Share News

Jagitiala : మోదం.. ఖేదం

ABN , Publish Date - Feb 02 , 2026 | 01:46 AM

జగిత్యాల, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2026-27 సాధారణ బడ్జెట్‌పై బిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

 Jagitiala :  మోదం.. ఖేదం

బడ్జెట్‌పై ఆయా వర్గాల భిన్నాభిప్రాయాలు

-అంకెల గారడీ అంటున్న కాంగ్రెస్‌

-జనరంజక బడ్జెట్‌ అంటున్న బీజేపీ

-రాష్ట్రాన్ని విస్మరించారని బీఆర్‌ఎస్‌ పెదవి విరుపు

జగిత్యాల, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2026-27 సాధారణ బడ్జెట్‌పై బిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కేంద్ర బడ్జెట్‌ కొందరిలో ఆశలను కలిగించగా, మరికొందరిని నిరాశ నిస్పృహలకు గురిచేసింది. సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు దేశ రైతాంగం, సామాన్యులు, పేదలు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని బీజేపీ నాయకులు అంటుండగా, కేవలం అంకెల గారడీ తప్ప సంక్షేమంపై దృష్టి సారించలేదని కాంగ్రెస్‌ నాయకులు విమర్శిస్తున్నారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపులో సవతి తల్లి ప్రేమ చూపారని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. కేంద్ర బడ్జెట్‌పై పలు వర్గాలకు చెందిన వ్యక్తులు వెల్లడించిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి..

అంకెల గారడీలా బడ్జెట్‌

- గాజెంగి నందయ్య, డీసీసీ అధ్యక్షుడు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంకెల గారడీగా ఉంది. రాష్ట్రానికి అవసరమైన నిధులు కేటాయించలేదు. యువతకు ఉద్యోగాలు లేవు. తయారీ రంగం పతనమవుతోంది. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభాల గురించి బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావన లేదు. ప్రజల వాస్తవ సమస్యలను కేంద్రం పట్టించుకోలేదు.

రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ

- కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ప్రజాప్రతినిధులు బడ్జెట్‌లో మనకు నిధుల కేటాయింపులో విఫలమయ్యారు. ఆర్థిక వ్యవస్థను గందరగోళ పరిస్థితిలోకి నెట్టేలా బడ్జెట్‌ రూపకల్పన ఉంది. సామాన్య ప్రజల ఇబ్బందులను బడ్జెట్‌లో పట్టించుకోలేదు.

అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్‌

- డాక్టర్‌ యాదగిరి బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

లోక్‌సభలో మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మహిళలు, యువత, బాల, బాలికలు, రైతులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా బడ్జెట్‌ రూపొందించారు. రానున్న కాలంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించారు.

ధరల నియంత్రణలో విఫలం

-విజయలక్ష్మి, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు

కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు పూర్తి నిరాశజనకమైన బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గకపోవడంతో సామాన్యులకు ధరలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. యువతకు ఉపాధి కల్పనలో స్పష్టమైన ప్రణాళిక లేదు. మహిళల సంక్షేమానికి నిధులు కేటాయించలేదు.

విద్య, వైద్యానికి మరిన్ని కేటాయింపులు అవసరం

- అయిత అనిత, కవయిత్రి, జగిత్యాల

విద్యా, వైద్యానికి ఇంకొంత బడ్జెట్‌ కేటాయిస్తే బాగుండేది. ఇన్‌కం ట్యాక్స్‌ స్లాబ్‌లు యథాతథంగా ఉంచడం ఉద్యోగులకు నిరాశ కలిగించింది. కేంద్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలు, దేశ భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. క్యాన్సర్‌ ఔషధాలపై పన్ను తగ్గింపు కొంత ఊరటనిచ్చింది. జిల్లాకు ఒక బాలికల హాస్టల్‌, యువతపై ప్రత్యేక దృష్టి హర్షణీయం.

పెన్షనర్లకు మళ్లీ నిరాశ

-హరి అశోక్‌కుమార్‌, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి

తొమ్మిదేళ్లుగా ఆందోళన చేస్తున్నప్పటికీ పెన్షనర్లకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వకుండా కేంద్ర బడ్జెట్‌ నిరాశ పరిచింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆదాయపు పన్ను పరిమితిని రూ.15 లక్షల వరకు అయినా పెంచలేదు.

మద్య తరగతికి ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు

- కంటాల శ్రీనివాస్‌, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు, జగిత్యాల

మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారి కోసం ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహక చర్యలు తీసుకోలేదు. రాష్ట్రాలకు అవసరమైన నిధులు కేటాయించలేదు. అసలు భవిష్యత్తులో కేంద్రం ఏమి చేయబోతోంది అనే విషయాలపై ఎటువంటి వివరాలు లేవు.

బడ్జెట్‌ పేలవంగా ఉంది

- జిల్లా గంగాధర్‌, వ్యాపారి, జగిత్యాల

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పేలవంగా ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రసంగం కూడా పారదర్శకంగా లేదు. బడ్జెట్‌లో కీలక కార్యక్రమాలు, సంక్షేమ పథకాల కేటాయింపుల గురించి ఎటువంటి ప్రస్తావన లేదు.

మహిళా సాధికారతకు ప్రాధాన్యం

- అడిగొప్పుల రజిని, గృహిణి, జగిత్యాల జిల్లా

కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మహిళా సాధికారత ప్రాధాన్యత లభించేలా ఉంది. భారత దేశాన్ని వికసిత్‌ భారత్‌గా మార్చే దిశగా మరో అడుగు వేసినట్లుగా ఉంది. ప్రజల ఆశలను అందుకోవడమే లక్ష్యంగా రూపకల్పన ఉంది. టెక్స్‌టైల్స్‌ రంగం, ఖాధీ, హ్యాండ్లూమ్‌, హస్తకళల ప్రోత్సాహానికి ప్రయత్నించారు.

ఫ తగ్గేవి:

- సీఎన్‌జీ, బయోగ్యాస్‌

- 17 రకాల క్యాన్సర్‌ మందులు

- లెదర్‌ ఉత్పత్తులు

- స్మార్ట్‌ఫోన్లు

- ఈవీ బ్యాటరీలు

- సోలార్‌ ప్యానల్స్‌

- మైక్రో ఓవెన్స్‌

ఫ పెరిగేవి

- లగ్జరీ వాచీలు

- చెప్పులు

- దుస్తులు

- ప్రీమియం ఆటోమొబైల్స్‌

- సౌందర్య ఉత్పత్తులు

Updated Date - Feb 02 , 2026 | 01:46 AM