Jagitiala : ‘పీఠ’ ముడి
ABN , Publish Date - Feb 15 , 2026 | 01:16 AM
జగిత్యాల, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలోని మున్సిపాలిటీల్లో చైర్మన, వైస్‌చైర్మన ఎన్నిక రాజకీయం ఆసక్తికరంగా మారింది.
- హంగ్‌లో కింగ్ ఎవరు?
- ప్రారంభమైన క్యాంపు రాజకీయాలు
- చైర్మన, వైస్‌చైర్మన స్థానాల కైవసానికి కదులుతున్న పావులు
- హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఉత్కంఠ
- జగిత్యాల, మెట్‌పల్లి కౌన్సిలర్లు ఇతర ప్రాంతాలకు తరలింపు
జగిత్యాల, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలోని మున్సిపాలిటీల్లో చైర్మన, వైస్‌చైర్మన ఎన్నిక రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ, విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు నువ్వా-నేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి. జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో వార్డు కౌన్సిలర్ల ఫలితాలు మూడు పార్టీలకు, రెబల్స్‌కు దగ్గరగా వచ్చాయి. ఏ ఒక్క పార్టీకి చైర్మన పదవిని చేజిక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. ఈ పరిస్థితి నెలకొన్న జిల్లాలోని జగిత్యాల, మెట్‌పల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో ఈనెల 16వ తేదీన నిర్వహించే చైర్మన, వైస్‌చైర్మన పదవులకు నిర్వహించే ఎన్నిక రసవత్తరంగా మారింది. స్వతంత్రంగా పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థులు, కాంగ్రెస్ రెబల్స్, బీజేపీ రెబల్స్ కీలకంగా మారడంతో ప్రధాన రాజకీయ పక్షాలు వ్యూహ ప్రతి వ్యూహాల్లో తలమునకలయ్యాయి. ఒక పార్టీ నుంచి గెలుపొందిన వారికి, స్వతంత్రులకు, రెబల్స్‌కు మరో పార్టీ నేతలు వల వేస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు అప్రమత్తమయ్యాయి. తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన విజేతలను ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు తరలించాయి. ప్రధానంగా జగిత్యాల మున్సిపల్, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. జగిత్యాలలో ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్ అనుచరుల్లో విజేతలను, మాజీమంత్రి తాటిపర్తి జీవనరెడ్డి అనుచరుల్లో విజేతలను వేర్వేరుగా ఇరువర్గాలు క్యాంపునకు తరలించాయి.
జగిత్యాలలో జోరుగా క్యాంపులు..
జగిత్యాల మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు జోరుగా జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన ఈనెల 13వ తేదీననే అర్ధరాత్రి సమయంలో ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్ వర్గీయులు క్యాంపుకను తరలివెళ్లారు. చైర్మన, వైస్ చైర్మన స్థానాలను కైవసం చేసుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్(26)కు అవసరమైన కౌన్సిలర్లతో క్యాంపునకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. వరంగల్, హైద్రాబాద్‌లోని రహస్య ప్రాంతాల్లో ఎమ్మెల్యే సంజయ్ వర్గీయులు క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందిన కాంగ్రెస్ బీఫామ్‌పై పోటీ చేసి విజయం సాధించిన 16 మంది అనుచరులు, కాంగ్రెస్ రెబల్స్‌గా పోటీ చేసి గెలుపొందిన ఇద్దరు అభ్యర్థులు, మాజీ మంత్రి జీవన రెడ్డి అనుచరునిగా ముద్రపడిన ఓ కాంగ్రెస్ కౌన్సిలర్, మరో ఏడుగురు ఇతర పార్టీలు, స్వతంత్రులు క్యాంపులో ఉన్నట్లు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా మాజీమంత్రి తాటిపర్తి జీవనరెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ బీఫామ్‌పై పోటీచేసి విజయం సాధించిన ఏడుగురు, 9 మంది కాంగ్రెస్ రెబల్ విజేతలు, పలువురు స్వతంత్రులు, ఇతర పార్టీల విజేతలు క్యాంపునకు తరలివెళ్లినట్లు చర్చించుకుంటున్నారు.
జగిత్యాల మున్సిపల్‌లో 50 వార్డు కౌన్సిలర్ స్థానాలుండగా కాంగ్రెస్ 23, బీజేపీ 6, బీఆర్‌ఎస్ 4, ఎంఐఎం 2, స్వతంత్రులు 15 మంది విజయం సాధించారు. స్వతంత్ర కౌన్సిలర్లలో ముగ్గురు బీజేపీ రెబల్స్ కాగా, 10 మంది మాజీ మంత్రి జీవనరెడ్డి అనచరులు, ఇద్దరు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అనుచరులున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ బీఫామ్‌పై పోటీచేసి గెలిచిన 23 మంది అభ్యర్థుల్లో ఏడుగురు మాజీ మంత్రి జీవనరెడ్డి వర్గీయులు, 16 మంది ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గీయులున్నారు. చైర్మన స్థానాన్ని కైవసం చేసుకోవడానికి 26 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం ఉండగా, మ్యాజిక్ ఫిగర్‌ను ఏ పార్టీ సాధించలేకపోయింది. ఎంఐఎం గానీ, స్వతంత్రుల మద్దతు తీసుకుంటేనే కాంగ్రెస్ చైర్మన సీటును కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. జగిత్యాలలో చైర్మన, వైస్ చైర్మన పదవిని కాంగ్రెస్ చేజిక్కించుకోవడం నల్లేరుపై నడకే అయినప్పటికీ ఎమ్మెల్యే సంజయ్ అనుచరులకు దక్కుతుందా..మాజీ మంత్రి జీవనరెడ్డి అనుచరులకు దక్కుతుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కాగా జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వర్గంలో సమిళ్ల వాణి శ్రీనివాస్, అడువాల జ్యోతిలక్ష్మణ్, మాజీ మంత్రి జీవనరెడ్డి వర్గంలో ములస్తం లావణ్య, తోపారపు లావణ్య చైర్‌పర్సన రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.
