Jagitiala : విజృంభిస్తున్న జ్వరాలు
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:52 AM
జగిత్యాల, జూలై 5 (ఆంధ్రజ్యోతి): వానాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులతో ప్రజలు ఆసుపత్రులకు వరుస కడుతున్నారు. ప్రధానంగా జ్వరం, జలుబు, దగ్గు,
-ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులల్లో రోగుల కిటకిట
-పెరుగుతున్న సీజనల్ వ్యాధుల బాధితులు
-పరిసరాల పరిశుభ్రత పాటించాలంటున్న వైద్యులు
జగిత్యాల, జూలై 5 (ఆంధ్రజ్యోతి): వానాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులతో ప్రజలు ఆసుపత్రులకు వరుస కడుతున్నారు. ప్రధానంగా జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పితో ఆసుపత్రుల బాట పడుతున్నారు. వైరల్ జ్వరాలు, డెంగీ, టైఫాయిడ్ వ్యాప్తి చెందుతుండ డంతో వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ తదితర శాఖల అధికారులు దృష్టి సారించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నిత్యం వందల సంఖ్యలో వైరల్ ఫీవర్ కేసులు, అక్కడక్కడ డెంగీ, మలేరియా కేసులు ఉంటున్నట్లు వైద్య వర్గాలు అంటున్నాయి. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మునిసిపాల్టీలతో పాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాల కేసులు పెరుగుతోంది. కానీ ప్రైవేటు ల్యాబ్‌లు, ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు వైద్య అధికారులకు సమాచారం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
ఫజిల్లాలో వైద్య ఆరోగ్య పరిస్థితి ఇలా..
జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రితో పాటు మెడికల్ కళాశాలకు అనుబంధంగా మాతా శిశు కేంద్రం పనిచేస్తున్నాయి. వీటితో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గల 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 151 సబ్ సెంటర్లు, 24 గంటలు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 71 పల్లె దవాఖానలు, మూడు బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలు వైద్య సేవలు అందిస్తున్నారు. వీటితో పాటు సుమారు 200 వరకు పలు ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. జిల్లాలో 2025 సంవత్సరంలో 27 డెంగీ కేసులు, 2026 సంవత్సరంలో ఇప్పటి వరకు రెండు డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వారం రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఔట్‌పేషంట్ల సంఖ్య, ఇన్ పేషంట్ల సంఖ్య రెట్టింపు అయినట్లుగా తెలుస్తోంది.
ఫజ్వరం తగ్గకపోతే పరీక్షలు...
రోగాల బారిన పడి ఆసుపత్రులకు వస్తున్న వారిలో మూడు, నాలుగు రోజుల్లో జ్వరాలు తగ్గకపోతే డెంగీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడైతే డెంగీ కేసు నమోదు అయిందని సమాచారం వస్తే వెంటనే అక్కడి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది వెళ్లి ఇంటి పరిసరాల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేస్తున్నారు. మరోవైపు కాలనీలు, అపార్ట్‌మెంట్ వాసులు చెత్తను రహదారులపై పారబోయకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. గతంలో ప్రతీ శుక్రవారం ఒక్క రోజు మాత్రమే డ్రైడే పాటించగా, ప్రస్తుతం సీజన్ ముగిసే వరకు నిత్యం డ్రైడేగా పాటిస్తున్నారు.
ఫపెరిగిన ఆర్‌ఎంపీల రెఫరెన్స్‌లు...
జిల్లాలోని పలు పల్లెల్లో ఆర్‌ఎంపీలదే హవా కొనసాగుతోంది. పల్లె ప్రాంతాల్లో జ్వర పీడితులు ఎక్కువగా ఉంటుండడంతో ముందుగా స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలు రెండు, మూడు రోజుల పాటు చికిత్స అందిస్తుండగా జ్వరాలు తగ్గని పరిస్థితుల్లో పట్టణాలు, నగరాల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారు. పట్టణాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం రోగుల తాకిడి పెరిగింది. రోగుల అవసరాలను ఆసరా చేసుకుంటున్న ప్రైవేటు యాజమాన్యాలు రూ.వేలల్లో ఫీజులు గుంజుతున్నాయి. ఇందులో కొంత మొత్తాన్ని రెఫర్ చేసిన ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ప్రైవేటు ఆసుపత్రులు కమీషన్ల రూపంలో చెల్లిస్తున్నాయి.
ఫఇవి పాటిస్తే మేలు...
దోమకాటుతో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, బోదకాలు, మెదడు వాపు తదితర వ్యాధులు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. వీటి నివారణకు గ్రామాల్లో నిలిచిన నీటి గుంతల్లో ఆయిల్ బాల్స్ వేయడం, లేదంటే దోమలను తినే గంబూసియా అప్పినిస్ చేపలను వాటిలో వేసి గుంతలు పూడ్చాలి. మురుగు కాలువలు శుభ్రంగా ఉంచడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ లాంటివి చేయాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడడం, వారానికోసారి డ్రమ్ముల్లోని నీటిని పారబోయాలి. నీటి ట్యాంకులు, డ్రమ్ములు, మంచి నీటి ట్యాంకులపై మూతలు పెట్టడం, కొబ్బరి చిప్పలు, పాత టైర్లలో నీరు నిల్వ లేకుండా చూడాల్సిన బాధ్యతల గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరముంది.
వ్యాదులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం
-శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌వో, జగిత్యాల
జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాము. డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు వహిస్తున్నాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను చైతన్యపరుస్తున్నాం. మురుగు నీరు నిలువ ఉన్న ప్రాంతాలను గుర్తించడం, ఇళ్లలో ట్యాంకులు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు తదితర వాటిల్లో నీరు నిల్వ ఉండి లార్వా పెరిగే అవకాశాలున్న వాటిని గుర్తించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.