Jagitiala : గులాబీ గూటికి జీవన్‌రెడ్డి
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:56 AM
జగిత్యాల, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
-బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంతనాలు సఫలం
-మలుపులు తిరుగుతున్న జగిత్యాల రాజకీయం
- కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు లైన్‌క్లియర్
- నియోజకవర్గంలో పట్టు బిగించేందుకు బీజేపీ వ్యూహరచన
జగిత్యాల, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తీరుపై అసంతృప్తికి గురై ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన జీవన్‌రెడ్డితో గురువారం జగిత్యాలలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంతనాలు జరిపారు. దీంతో బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు జీవన్‌రెడ్డి ప్రకటించారు. దీంతో జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయం కీలక మలుపు తీసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి సర్కారుతో కలిసి పనిచేస్తున్నానని ప్రకటిస్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు కాంగ్రెస్‌లో లైన్‌క్లియర్ అయినట్లయింది. జీవన్‌రెడ్డి గులాభీ తీర్థం పుచ్చుకుంటుండడంతో బీఆర్‌ఎస్‌లో ఇప్పటి వరకు కీలకంగా వ్యవహరిస్తున్న పలువురు నేతల భవితవ్యం సందిగ్ధంలో పడినట్లయింది. ఇదే సమయంలో జగిత్యాల నియోజకవర్గంలో సత్తా చాటడానికి బీజేపీ వ్యూహరచన చేస్తోంది.
ఫజీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించిన కేటీఆర్..
జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. గురువారం జగిత్యాలకు వచ్చిన కేటీఆర్‌కు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పాత బస్టాండు సమీపంలో గల మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఇంటికి వచ్చిన కేటీఆర్ సుమారు గంటన్నర పాటు భేటీ అయ్యారు. కేసీఆర్‌తో జీవన్‌రెడ్డికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. నిబద్ధత గల నాయకుడు జీవన్‌రెడ్డి అని కేటీఆర్ కొనియాడారు. జీవన్‌రెడ్డిని శాలువలతో సత్కరించడంతో పాటు పుష్పగుచ్ఛం అందించి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.
ఫత్వరలో కేసీఆర్‌తో భేటీ
జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరిక లాంఛనమైంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను రెండు, మూడు రోజుల్లో జీవన్‌రెడ్డి కలవనున్నారు. కేసీఆర్‌ను కలిసి తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరిక వ్యవహారానికి చెందిన అంశాలను ప్రకటిస్తానని జీవన్‌రెడ్డి వెల్లడించారు. ఈనెల 13న లేదా 16వ తేదీన జగిత్యాలలో బీఆర్‌ఎస్ సభ నిర్వహించడానికి సన్నాహాలు జరుగు తున్నాయని కార్యకర్తలు అంటున్నారు. జగిత్యాలలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు హాజరై జీవన్‌రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకుంటారన్న చర్చలు జరుగుతున్నాయి. ఈ నెలలో జరగనున్న బీఆర్‌ఎస్ ప్లీనరీ, జనరల్ బాడీ సమావేశంలో జీవన్‌రెడ్డికి తగిన ప్రాధాన్యతను ఇస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని కార్యకర్తలు ముచ్చటించుకుంటున్నారు.
ఫ20 నెలలుగా కాంగ్రెస్‌లో రగడ
జగిత్యాల నియోజకవర్గంలో 20 నెలలుగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డిల మధ్య రగడ చోటుచేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించడాన్ని జీవన్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కొన్ని మాసాలుగా అసంతృప్తిని జీవన్ రెడ్డి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు తలనొప్పిగా మారింది. ప్రస్తుతం జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయం కావడంతో జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు లైన్ క్లియర్ అయినట్లయింది. అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిర్ణయం చలామణి కానుందన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది.
ఫసందిగ్ధంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు
జగిత్యాల నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలు తమ భవితవ్యం ఏమిటని సందిగ్ధంలో పడ్డారు. జగిత్యాల నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎల్ రమణ వ్యవహరిస్తున్నారు. గతంలో టీటీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన ఎల్.రమణ ఆ పార్టీకి రాజీనామా చేసి గులాబీ తీర్థం పుచ్చుకోగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ కాంగ్రెస్ సర్కారుతో కలిసి పనిచేస్తున్నారు. అప్పటి నుంచి జగిత్యాల బీఆర్‌ఎస్ వ్యవహారాలను జడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత సురేశ్, ఎమ్మెల్సీ రమణ, మాజీ మంత్రి రాజేశంగౌడ్‌లు చూసుకుంటున్నారు. తాజాగా జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరనుండడంతో బీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న నేతల భవితవ్యం ఎలా ఉంటుందోననే చర్చ సాగుతోంది.
ఫఅసంతృప్త నేతలపై బీజేపీ గురి..
జగిత్యాల నియోజకవర్గంలో బీజేపీ పట్టును మరింత బిగిస్తోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రత్యేక దృష్టి సారించి జగిత్యాల నియోజకవర్గంలో బీజేపీ మరింత బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ల మద్య జరుగుతున్న పోరుతో ఇబ్బందులకు గురవుతున్న ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు, బీఆర్‌ఎస్‌లో అసంతృప్తితో ఉన్న కార్యకర్తలు బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ సైతం తనదైన చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ పట్టు బిగిస్తోంది. బీజేపీ నియోజకవర్గ నాయకురాలు బోగ శ్రావణి ప్రవీణ్ నేతృత్వంలో బీజేపీ రాజకీయం జోరుగా నడుపుతోంది. కాగా భవిష్యత్తులో జగిత్యాల రాజకీయం ఎటువైపు వెళ్తోందో..ఎవరు పట్టు సాధిస్తారు..ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే.