?

-పంచాయతీల్లో ఆశావహుల ఎదురుచూపులు

-పాలక వర్గాలు కొలువుదీరి ఆరు నెలలు

- జిల్లాలో 1,155 మంది నియామకానికి అవకాశం

జగిత్యాల, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో కో ఆప్షన్‌ పదవులను దక్కించుకోవడానికి ఆశావహులకు ఎదురుచూపులు తప్పడం లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు గత యేడాది డిసెంబరులో ముగిశాయి. పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ కో ఆప్షన్‌ సభ్యుల నియామకం మాత్రం కాలేదు. పదువుల ఆశిస్తున్న వారికి ఎదురుచూపులే మిగులుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఊసెత్తక పోవడంతో పలువురు ఆశావహులు నిరాశకు గురవుతున్నారు.

ఫజిల్లాలో 20 మండలాల్లో...

జిల్లాలోని 20 మండలాల్లో 385 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో చోట ముగ్గురు చొప్పున 1,155 మందిని కోఆప్షన్‌ సభ్యులుగా నియమించాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎన్నికపై ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు. పంచాయతీరాజ్‌ చట్టం-2018 ప్రకారం పంచాయతీ పాలక వర్గాలకు సూచనలిచ్చేందుకు కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకునే అవకాశం కల్పించారు. వారికి వార్డు సభ్యులతో సమాన హోదా ఉంటుంది. పాలకవర్గం కొలువదీరిన 60రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇంతవరకు ఆ ప్రక్రియ చేపట్టలేదు. సర్పంచ్‌, వార్డు సభ్యుల ద్వారా ముగ్గురు కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకుంటారు. వీరిలో పదవీ విరమణ చేసిన ఉద్యోగి లేదా అనుభవమున్న సీనియర్‌ సిటిజన్‌, మరొకరు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి లేదా గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, ఇంకొకరు పంచాయతీలకు స్థలం ఇచ్చిన దాతలు లేదా భారీగా విరాళాలు అందించిన వారు, గ్రామాభివృద్ధికి పాటు పడే ఎన్‌ఆర్‌ఐలను నియమించాల్సి ఉంటుంది.

ఫప్రగతిలో కీలక పాత్ర..

కో ఆప్షన్‌ సభ్యులకు పంచాయతీ సమావేశాల్లో పాల్గొని సూచనలు ఇచ్చే హక్కు ఉంటుంది. వార్డు సభ్యులతో సమానమైన ప్రోటోకాల్‌, గౌరవం లభిస్తుంది. పంచాయతీ నిధుల వినియోగం, అభివృద్ధికి సంబంధించి ప్రణాళికల రూపకల్పనలో కోఆప్షన్‌ సభ్యుల పాత్ర కీలకంగా ఉంటుంది. సమావేశాల్లో ప్రగతి, సమస్యలపై చర్చించే అవకాశం ఉన్నప్పటికీ తీర్మానాల ఆమోదంలో మాత్రం ఓటు హక్కు ఉండదు. పంచాయతీకి సలహాదారుగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఉత్తర్వులు రావాల్సి ఉంది

- మదన్‌మోహన్‌, జిల్లా పంచాయతీ అధికారి

పంచాయతీల్లో కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక పంచాయతీరాజ్‌ చట్టంలో ఉంది. ఎన్నిక నిర్వహించేందుకు కమిషనర్‌ కార్యాలయం నుంచి ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే ఎన్నికల ప్రక్రియ చేపడతాం.

Updated Date - Jun 22 , 2026 | 12:56 AM