మెట్‌పల్లిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ వేర్వేరు క్యాంపులు
జిల్లాలోని మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు వేర్వేరుగా క్యాంపులకు తెరలేపాయి. కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇనచార్జి జువ్వాడి నర్సింగ్‌రావు సూచనలతో ఆరుగురు కాంగ్రెస్ విజేతలు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సలహాతో ఆరుగురు బీఆర్‌ఎస్ విజేతలు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ దిశానిర్దేశంతో 10 మంది బీజేపీ విజేతలు వేర్వేరుగా క్యాంపులు నిర్వహిస్తున్నాయి. మెట్‌పల్లిలో 26 మంది కౌన్సిలర్లకు గానూ మ్యాజిక్ ఫిగర్ 14ను ఏపార్టీ దక్కించుకోలేకపోయింది. మెట్‌పల్లిలో 10 బీజేపీ, 6 బీఆర్‌ఎస్, 6 కాంగ్రెస్, నలుగురు స్వతంత్రులు గెలుపొందారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌తో గానీ స్వతంత్రులతో గానీ జతకట్టి బీజేపీ విజయ కేతనం ఎగురవేస్తుందన్న అంచనాలున్నాయి. కాగా రాయికల్ మున్సిపల్‌లో 12 స్థానాలకు గానూ 3 కాంగ్రెస్, 5 బీజేపీ, 3 బీఆర్‌ఎస్, ఒకరు స్వతంత్రులు గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన ఏడు స్థానాలు ఏ పార్టీకి రాలేదు. దీంతో మూడు ప్రధాన పార్టీలు ఎవరికి వారు క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్, స్వతంత్రుల మద్దతుతో బీజేపీ చైర్మన సీటును కైవసం చేసుకోవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు సైతం అంతర్గత ఒప్పందం కుదుర్చుకొని చైర్మన స్థానాన్ని ‘చే’జిక్కించుకుంటాయన్న మరో ప్రచారం జరుగుతోంది. ఈ రెండు పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఒక్క ప్రాంతంలోనే క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు చైర్మన పదవిని అప్పగించి బీఆర్‌ఎస్ వైస్‌చైర్మన దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుందన్న అభిప్రాయాలున్నాయి. మెట్‌పల్లిలో కాంగ్రెస్ నుంచి మైలారపు లింబాద్రి, బీఆర్‌ఎస్ నుంచి పూదరి జ్యోతి, అంగడి పురుషోత్తం, బీజేపీ నుంచి చైర్మన రేసులో చెట్లపల్లి మీనా, బొడ్ల రమేశ, ధర్మపురి స్వరూప, పుడికారపు దివ్యారెడ్డి పేర్లు చర్చలోకి వస్తున్నాయి.
రాయికల్‌పై కమలనాథుల ఆశలు..
జిల్లాలోని రాయికల్ మున్సిపాలిటీ చైర్మన గిరిపై కమలనాథులు ఆశలు పెంచుకున్నారు. రాయికల్‌లో 12 వార్డులుండగా 5 బీజేపీ, 3 కాంగ్రెస్, 3 బీఆర్‌ఎస్, 1 స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడ చైర్మన పదవి ఎన్నిక సందర్భంగా అవసరమయ్యే మ్యాజిక్ ఫిగర్(7)ను ఏ పార్టీ సాధించలేకపోయింది. దీంతో రాయికల్‌లో సైతం హంగ్ తప్పడం లేదు. అయితే అధిక వార్డుల్లో గెలుపొందిన బీజేపీ చైర్మన పదవిపై ఆశలు పెట్టుకుంది. నిజామాబాద్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను రాయికల్ బీజేపీ కౌన్సిలర్లు కలిసి రాజకీయ వ్యూహం రచిస్తున్నారు. కాగా కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు హైద్రాబాద్‌లో ఉన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ వద్దకు వెళ్లినట్లు ప్రచారం ఉంది. అయితే రాయికల్‌లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అంతర్గత ఒప్పందం కుదుర్చుకొని చైర్మన సీటును కైవసం చేసుకుంటుందన్న చర్చలు రాజకీయవర్గాల్లో చోటుచేసుకుంటున్నాయి.
ధర్మపురి, కోరుట్లలో కాంగ్రెస్ హవా..
జిల్లాలోని ధర్మపురి, కోరుట్ల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ హవా చోటుచేసుకుంది. ధర్మపురిలో 15 స్థానాలకు గానూ 15 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకొని క్లీన స్వీప్ చేసింది. కోరుట్లలో 33 స్థానాలకు గానూ కాంగ్రెస్ 18, బీఆర్‌ఎస్ 8, బీజేపీ 6, స్వతంత్రులు 1 కైవసం చేసుకున్నారు. కోరుట్లలో చైర్మన స్థానానికి అవసరమైన 17 వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ ఖాతాలో ఉండడంతో చైర్మన పదవి దక్కించుకోవడం దాదాపుగా ఖాయమైపోయింది.