Share News

Jagitiala : ఉపాఽధ్యాయుల సర్దుబాటుకు సన్నాహాలు

ABN , Publish Date - Jun 29 , 2026 | 01:15 AM

జగిత్యాల, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Jagitiala :  ఉపాఽధ్యాయుల సర్దుబాటుకు సన్నాహాలు

-రిటైర్డు, సెలవుల్లో ఉన్న టీచర్ల స్థానంలో వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌

-విద్యాశాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులతో అధికారుల కసరత్తు

-గత విద్యా సంవత్సరం జిల్లాలో 200 మంది సర్దుబాటు

జగిత్యాల, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ (పని సర్దుబాటు) చేయనున్నారు. ఆయా స్కూళ్లలో మిగులు (సర్‌ ప్లస్‌) ఉన్న ఉపాధ్యాయులను కొరత ఉన్న చోట్ల సర్దుబాటు చేయడానికి విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. 2021లో జారీ చేసిన జీవో నంబరు 25 ఆధారంగా సర్దుబాటు చేపట్టేలా మార్గదర్శకాలు విడుదల చేశారు. కేవలం జిల్లా పరిధిలో కలెక్టర్‌ అనుమతితో మాత్రమే డిప్యూటేషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరించనుండగా లోకల్‌ బాడీ అడిషనల్‌ కలెక్టర్‌, జడ్పీ సీఈవో సభ్యులుగా, డిస్ట్రిక్ట్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ మెంబర్‌ సెక్రెటరీగా వ్యవహరిస్తారు. ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్న ఉపాధ్యాయులకు సర్దుబాటు నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.

ఫవిద్యార్థుల సంఖ్య ఇలా..

గత విద్యా సంవత్సరం జిల్లాలో 752 పాఠశాలల్లో 56 వేల మంది విద్యార్థులున్నారు. అందులో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పై తరగతి చదువుల కోసం వెళ్లిపోయారు. ప్రస్తుతం పాఠశాలల విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. జూలై వరకు విద్యార్థుల సంఖ్య పరిగణనలోకి తీసుకొని టీచర్ల సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3,971 ఉపాధ్యాయ పోస్టులున్నాయి. గత యేడాది జిల్లాలో మూడు విడతలుగా ఉపాధ్యా యుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టారు. జిల్లాలో గత యేడాది రెండు వందల మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ప్రస్తుతం సంబంధిత ఉపాధ్యాయులు సర్దుబాటు జరిగిన పోస్టుల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు.

ఫపలు సబ్జెక్టులు బోధించే టీచర్ల కొరత

ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందడం, బదిలీలు, పదోన్నతుల మూలంగా చాలా హైస్కూళ్లలో పలు సబ్జెక్టులను బోధించే ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించే వెసులుబాటు ఉన్నప్పటికీ ఉన్నత పాఠశాలల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రధానంగా ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు వంటి లాంగ్వేజెస్‌ బోధించే ఉపాధ్యాయుల కొరత ఉంది. దీంతో చాలా పాఠశాలల్లో ఆయా సబ్జెక్టులను బోధిస్తున్న టీచర్లతో పాటు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నేళ్లుగా రెగ్యులర్‌ నియామకాలు చేపట్టకపోవడంతో అధిక సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయి.

ఫఎంఈవోల నుంచి సమాచార సేకరణ

జిల్లాలో అవసరం మేరకు పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయులను వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఉద్యోగ విరమణ పొందిన, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న టీచర్ల స్థానంలో వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేయాలని ఆదేశించారు. దీంతో జిల్లాలో ఏ పాఠశాలలో ఎంత మంది ఉన్నారనేది జిల్లా విద్యాశాఖ అన్ని మండలాల ఎంఈవోల నుంచి సమాచారం సేకరిస్తోంది. ఈమేరకు ఎక్కడెక్కడ మిగులు టీచర్లు ఉన్నారో లెక్క తీస్తున్నారు. టీచర్ల వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌పై ఎంఈవోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఫజూన్‌ 20 వరకు విద్యార్థుల నమోదు ఆధారంగా...

