jagitiala : ఎస్సారెస్పీ వెలవెల
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:59 AM
జగిత్యాల, జూలై 12 (ఆంధ్రజ్యోతి): శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కి ఎగువ ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో వరద నీరు చేరడం లేదు. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచినా ప్రాజెక్టులోకి స్వల్పంగానే ప్రవాహం
- ఆశలన్నీ మహారాష్ట్ర వరదలపైనే
- ఆయకట్టు రైతులకు తప్పని ఎదురుచూపులు
- గత యేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో జల కళ
జగిత్యాల, జూలై 12 (ఆంధ్రజ్యోతి): శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కి ఎగువ ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో వరద నీరు చేరడం లేదు. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచినా ప్రాజెక్టులోకి స్వల్పంగానే ప్రవాహం వస్తుండడంతో నీటి నిల్వలు పెరగడం లేదు. దీంతో ఈ యేడాది వానాకాలం సాగుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఆదివారం ఉదయం 6 గంటల నాటికి ఎస్సారెస్పీ నీటి మట్టం 80.5 టీఎంసీల సామర్థ్యానికి గాను 15.149 టీఎంసీల నీరు నిల్వ నమోదైంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యంలో ప్రస్తుతం ఐదో వంతు నీరు కూడా నిల్వ లేదు. గత యేడాది ఇదే రోజున 20.518 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం దాదాపు 5 టీఎంసీల కంటే తక్కువ నిల్వ ఉంది. గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి సగటున 231 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే నమోదైంది. కాగా 817 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది. ఇందులో మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, అవిరీకరణకు 286 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు ఎస్‌ఆర్‌ఎస్‌పీ లోకి 1.965 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. అదేవిదంగా జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు డ్యామ్ నుంచి 3.102 టీఎంసీల నీటిని విడుదల చేశారు.
ఫమహారాష్ట్రలో వర్షాలు కురిస్తేనే...
రెండు, మూడు రోజులుగా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో గోదావరిలో ప్రవాహం కొంత పెరిగినప్పటికీ, ఎగువన ఉన్న ఇతర ప్రాజెక్టులు, బ్యారేజీల్లో నీటి నిల్వలు కొనసాగుతుండడంతో ఎస్సారెస్పీకి భారీగా వరద నీరు చేరడం లేదు. ఎగువ క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసి గోదావరికి భారీ వరదలు వస్తేనే ఎస్సారెస్పీలో నీటి నిల్వలు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఫప్రాజెక్టుపైనే ఆధారం..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి అందించే ప్రధాన ఆధారంగా ఉంది. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాకు కూడా ఈ ప్రాజెక్టే కీలక వనరుగా ఉంది. వానాకాలం సీజన్ ప్రారంభమైనా ప్రాజెక్టులోని నీటి నిల్వలు ఆశించిన స్థాయికి చేరకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం రైతుల ఆశలన్నీ ఎగువ ప్రాంతాల్లో కురిసే భారీ వర్షాలపైనే ఉన్నాయి.
ఫవరప్రదాయిని శ్రీరాంసాగర్..
జిల్లాలో రెండు, మూడు మినహా దాదాపుగా అన్ని మండలాల్లో శ్రీరాంసాగర్ కాకతీయ కాలువ ఆయకట్టు పరిధిలో ఉంది. ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి, కొడిమ్యాల వంటి మండలాలకు ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా సాగు నీరు అందుతోంది. జిల్లా రైతాంగానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరప్రదాయినిగా ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద జగిత్యాల జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 1.60 లక్షలు, ఆదిలాబాద్‌లో 1.45 లక్షలు, కరీంనగర్ 6.72 లక్షలు, వరంగల్ 4.71 లక్షలు, ఖమ్మం 1.28 లక్షలు, నల్లగొండ 2.87 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇదిలా ఉండగా జగిత్యాల జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 4.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారన్న అంచనా ఉంది. ఇందులో వరి దాదాపు 3.5 లక్షల ఎకరాలకు పైగా సాగు అవుతుందని వ్యవసాయ అధికారులు అంటున్నారు.
-----------------------------------------------------
ఎస్సారెస్పీ ప్రాజెక్టు వివరాలు..
-----------------------------------------------------
పూర్తి నిల్వ సామర్థ్యం..80.5 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ..15.149 టీఎంసీలు
గత యేడాది ఇదే సమయానికి నీటి నిల్వ..20.518 టీఎంసీలు
24 గంటల్లో ఇన్‌ఫ్లో...231 క్యూసెక్కులు
24 గంటల్లో అవుట్ ఫ్లో...817 క్యూసెక్కులు
జూన్ 1 నుంచి మొత్తం ఇన్ ఫ్లో...1.965 టీఎంసీలు
జూన్ 1 నుంచి మొత్తం అవుట్ ఫ్లో...3.102 టీఎంసీలు