Jagitiala : వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం..
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:25 AM
జగిత్యాల, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి, ఇంటర్ పరీక్షా ఫలితాల్లో వంద శాతం ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ, ఇంటర్ విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
- ఎస్సెస్సీ, ఇంటర్‌లో ఉత్తమ ఫలితాల కోసం కసరత్తు
-వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
- అదనపు తరగతుల నిర్వహణ
జగిత్యాల, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి, ఇంటర్ పరీక్షా ఫలితాల్లో వంద శాతం ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ, ఇంటర్ విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు సిలబస్ పూర్తి చేశాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో గంట పాటు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. ఇంటర్ పరీక్షలు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. పదో తరగతి పరీక్షలు మార్చిలో జరగనున్నాయి. ఉపాధ్యాయులు ఒకవైపు పాఠ్యాంశాలను బోధిస్తూనే మరోవైపు విద్యార్థులను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. సబ్జెక్టుల వారీగా వారాంతపు పరీక్షలు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుకబడిన వారిని గుర్తించి, అర్థం కాని అంశాలను మళ్లీ వివరిస్తున్నారు.
ఫమెరుగైన ఫలితాల కోసం..
జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా విద్యాశాఖ ఈ ఏడాది ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాలో 12,688 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఎఫ్‌ఆర్‌ఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఉపాధ్యాయులు ఉదయం పాఠశాలలో అడుగు పెట్టింది మొదలు సాయంత్రం వెళ్లే సమయం వరకు ఆన్‌లైన్‌లో పక్కాగా రికార్డు చేస్తోంది. ఫలితంగా ఉపాధ్యాయుల హాజరుశాతం మెరుగుపడి విద్యార్థులకు ఉత్తమ విద్యా బోధన అందేలా చేస్తోంది. తనిఖీల విషయంలో మండల విద్యాధికారుల పనితీరును ఎప్పటికప్పుడు విశ్లేషిస్తోంది.
ఫసీబీఎస్‌ఈ తరహాలో..
గతంలో ఒక సబ్జెక్టుకు మరో సబ్జెక్టుకు మధ్య ఒక రోజు గ్యాప్ మాత్రమే ఉండేది. వెంటనే పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు రివిజన్ చేసుకునేందుకు తగిన సమయం ఉండేది కాదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యేవారు. దీంతో ఎస్సెస్సీ బోర్డు వార్షిక పరీక్షల తేదీల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంది. ఒక సబ్జెక్టుకు మరో సబ్జెక్టుకు మధ్య కనీసం నాలుగు రోజుల సమయం ఉండేలా చర్యలు చేపట్టింది. దీంతో చదివిన అంశాలను మళ్లీ పునశ్చరణ చేసుకునేందుకు విద్యార్థులకు సమయం దొరికినట్టయింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఫ 13,537 మంది ఇంటర్ విద్యార్థులు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వార్షిక పరీక్షల్లో వంద శాతం ఫలితాలే లక్ష్యంగా ఇంటర్ బోర్డు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నవంబరు 1వ తేదీ నుంచి జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక తరగతులను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు కస్తూర్బా, ఇతర గురుకుల జూనియర్ కళాశాలలు 42 వరకు ఉన్నాయి. ఇందులో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 26 ప్రభుత్వ, కస్తూర్బా, మోడల్, మైనార్టీ, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, లోకల్ బాడీస్, ఇతర సంక్షేమ కళాశాలలున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో సుమారు 2,950 మంది, ద్వితీయ సంవత్సరంలో సుమారు 2,430 మంది విద్యార్థులున్నారు. జిల్లాలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో 13,537 మంది ఇంటర్ చదువుతున్నారు.
ఫఒత్తిడిని అధిగమించేలా కౌన్సెలింగ్..
విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా ఉండడంతో పాటు మత్తుపదార్థాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పనకు ప్రతి కళాశాలలో ఒక లెక్చరర్‌ను కౌన్సెలర్‌గా నియమించారు. విద్యార్థులు అధికంగా ఉంటే మరొకరిని నియమించుకోవచ్చు. ఒత్తిడికి గురయ్యే విద్యార్థులను పర్యవేక్షిస్తూ దాని నుంచి బయటపడేలా చూస్తున్నారు.
ఉత్తమ ఫలితాల సాధనకు కృషి
- రాము, జిల్లా విద్యాశాఖాధికారి
జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైన కృషి చేస్తున్నాము. ఇప్పటికే విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ప్రారంభించాం. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాము. ప్రత్యేక తరగతులకు హాజరయేయ విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నాం.
ప్రత్యేక దృష్టి సారించాం
- బొప్పరాతి నారాయణ, జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి
అన్ని కళాశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా కార్యాచరణ అమలు చేశాము. తరగతులకు సరిగా హాజరు కాని విద్యార్థులపై దృష్టిసారించాం. ఫేస్ రికగ్నజేషన్ అటెండెన్స్ సిస్టంతో హాజరు మెరుగుపడింది. ఇంటర్ విద్యాశాఖ ఆదేశాల మేరకు గత యేడాది నవంబరు 1వ తేదీ నుంచి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాము. ఉత్తమ ఫలితాలు సాధించేలా ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నాం.