Jagitiala : పల్లెల్లో పైసల పంచాయితీ
ABN , Publish Date - Mar 08 , 2026 | 01:08 AM
జగిత్యాల, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థికసంఘం నిధులు రూ.22.31 కోట్లు మంజూర కావడంతో పైసల పంచాయితీ మొదలైంది.
-జీపీ ఖాతాల్లో ఆర్థికసంఘం నిధులు రూ.22.31 కోట్లు జమ
-పాత బిల్లులు చెల్లించాలంటున్న మాజీ సర్పంచ్‌లు, కార్యదర్శులు
- కొత్త పనులు చేస్తామంటున్న సర్పంచ్‌లు
- సమస్యను అధిగమించేందుకు సర్కారు దిద్దుబాటు
- తాజాగా మార్గదర్శకాలు జారీ
జగిత్యాల, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థికసంఘం నిధులు రూ.22.31 కోట్లు మంజూర కావడంతో పైసల పంచాయితీ మొదలైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం, 2024-25 సంవత్సరాలకు సంబంధించిన నిధులు ఇటీవల విడుదలయ్యాయి. రెండేళ్లుగా పాలక వర్గాలు లేకపోవడంతో అప్పుడు నిధులు మంజూరు కాలేదు. ఇటీవల ఎన్నికలు జరిగి పాలక వర్గాలు కొలువదీరడంతో ఆర్థిక సంఘం నిధులు వచ్చాయి. దీంతో నిధుల వినియోగంపై కొత్తగా బాధ్యతలు చేపట్టిన పలువురు సర్పంచ్‌లకు, పలువురు మాజీ సర్పంచ్‌లకు మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన సమయంలో చేసిన పనులకు డబ్బులు జమ చేసుకుంటామని కార్యదర్శులు అంటుండడంతో వివాదాలు నెలకొంటున్నాయి. కొందరు తక్కువ డబ్బులు వ్యయం చేసి ఇప్పుడు ఎక్కువ ఖర్చులు చూపిస్తున్నారని పలువురు సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు.
ఫబిల్లుల చెల్లింపు విషయంలో..
కొత్త సర్పంచ్‌లు కొలువదీరగానే నిధులు వచ్చాయి. అయితే నిధుల విషయంలో పాత సర్పంచ్‌లు చేసిన పనుల బకాయిలు చెల్లించే విషయంలో, ప్రత్యేకాధికారుల పరిపాలన సమయంలో కార్యదర్శులు పెట్టిన ఖర్చులు చెల్లించే విషయంలో మాజీ, తాజా సర్పంచ్‌ల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. పలు పంచాయతీల్లో తాగునీటి వసతి, లైట్లు వేయడం, రోడ్లు బాగు చేయడం, మొరం పోయడం, పారిశుద్య పనుల వినియోగం కోసం చేసిన అప్పులు, పంచాయతీల్లో పలు నిర్మాణాలు, ఇతర సర్టిఫికెట్ల మంజూరు తదితర పనులకు గతంలో మాజీ సర్పంచ్‌లు, కార్యదర్శులు ఖర్చులు చేశారు. అయితే పంచాయతీల ఆదాయం, వ్యయం వివరాలు కొత్త సర్పంచ్‌లకు కార్యదర్శులు వివరించాల్సి ఉంటుంది. కొందరు కార్యదర్శులు వివరించగా, మరికొందరు దాటవేశారు. ఇప్పుడు నిధులు రాగానే ఖర్చులు, బిల్లుల పెండింగ్ విషయం ముందుకు రావడంతో ఇద్దరి మద్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. పల్లెల్లో పనులు నిర్వహించడానికి సంబంధిత నిధులు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలని పలువురు సర్పంచ్‌లు కోరుతున్నారు.
ఫప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల
గ్రామ పంచాయతీలకు విడుదలైన నిధుల నుంచి పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం రెండు రోజుల క్రితం మార్గదర్శకాలు జారీ చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ విషయంలో పాత, కొత్త సర్పంచ్‌ల మధ్య నెలకొంటున్న వివాదాలను పరిష్కరించడంపై దృష్టి సారించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో మార్గదర్శకాలు జారీ చేసింది. పీఆర్ డైరెక్టర్ దివ్యా దేవరాజన్ అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, డీపీవో, డీఎల్‌పీవోలతో రెండు రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బిల్లుల చెల్లింపులపై స్పష్టత ఇచ్చారు. గత సర్పంచ్‌ల పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1తో ముగిసిందని, 2023-24 కాలంలో చేపట్టిన తాగునీరు, పారిశుధ్య పనులకు సంబంధించిన రికార్డులు అందుబాటులో ఉన్న మేరకు పాత సర్పంచ్‌లకు బిల్లులు చెల్లించాలని తెలిపారు. గత నెల 19వ తేదీన జారీ చేసిన సర్క్యులర్ ద్వారా జిల్లా పంచాయతీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. దీంతోనైనా పల్లెల్లో నెలకొన్న పైసల పంచాయితీ సమస్య అధిగమిస్తుందని అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఆశిస్తున్నారు.
