Share News

Jagitiala : కొనుగోళ్లు వేగవంతం

ABN , Publish Date - May 16 , 2026 | 12:31 AM

జగిత్యాల, మే 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నాలుగైదు రోజులుగా ధాన్యం కొనుగోళ్లలో వేగం పుంజుకుంది.

Jagitiala :   కొనుగోళ్లు వేగవంతం

- ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మిల్లుల్లో కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

- తూకం, హమాలీ, లోడింగ్‌, అన లోడింగ్‌లపై ప్రత్యక్ష పర్యవేక్షణ

- దిగుమతి చేసుకోని మిల్లర్లపై ఆగ్రహం

- ఇప్పటివరకు 1,52,467 మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు

జగిత్యాల, మే 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నాలుగైదు రోజులుగా ధాన్యం కొనుగోళ్లలో వేగం పుంజుకుంది. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచేందుకు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సుడిగాలి పర్యటనలతో క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. పలు మండలాల్లో పర్యటిస్తూ ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు కేంద్రాల్లో స్థితిగతులను స్వయంగా పరిశీలిస్తున్నారు. కేంద్రాల్లో కొనుగోలు పరిస్థితిని, హమాలీ, తూకం, లోడింగ్‌, ట్రాన్సపోర్టు, అనలోడింగ్‌ తదితర సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. పలు రైస్‌ మిల్లులను సందర్శించి అనలోడింగ్‌ త్వరగా జరిగేలా ఆదేశిస్తున్నారు. అనలోడింగ్‌కు సహకరించని మిల్లర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం, ట్రాన్సపోర్టు ఆపరేటర్లతో సమీక్షలు జరపడం వంటివి చేస్తున్నారు. అనలోడింగ్‌లో జాప్యం చేస్తున్న జిల్లాలోని మూడు మిల్లులకు నోటీసులు సైతం జారీ చేశారు. కేంద్రాలకు ధాన్యం తరలించిన రైతులతో మాట్లాడుతూ.. ఇబ్బందులను వింటూ.. పరిష్కారానికి అక్కడికక్కడే చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పుంజుకుంది.

రైతుల్లో విశ్వాసం నింపుతూ..

జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో ఆలస్యం ఉండదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇస్తుండడంతో రైతుల్లో విశ్వాసం పెరిగింది. కలెక్టర్‌ సత్యప్రసాద్‌తో పాటు ఆయా ప్రాంతాలకు చెందిన ఆర్డీవోలు, తహసీల్దార్లు, సివిల్‌ సప్లయిస్‌ శాఖ, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన, ట్రాన్సపోర్టు తదితర శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది కేంద్రాల్లో నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు అధికారులు సెంటర్ల వద్దే అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు.

టోల్‌ ఫ్రీ నంబరు ఏర్పాటు..

జిల్లావ్యాప్తంగా ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు నెలకొంటున్న సమస్యలను విన్నవించడానికి కలెక్టర్‌ సత్యప్రసాద్‌ టోల్‌ఫ్రీ నంబరు 18004258187ను ఏర్పాటు చేశారు. సమస్యలను చక్కదిద్దే బాధ్యతను అధికారులకు అప్పగించారు. ఇందుకోసం తహసీల్దార్‌తో పాటు ఇతర ఉద్యోగులకు పర్యవేక్షణ పెంచడం, వరుస క్రమంలో ధాన్యం కాంటాలు పెంచడం, ధాన్యం రవాణా చేయడం, మిల్లులో దిగుమతి చేసుకునేలా చూడాలని ఆదేశించారు. రైతులకు సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించేందుకు కలెక్టర్‌ కార్యాలయంలో హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేశారు.

రవాణా, అనలోడింగ్‌ ఇబ్బందులపై ఆగ్రహం..

కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం, మొక్కజొన్న బస్తాల్లో నింపి కాంటాలు పెట్టినా..రవాణా చేసుకునేందుకు సరైన వాహనాలు లేకపోవడంతో కేంద్రాల్లోనే బస్తాలు ఉంటున్నాయి. దీనిపై ఆరా తీసిన కలెక్టర్‌ సత్యప్రసాద్‌ దిగుమతి చేసుకోకుండా మిల్లర్లు మొండికేయడంతో లారీలు ఆలస్యం అవుతున్నాయని తెలుసుకున్నారు. దీనిపై మిల్లరతో సమీక్ష జరిపారు. సామర్థ్యం తగ్గట్టుగా ధాన్యం దిగుమతి చేసుకోవాలని లేకపోతే మిల్లులను సీజ్‌ చేస్తామని చెప్పారు. జిల్లాలో ధాన్యం దిగుమతిలో జాప్యం చేస్తున్న మూడు మిల్లులను గుర్తించి నోటీసులు జారీచేశారు. టెండర్‌ ఒప్పందం ప్రకారం లారీలను కాంట్రాక్టర్లు సెంటర్లకు తేవాలని ఆదేశించారు. స్థానికంగా ఉన్న లారీ, ట్రాక్టర్‌ యజమానులతో మాట్లాడి ధాన్యం తరలించడానికి ప్రయత్నాలు చేశారు.

అకాల వర్షాల నష్టం నివారణకు..

జిల్లాలో కొన్నిరోజులుగా ఆయా సందర్భాల్లో కురుస్తున్న అకాల వర్షాల వల్ల నష్టాన్ని నివారించడానికి కలెక్టర్‌ సత్యప్రసాద్‌ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడవడం, లారీల కొరత, మిల్లులకు తరలింపులో జాప్యం వంటి సమస్యలను నివారించేందుకు కేంద్రాల్లో అడుగుపెడుతున్నారు. ప్రధానంగా మిల్లుల్లో దీర్ఘకాలంగా వాహనాలు నిలువకుండా, వెంటనే లోడింగ్‌, అనలోడింగ్‌ జరగాలని మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో 433 కొనుగోలు కేంద్రాలు..

జిల్లావ్యాప్తంగా 433 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచారు. ఇందులో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 292 కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 140, మెప్మా ఆధ్వర్యంలో ఒకటి కేంద్రాల్లో కొనుగోల్లు జరుపుతున్నారు. కేంద్రాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 1,52,467 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. కేంద్రాలకు రైతులు పెద్దఎత్తున వస్తుండడంతో కేంద్రాల వద్ద రద్దీ కనిపిస్తోంది. కొనుగోలు చేసిన ధాన్యంలో 1,33,025 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. ప్రత్యేక వాహనాలు కేటాయించడం వల్ల లాజిస్టిక్స్‌లో ఆలస్యం తగ్గింది. ప్రస్తుతం కేంద్రాల్లో ఇంకా సుమారు 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు అంచనా ఉంది. కేంద్రాల్లో ఉన్న ధాన్యం కూడా త్వరగా కొనుగోలు చేసేలా కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు.

రైతుల ఖాతాల్లో రూ. 219.30 కోట్లు జమ...

జిల్లాలో ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 18,434 మంది రైతులకు చెందిన రూ. 364.13 కోట్లు విలువ గల 1,52,467 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో రూ. 277.92 కోట్ల విలువ గల 1,16,497 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఆనలైనలో ఎంట్రీ చేశారు. కాగా రూ. 246.92 కోట్ల విలువ గల 1,03,356 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి ట్రక్‌ షీట్‌ జనరేట్‌ అయింది. రైస్‌ మిల్లర్ల అందజేసిన 13,488 మంది రైతులకు చెందిన 91,795 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి సంబంధించిన రూ. 219.30 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. రైతులు ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించిన సమయం నుంచి ఆరబెట్టడం, తూకం వేయడం, హమాలీ, లోడింగ్‌, ట్రాన్సపోర్టు, అనలోడింగ్‌, ఆనలైన ఎంట్రీ, మిల్లర్‌ అక్‌నాలెడ్జ్‌మెంట్‌, ట్రక్‌ షీట్‌ జనరేట్‌, రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయడం వరకు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఎలాంటి జాప్యం జరగకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు మొదలుకొని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే వరకు వేగంగా పనులను చేయిస్తున్నారు.

ప్రతీ గింజా కొంటాం..

- సత్యప్రసాద్‌, కలెక్టర్‌

కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. రైతులు అధైర్య పడవద్దు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ప్రతీ గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వరుస క్రమంగా కాంటాలు పెట్టి మిల్లులకు తరలిస్తున్నాము. కొనుగోళ్లు వేగవంతంగా జరిగేందుకు రైతులు సహకరించాలి. ఇబ్బందులు కలిగితే టోల్‌ ఫ్రీ నంబరులో ఫిర్యాదు చేయాలి.

Updated Date - May 16 , 2026 | 12:31 AM