పాఠశాలల వారీగా ఈనెల 20వ తేదీ వరకు విద్యార్థుల నమోదు ఆధారంగా ఉపాధ్యాయులకు వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఉద్యోగ విరమణ పొందిన, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వారి స్థానంతో పాటు త్వరలోనే మళ్లీ పాఠశాలల తనిఖీ బృందాలుగా కూడా పలువురు ఉపాధ్యాయులను నియమించనున్నారు. దీంతో వారి స్థానంలో కూడా టీచర్ల సర్ధుబాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి టీచర్లు తక్కువగా ఉండడం, విద్యార్థులు తక్కువగా ఉండి టీచర్లు ఎక్కువగా ఉన్నప్పుడు మిగులు టీచర్లను గుర్తించి అవసరం ఉన్న పాఠశాలలకు వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలలు, కొన్ని హైస్కూల్స్‌లో పలు సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ఇప్పటికే పలువురు ప్రధానోపాధ్యాయులు తమకు సబ్జెక్టు టీచర్లు అవసరం ఉన్నారని ఎంఈవోలు, డీఈవో దృష్టికి తీసుకువచ్చారని సమాచారం. గత విద్యా సంవత్సరం వివిధ కారణాల వల్ల 33 ప్రభుత్వ పాఠశాలలు మూతపడగా .అందులో ప్రస్తుత విద్యా సంవత్సరం పదమూడు పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి.

ఫసర్దుబాటు ఇలా..

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు 19 మంది విద్యార్థులుంటే ఒక్క ఉపాధ్యాయుడు, 20 నుంచి 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, 61 నుంచి 90 వరకు విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండాల్సి ఉంటుంది. 91 నుంచి 120 వరకు నలుగురు, 121 నుంచి 150 వరకు ఐదుగురు, 151 నుంచి 200 వరకు ఆరుగురు, 201 నుంచి 240 వరకు ఏడుగురు గురు, 241 నుంచి 280 వరకు 8 మంది, 281 నుంచి 320 వరకు 9 మంది, 321 నుంచి 360 వరకు 10 మంది, 361 నుంచి 400 వరకు విద్యార్థులకు 11 మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉంది.

ఫ6నుంచి 7వ తరగతి వరకు ఇలా..

వందలోపు విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలల్లో నలుగురు ఉపాధ్యాయులు, 101 నుంచి 140 వరకు ఐదుగురు, 141 నుంచి 175 వరకు ఆరుగురు, 176 నుంచి 210 వరకు ఏడుగురు, 211 నుంచి 245 వరకు 8మంది, 246 నుంచి 280 వరకు 9 మంది, 281 నుంచి 315 వరకు 10 మంది, 316 నుంచి 350 వరకు 11 మంది, 351 నుంచి 385 వరకు విద్యార్థులకు 12 మంది ఉపాధ్యాయులుండాలన్న మార్గదర్శకాలున్నాయి.

ఫహైస్కూళ్లలో ఇలా..

ప్రభుత్వ పాఠశాలల్లో 220 మంది విద్యార్థులుంటే 9 మంది, 221 నుంచి 250 వరకు 10 మంది, 251 నుంచి 280 వరకు 11 మంది, 281 నుంచి 310 వరకు 12 మంది, 311 నుంచి 340 వరకు 14 మంది, 341 నుంచి 370 వరకు 15 మంది, 371 నుంచి 400 వరకు 16 మంది, 401 నుంచి 430 వరకు 18 మంది, 431 నుంచి 460 వరకు 19 మంది, 461 నుంచి 490 వరకు 20 మంది ఉపాధ్యాయులుండాలన్న మార్గదర్శకాలున్నాయి. 491 నుంచి 520 వరకు 21 మంది, 521 నుంచి 550 వరకు 22 మంది, 551 నుంచి 610 మంది 23 మంది, 611 నుంచి 670 వరకు 26 మంది, 671 నుంచి 700 వరకు విద్యార్థులున్న పాఠశాలల్లో 27 మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉంది.

Updated Date - Jun 29 , 2026 | 01:15 AM