Share News

jagitiala : ఖర్చుకు తగ్గేదేలే..

ABN , Publish Date - Jan 23 , 2026 | 01:38 AM

జగిత్యాల, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ చైర్మన గిరి కావాలంటే రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు ఖర్చు పెట్టాలని అంటూ అధికార, ప్రతిపక్షాల పార్టీల బడా నేతలు ఆశావహులకు నేరుగా చెప్పేస్తున్నారు.

jagitiala :  ఖర్చుకు తగ్గేదేలే..

- మున్సిపల్‌లో ఎన్నికల్లో వ్యయానికి వెనకాడని ఆశావహులు

- చైర్మన సీటుకు రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం

- అంగబలం, అర్ధబలం ఉన్నోళ్లోకే ప్రాధాన్యం ఇస్తున్న పార్టీలు

- రోజురోజుకు వేడెక్కుతున్న మున్సిపల్‌ రాజకీయం

జగిత్యాల, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ చైర్మన గిరి కావాలంటే రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు ఖర్చు పెట్టాలని అంటూ అధికార, ప్రతిపక్షాల పార్టీల బడా నేతలు ఆశావహులకు నేరుగా చెప్పేస్తున్నారు. ఆశావహులు సైతం డబ్బుకు కొదవలేదు.. ఎంతైనా ఖర్చు పెడుతామంటూ స్పష్టం చేస్తూ...బడా నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఖర్చుకు ఏ మాత్రం వెనకడుగు వేయమంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, ఇతర వ్యాపారులు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసి చైర్మన అయ్యేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది.

తెర వెనుక చక్రం..

జిల్లాలోని జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల మున్సిపాలిటీల్లో పలువురు వ్యక్తులు తమను చైర్మన చేస్తే రూ. 5 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు వెనుకడుగు వేయబోమని తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు ఆశావహులు అధికార పార్టీ బీ-ఫాం ఆశిస్తుండగా, మరికొందరు ఆశావహులు అధికార పార్టీని సైతం తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని టికెట్‌ ఇవ్వడమే ఆలస్యమని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఓ నాయకుడు ప్రతీ వార్డుకు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు కౌన్సిలర్‌గా పోటీ చేసే తన ప్యానల్‌కు ఇస్తామంటూ చెప్పుకుంటూ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అధికార పార్టీతో పాటు విపక్షాలైన బీఆర్‌ఎస్‌, బీజేపీలు చాపకింద నీరులా ఎవరిని రంగంలోకి దింపాలో...చైర్మన గిరిని కైవసం చేసుకునే దిశగా తెరవెనక చక్రం తిప్పుతున్నాయి.

డబ్బు ఉన్నోళ్లకే అందలం..

జిల్లా కేంద్రమైన జగిత్యాల మున్సిపల్‌తో పాటు కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీల్లో డబ్బు ఉన్నోళ్లకే ప్రధాన పార్టీలు అందలం వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో ఖర్చుకు వెనకాడని నాయకులకే మున్సిపల్‌ కౌన్సిలర్‌ టికెట్లను, చైర్మన హామీని ఇవ్వడానికి ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. జిల్లాలోని అయిదు మున్సిపాలిటీల్లో అధికార పార్టీతో పాటు విపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీలు బలంగానే ఉన్నాయి. అయితే జిల్లా కేంద్రంలో అందలం ఎక్కాలంటే ఏ పార్టీ ఆశావహులైనా రూ. 5 కోట్ల వరకు ఖర్చు చేస్తే తప్ప చైర్మన అయ్యే పరిస్థితి లేదంటూ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. చైర్మనగా అవకాశం ఇవ్వాలంటూ వస్తున్న నేతలకు రూ. నాలుగు కోట్ల నుంచి రూ. ఐదు కోట్ల వరకు వ్యయం చేయడానికి సిద్ధమైతేనే చెప్పండి అంటూ బడా నేతలు నిర్మోహమాటంగా చెబుతున్నారని సమాచారం. ప్రధాన రాజకీయ పక్షాలు పార్టీని నమ్ముకొని జెండా మోసిన వారికి టికెట్‌ ఇస్తారా..లేక ఆఫర్‌ ఇచ్చిన వారికి టికెట్‌ ఇస్తారా అనే విషయాలపై రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

జగిత్యాలలో పోటాపోటీ...

జిల్లా కేంద్రమైన జగిత్యాలలో మున్సిపల్‌ ఎన్నికల్లో పోటాపోటీ నెలకొంది. సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి తాటిపర్తి జీవనరెడ్డి అనుచరులు, సీఎం రేవంత రెడ్డి సర్కారుతో కలిసి పనిచేస్తున్నానని చెప్పుకుంటున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ అనుచరుల మధ కాంగ్రెస్‌ టికెట్‌ పొందే వ్యవహారంలో విపరీతమైన పోటీ నెలకొంది. అధిష్ఠానం ఎవరికి బీ-ఫాం ఇచ్చే అవకాశం కల్పిస్తుంది, టికెట్‌ దక్కాలంటే ఎలా అన్న సందేహంలో కార్యకర్తలున్నారు. ఈ నేపథ్యంలో ఖర్చుకు సైతం వెనుకాడబోమని టికెట్‌ కేటాయించాలని కోరుతూ నాయకులను ఆశ్రయిస్తున్నారు. గత ఎన్నికల్లో కౌన్సిలర్‌ అయ్యేందుకు రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు వ్యయం అయ్యాయని, ఈ సారి సైతం అదే మొత్తంలో వ్యయం చేయాల్సి ఉంటుందని, అందుకు తగ్గేదేలేదంటూ ఆశావహులు పేర్కొంటున్నారు. అధికార పార్టీలోనే అధికంగా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. తమ సిట్టింగ్‌ స్థానాల్లో తమకే అవకాశం కల్పించాలంటూ కొందరు నాయకులు పట్టుపడుతున్నారు.

డబ్బు సమకూర్చుకునే పనిలో...

ఫిబ్రవరి నెలలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. పోటీచేయాలని భావిస్తున్న వారు డబ్బు సమకూర్చుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన త్వరలో వచ్చే అవకాశం ఉండడంతో ఖర్చుల కోసం డబ్బులను ఈ లోపే సర్దుబాటు చేసుకోవాలని అనుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి ఖర్చు తడిసి మోపెడైంది. 500 మంది ఓటర్లు లేని పంచాయతీల్లో సైతం అభ్యర్థుల ఖర్చు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు దాటిందంటున్నారు. ఈ లెక్కన మున్సిపల్‌ ఎన్నికలు మరింత కాస్ట్లీగా ఉండనున్నాయి. ఒక్కో వార్డులో కనీసం 1500 మందికి పైగా ఓటర్లు ఉండే అవకాశం ఉంది. దీంతో మెజారిటీ వార్డుల్లో పోటీలో ఉండే ఒక్కో అభ్యర్థికి సుమారు రూ. 20 లక్షల కన్నా ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Updated Date - Jan 23 , 2026 | 01:38 AM