పలు పంచాయతీల్లో వివాదాలు
ఫ జగిత్యాల జిల్లా రూరల్ మండలంలోని గ్రామాలకు నిధులు రావడంతో గతంలో పనిచేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వాలని మాజీ సర్పంచ్‌లు అడుగుతున్నారు. వచ్చిన నిధులను గ్రామంలో అభివృద్ధి పనులకు వాడుకుంటామని కొత్త సర్పంచ్‌లు అంటున్నారు. ఒకే పార్టీకి చెందిన మాజీ, తాజా సర్పంచ్‌లైతే సర్దుకుపోతున్నారు. కానీ వేర్వేరు పార్టీల వారు వాళ్లు మాత్రం ససేమిరా అంటున్నారు.
ఫ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ తండా పంచాయతీ ఖాతాల్లో ఈనెల మొదటి వారంలో నిధులు రూ.2 లక్షలు జమ అయ్యాయి. ఈ నిధులను గ్రామ కార్యదర్శి గతంలో తాను చేసిన పనులకు చెందిన బిల్లులకు జమ చేసుకుంటామని చెప్పారు. గెలిచి రెండు నెలలు దాటినా ఇప్పటి వరకు పాత బకాయిల గురించి చెప్పలేదు.. ఇప్పుడు డబ్బులు రాగానే పాత బిల్లులు తీసుకుంటానంటే ఎలా అని సర్పంచ్ ప్రశ్నించాడు. దీనిపై ఇరువురు ఎంపీవో, ఎంపీడీవో వద్దకు వెళ్లారు. డీపీవో దృష్టికి సైతం సమస్యను తీసుకెళ్లారు. వాళ్లు కూడా కార్యదర్శికి డబ్బులు ఇవ్వాలని చెప్పడంతో అన్ని లెక్కలు సరిగ్గా చూసిన తర్వాత, బిల్లులు సక్రమంగా ఉంటేనే డబ్బులు ఇస్తానని సర్పంచ్ తేల్చి చెప్పాడు.
చేసిన పనులకు బిల్లులు చెల్లించాలి
-రాజేశ్, జిల్లా సర్పంచ్‌ల ఫోరం మాజీ అధ్యక్షుడు
గత ప్రభుత్వ హయాంలో పల్లెల్లో వివిధ పనులు పూర్తి చేసిన మాజీ సర్పంచ్‌లకు బిల్లులను వెంటనే చెల్లించాలి. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ బిల్లులు రాకపోవడం వల్ల పలువురు మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పంచాయతీ ఖాతాల్లో జమ అయిన ఆర్థిక సంఘం నిధులతో బిల్లులు చెల్లించాలి.
కొత్త పనులు చేయడానికి అవకాశం కల్పించాలి
- పల్లె లక్ష్మి, వెల్దుర్తి సర్పంచ్, జగిత్యాల రూరల్ మండలం
గ్రామంలో కొత్తగా అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం కల్పించాలి. ఇందుకు అనుగుణంగా నిధులను అందుబాటులో ఉంచాలి. ఇటీవల పంచాయతీ ఖాతాల్లో జమ అయిన ఆర్థిక సంఘం నిధులతో పాటు ఇతర నిధులను ఆయా పంచాయతీల్లో పనులు చేయడానికి కేటాయించాలి.
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే...
- మదన్‌మోహన్, జిల్లా పంచాయతీ అధికారి
జిల్లాలోని గ్రామ పంచాయతీ ఖాతాల్లో జనాభా ప్రాతిపదికన ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధులు జమ అయ్యాయి. అయితే ఈ నిధుల వినియోగం విషయంలో సర్పంచ్‌లకు, పలు ప్రాంతాల్లో మాజీ సర్పంచ్‌లు పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. నిధుల వినియోగంపై ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం బిల్లుల చెల్లింపులు, పనుల నిర్వహణ చేయాల్సి ఉంటుంది.