Jagitiala : ధరాఘాతం
ABN , Publish Date - Mar 16 , 2026 | 01:31 AM
జగిత్యాల, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం భారత్‌పై పడుతోంది. యుద్ధం కారణంగా వంట నూనెలు, గ్యాస్ ధరల పెంపు, గ్యాస్ కొరత పేద, మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది కలిగిస్తోంది.
- పశ్చిమాసియాలో యుద్ధంతో పెరుగుతున్న ధరలు
- వంట నూనెలు, గ్యాస్ ధరలపై ప్రభావం
-పేద, మధ్య తరగతిపై ఆర్థిక భారం
- హోటళ్లకు గ్యాస్ సిలెండర్ల సరఫరాపై సందిగ్ధం
జగిత్యాల, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం భారత్‌పై పడుతోంది. యుద్ధం కారణంగా వంట నూనెలు, గ్యాస్ ధరల పెంపు, గ్యాస్ కొరత పేద, మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది కలిగిస్తోంది. మరోవైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
ఫవంట నూనె ధరలు పైపైకి..
వంట నూనెలకు సంబంధించిన ముడి సరుకును పశ్చిమాసియా దేశాల నుంచి మన దేశం ఎగుమతి చేసుకుంటుంది. అక్కడ యుద్ధం కొనసాగుతుండడంతో దిగుమతులు జరగడం లేదు. దీంతో వారం క్రితం లీటరు సన్ ప్లవర్ నూనె ధర రూ.160 ఉండగా, ప్రస్తుతం రూ.18 పెరిగింది. పల్లినూనె ఏకంగా కిలోకు రూ.24 పెరిగింది.
ఫగ్యాస్ ధర పెంపు, కొరతతో ఇక్కట్లు
గృహ అవసరాలకు వినియోగించే సబ్సిడీ సిలిండర్ ధర రూ.60 పెరగగా, కమర్షియల్ సిలిండర్ ధర రూ.115 పెరిగింది. దీంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గ్యాస్ కొరత నేపథ్యంలో దేశంలో విద్య, వైద్య రంగాలకు మినహా వ్యాపారులకు కమర్షియల్ సిలిండర్లు విక్రయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, మెస్‌లకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను ఏజన్సీలు సరఫరా చేయడం తగ్గించాయి. మరికొన్ని ప్రాంతాల్లో సంపూర్ణంగా సరఫరాను నిలిపివేశారు. ఫలితంగా నాలుగు రోజులుగా వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలువురు వ్యాపారులు గ్యాస్ లేక దుకాణాలు బంద్ చేయగా కొందరు ఉన్న సిలిండర్లతోనే నెట్టుకొస్తున్నారు. మరికొందరు ప్రత్యామ్నయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. పరిస్థితి ఇలాగా ఉంటే మరో రెండు, మూడు రోజుల్లో టిఫిన్ సెంటర్ల, హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మూసివేసే పరిస్థితి ఎదురుకానుంది.
ధరల పెరుగుదల ఇలా..
----------------------------------------------------------------------------------
వస్తువు...గతంలో ధర....ప్రస్తుతం...పెరిగిన ధర
----------------------------------------------------------------------------------
గృహ సిలిండర్..రూ. 924..రూ. 984..రూ. 60
కమర్షియల్ సిలిండర్..రూ. 2,501...రూ. 2,166...రూ.115
సన్‌ఫ్లవర్ ఆయిల్(1లీటరు) రూ. 160...రూ. 178..రూ.18
పల్లినూనె (1లీటరు)..రూ. 170...రూ.180...రూ.10
పల్లీలు (1కిలో)...రూ. 180..రూ.204..రూ.24
----------------------------------------------------------------------------------
జిల్లాలో మొత్తం సిలిండర్లు..3,47,152
దీపం పథకం సిలిండర్లు...55,705
ఉజ్వల పథకం సిలిండర్లు..48,987
సాధారణ కనెక్షన్ సిలిండర్లు...2,42,460
----------------------------------------------------------------------------------
ధరల పెరుగుదలతో ఆర్థిక భారం
- అడిగొప్పుల రజిని, గృహిణి, మెట్‌పల్లి
రోజురోజుకూ పెరుగుతున్న ధరల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. సిలిండర్లు, వంట నూనెల ధరల పెంపుతో ఆర్థిక భారం ఎక్కువగా ఉంటుంది. పేద, మధ్య తరగతి కుటుంబాల సభ్యులకు ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నాయి.
ధరలు నియంత్రించాలి
-శంకర్, అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు, జగిత్యాల జిల్లా
సామాన్యులకు అవసరమైన నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ప్రభుత్వం నియంత్రించాలి. సిలిండర్లు, వంట నూనెల ధరలు పెరగడం వల్ల ప్రతీ కుటుంబంపై మరింత ఆర్థిక భారం పడుతుంది.