Jagitiala : సాదాబైనామా సులువయ్యేలా..
ABN , Publish Date - Apr 13 , 2026 | 01:27 AM
జగిత్యాల, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ఎన్ని చట్టాలు తెచ్చినా సాదాబైనామా సమస్య ఇన్నాళ్లు అపరిష్కృతంగానే ఉండిపోయింది.
- సాఫీగా భూముల క్రమబద్ధీకరణ
- పెండింగ్‌లో 35,267 దరఖాస్తులు
- జీవో 76తో తొలగిన అడ్డంకులు
- అభ్యంతరాలు రాకుంటేనే ‘పట్టా’
జగిత్యాల, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ఎన్ని చట్టాలు తెచ్చినా సాదాబైనామా సమస్య ఇన్నాళ్లు అపరిష్కృతంగానే ఉండిపోయింది. ఎట్టకేలకు దీనికి పరిష్కారం చూపుతూ ప్రభుత్వం ఇటీవల జీవో నంబరు 76 విడుదల చేసింది. తెల్ల కాగితాలపై క్రయ విక్రయాలు జరిగిన భూమలు క్రమబద్ధీకరణ సాఫీగా జరగనుంది. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 35,267 దరఖాస్తులకు పరిష్కారం లభించనుంది. జిల్లాలో 41,218 సర్వే నంబర్లకు సంబంధించిన సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారం కానున్నాయి. దీంతో సన్న, చిన్నకారు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
భూ భారతీలోనూ సమస్య..
రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి ఆర్‌వోఆర్ చట్టాన్ని తీసుకువచ్చింది. ఇందులో సాదాబైనామా దరఖాస్తుల కోసం సెక్షన 6, రూల్ 6 లో నిబంధనలు పొందుపరిచింది. దీని ప్రకారం ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి భూమి చుట్టుపక్కల రైతులతోనూ మాట్లాడి రాతపూర్వక ఆధారాలు పరిశీలించాలి. పీవోటి, సీలింగ్, ఎల్టీఆర్ చట్టాల ఉల్లంఘన జరగలేదని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అయితే కొనుగోలుదారుడు, అమ్మకందారుడి అఫిడవిట్లు ఇవ్వాలన్న నిబంధనతో చిక్కులు ఎదురయ్యాయి. ఈ కారణంగా భూ భారతి చట్టంలోనూ సాదాబైనామాలు పరిష్కారానికి నోచుకోలేదు.
అఫిడవిట్ ఒకరు ఇస్తే చాలు..
భూముల క్రబద్ధీకరణకు 2014 జూన 2కు పూర్వం తెల్లకాగితాలపై భూములు కొనుగోలు చేసిన వారు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ప్రభుత్వాలు మారినా ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో భూమి అమ్మేందుకు, పంట రుణాలు పొందేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం గత నెల 18న జీవో 76 విడుదల చేసింది. ఈ జీవో ద్వారా కొనుగోలుదారుడు అఫిడవిట్ ఇస్తే సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించనున్నారు.
అభ్యంతరాలు రాకుంటేనే సర్టిఫికేట్..
జీవో నంబరు 76 ప్రకారం భూమి కొనుగోలు చేసి సాదాబైనామా రాయించుకున్న వ్యక్తి అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది. అఫిడవిట్‌తో పాటు భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను ఆర్‌డీఓ పరిశీలిస్తారు. అఫిడవిట్ అందించిన తర్వాత 30 రోజులు దరఖాస్తులను పెండింగ్ పెడతారు. ఈలోపు ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే సదరు రైతుకు సాదాబైనామా సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే సర్టిఫికేట్ రద్దు చేస్తారు. స్టాంపు డ్యూటీ, రిజిసే్ట్రషన ఫీజు వెనక్కి ఇవ్వరు. అలాగే జీవో 77 ప్రకారం సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకునే నాటికి గ్రామీణ ప్రాంతమై ఉండి, ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసి పోయినా వాటిని పరిష్కరించేందుకు అవకాశం లభిస్తుంది.
అయిదేళ్లకు పైగా పెండింగ్...
ఏళ్ల క్రితం భూ క్రయ విక్రయాలకు సంబంధించి తెల్లకాగితాలపైనే ఒప్పందాలు జరిగేవి. అయితే భూములపై చట్టబద్దత, హక్కుల్లో ఇబ్బంది ఎదురవుతుండడంతో క్రమబద్ధీకరించాలని 2016లో నాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించినా ప్రక్రియ ముందుకు పోలేదు. ఆ తర్వాత 2020 అక్టోబరులో ప్రభుత్వం 112 జీవో ద్వారా మరోసారి మీ సేవ కేంద్రాల్లో ఫారం-10 ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఆ యేడాది అక్టోబరు 31తో గడువు ముగిసినా, ఆ తర్వాత నవంబరు 10వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అప్పుడు మొత్తం 35,267 దరఖాస్తులు వచ్చాయి. కానీ ధరణీ చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు నిబంధనలు పొందుపర్చకపోవడం, న్యాయపరమైన చిక్కులు రావడంతో దరఖాస్తులను పక్కనబెట్టారు.