Jagitiala : లక్ష్యం ఖరారు
ABN , Publish Date - May 18 , 2026 | 01:21 AM
జగిత్యాల, మే17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యుల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా విరివిగా రుణాలిస్తోంది.
- ఎస్‌హెచ్‌జీలకు బ్యాంకు లింకేజీ రుణాలు
- జిల్లాలో 13,537 సంఘాలకు రూ.793.74 కోట్లు కేటాయింపు
- మండలాల వారీగా మంజూరు
జగిత్యాల, మే17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యుల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా విరివిగా రుణాలిస్తోంది. కుటీర పరిశ్రమల ఏర్పాటుతో పాటు వివిధ వ్యాపారాల్లో రాణించేలా బ్యాంకు లింకేజీ ద్వారా ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగానే 2026-27 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యాన్ని ఖరారు చేసింది. జిల్లాలో 13,537 సంఘాలకు రూ. 793.74 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మండలాల వారీగా లక్ష్యాలను ఖరారు చేస్తూ జిల్లాకు పంపించింది. లక్ష్య సాధన దిశగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.
ఫగత యేడాది కంటే పెంపు..
జిల్లాలో 13,537 సంఘాలు ఉండగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.793.74 కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. గత యేడాది రూ.650 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు అందించారు. గత యేడాది కంటే ఈసారి అధికంగా రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. రుణాలు మంజూరు చేసే సంఘాల సంఖ్య పెరిగినప్పటికీ జిల్లాలోని పలు సంఘాలు బ్యాంకు లింకేజీ రుణ అర్హతను కోల్పోవడం గమనార్హం. ఇందులో కొత్తగా ఏర్పడిన సంఘాలతో పాటు సకాలంలో కిస్తీలు చెల్లించక రద్దయిన సంఘాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఫఅతివల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా..
అతివల ఆర్థిక అభివృద్దే లక్ష్యంగా బ్యాంకు లింకేజీ ద్వారా ఒక్కో సంఘానికి రూ.2లక్షల నుంచి రూ.20లక్షల వరకు రుణాలు అందించనున్నారు. ఈ రుణాలతో భారీ, చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు కిరాణ, వస్త్ర దుకాణాలు, టైలరింగ్ యూనిట్, వ్యవసాయ రంగానికి సంబంధించి నాటు కోళ్లు, చేపల పెంపకం, కూరగాయల సాగు, పండ్ల విక్రయాలు, ఫుడ్ కేటరింగ్, ఆహార ఉత్పత్తుల తయారీ, టిఫిన్ సెంటర్ల నిర్వహణ లాంటి వివిధ వ్యాపారాలతో ఉపాధి పొందవచ్చు. రుణాల చెల్లింపుకు సంబంధించి నెలవారీ కిస్తీలను సక్రమంగా చెల్లించడంతో పాటు పొదుపు పాటించేలా వారిని చైతన్య పరుస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
- రఘువరన్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి
ప్రతీ సంఘానికి ఆర్థిక చేయూత అందించాలనే ఉద్దేశంతో ఈ యేడాది బ్యాంకు లింకేజీ అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. సంఘాల్లోని సభ్యులు రుణాలు సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలి. కిస్తీలను ఎప్పటికప్పుడు చెల్లించినట్లయితే కొత్త రుణాలు పొందే అవకాశం ఉంటుంది. కిస్తీలు కట్టడంతో పాటు పొదుపు చేయడాన్ని అలవర్చుకోవాలి. క్షేత్ర స్థాయిలో సిబ్బంది, బ్యాంకర్ల సమన్వయంతో జిల్లాకు కేటాయించిన రుణ లక్ష్యాన్ని చేరుకుంటాం.
---------------------------------------------------------------------------------
మండలాల వారీగా కేటాయించిన నిధులు..
---------------------------------------------------------------------------------
మండలం - సంఘాలు - నిధులు (రూ.లక్షల్లో)
బీర్‌పూర్ - 402 - 22.98
బుగ్గారం - 398 - 21.69
ధర్మపురి - 779 - 43.00
గొల్లపల్లి - 1,035 - 58.81
ఇబ్రహీంపట్నం - 637 - 39.24
జగిత్యాల రూరల్ - 933 - 56.81
జగిత్యాల - 205 - 12.83
కథలాపూర్ - 803 - 47.61
కొడిమ్యాల - 827 - 46.34
కోరుట్ల - 734 - 43.66
మల్లాపూర్ - 929 - 65.41
మల్లాయ - 899 - 51.45
మేడిపల్లి - 895 - 47.12
మెట్‌పల్లి - 841 - 49.71
పెగడపల్లి - 804 - 46.27
రాయికల్ - 880 - 51.36
సారంగపూర్ - 488 - 31.16
వెల్గటూరు - 1,48 - 58.89
--------------------------------------------------
మొత్తం - 13,537 - 793.74
--------------------------------------------------