Share News

Jagitiala : పసుపు ధరపై ఆశలు

ABN , Publish Date - Jan 26 , 2026 | 01:52 AM

జగిత్యాల, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): పసుపు పంటకు గత యేడాది మంచి ధర లభించడంతో రైతులు ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేశారు.

Jagitiala :  పసుపు ధరపై ఆశలు

- జిల్లాలో ప్రారంభమైన కొనుగోళ్లు

- జోరుగా పంట తవ్వకాలు

- 35 వేల ఎకరాల విస్తీర్ణంలో సాగు

- ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.12 వేల మద్దతు ధర

జగిత్యాల, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): పసుపు పంటకు గత యేడాది మంచి ధర లభించడంతో రైతులు ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేశారు. రాష్ట్రంలో పసుపు అధికంగా సాగు చేసే జిల్లాల్లో జగిత్యాల ఉంది. జిల్లాలోని మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో పసుపు కొనుగోళ్లు ఇటీవల ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో పంట విక్రయాలు ఊపందుకుంటున్నాయి. రైతులు నిల్వ చేసి ఉంచిన పాత పసుపును అక్కడికి తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. సాంగ్లీ మార్కెట్‌లో, నిజామాబాద్‌ మార్కెట్‌లో రూ.13 వేల నుంచి రూ.14 వేల వరకు చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మెట్‌పల్లి మార్కెట్‌లో ఈనెల 23న కాడి పసుపు ధర గరిష్ఠంగా రూ.14,511, కనిష్టంగా రూ.9,166 పలికింది. జిల్లాలో సాగు చేసిన పసుపు చేతికి వచ్చే దశకు చేరుకుంది. కొన్నిచోట్ల ఆకు కోతలు కోస్తున్నారు. పంట కోసేందుకు ఇప్పటికే మహారాష్ట్ర నుంచి కూలీలు జిల్లాకు వచ్చారు. మరో పక్షం రోజుల్లో పంట వెలికితీత పనులు ప్రారంభించనున్నారు. పసుపును ఉడకబెట్టే యంత్రాలను కూడా సిద్ధం చేస్తున్నారు. పంట పూర్తిగా చేతికి వచ్చే వరకు ధర నిలకడగా ఉండాలని రైతులు ఆశిస్తున్నారు. కొత్త పసుపు మార్కెట్‌లోకి వస్తే వ్యాపారులు ఎంత ధరకు కొనుగోలు చేస్తారోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. ఈ సీజన్‌లో క్వింటాల్‌కు నాణ్యతను బట్టి రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు ధర వచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

ఫపెరిగిన సాగు...

గత యేడాది జిల్లా వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో పంట సాగు చేయగా ఈ ఏడాది 35 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది సాగు చేసిన పసుపునకు తెగుళ్లు, చీడపీడలు పెద్దగా ఆశించలేదు. వర్షాలతో ఇబ్బంది కలగకపోవడంతో దిగుబడి బాగానే ఉంటుందనే ఆశతో రైతులు ఉన్నారు. సాధారణంగా ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వస్తుంది. పంట ఆరోగ్యంగా ఉంటే 30 క్వింటాళ్ల ధరకు కూడా వస్తుందని రైతులు చెబుతున్నారు.

ఫ15 రోజుల్లో మార్కెట్‌కు రానున్న పసుపు

జిల్లాలో మరో 15 రోజుల్లో మార్కెట్‌కు పసుపు రానున్నట్లు వ్యాపార వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం పసుపు ఆకును కత్తిరించడం, అక్కడక్కడ పసుపు తవ్వకాలు జరపడం వంటివి చేస్తున్నారు. పసుపును ఉడకబెట్టిన తదుపరి మార్కెట్‌కు రైతులు తీసుకువస్తుంటారు. పసుపు మార్కెట్‌కు వచ్చే సమయంలో ధరను తగ్గిస్తారనే ఆందోళన రైతులను వెంటాడుతోంది. ఇదిలా ఉండగా పసుపు బోర్డు ఏర్పాటుకు కార్యాచరణ కొనసాగుతోంది. రానున్న రోజుల్లో పసుపు పంట క్వింటాలుకు రూ.15 వేల వరకు ధర పలుకుతుందని మార్కెట్‌ నిపుణులు అంటుండడంతో పసుపు రైతుల్లో ఆశలు మరింత చిగురిస్తున్నాయి.

ఫకొన్నేళ్లుగా రైతులకు నిరాశ...

కొన్నేళ్లుగా రైతులను పసుపు పంట నిరాశకు గురిచేస్తోంది. ప్రస్తుత సీజన్‌లో పసుపు పంటకు ఉన్న ధర రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది. పసుపు సరాసరి క్వింటాలుకు రూ.10 వేలకు పైగానే దక్కుతుండడంతో సాగుదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐదు సంవత్సరాలుగా పసుపు సాగు గిట్టుబాటు కాకపోవడంతో సాగు విస్తీర్ణం జగిత్యాల జిల్లాలో తగ్గింది. గతంలో సుమారు 45 వేల ఎకరాలకు పైగా పసుపు సాగు అవుతుండేది. గత యేడాది సుమారు 30 వేల ఎకరాల్లో ప్రస్తుత యేడాది సుమారు 35 వేల ఎకరాల్లో పసుపును సాగు చేస్తున్నారు. పసుపు సాగు ఎకరానికి రూ.80 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు రైతులు పెట్టుబడి పెడుతున్నారు. సుమారు తొమ్మిది నెలల పాటు వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేస్తున్నారు.

ధర నిలకడపై అనుమానాలు..

పసుపుకు ప్రస్తుతం ఉన్న ధరలు సీజన్‌ చివరి వరకు కొనసాగుతాయా అన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తం అవుతోంది. మార్కెట్‌కు భారీగా పసుపు వచ్చిన సందర్భాల్లో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలు దించుతున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. సీజన్‌ చివరి వరకు ధర ఇలానే ఉంటే బాగుంటుందని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రోజులు అయితే ఎక్కువ మొత్తంలో పసుపు మార్కెట్‌కు వస్తుందని, ధరలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. పసుపు పంటకు నిలకడైన ధర ఉంటే రైతులకు నష్టాలు రావని, ప్రస్తుత సంవత్సరం పసుపు పంటకు ధర ఆశాజనకంగానే ఉందంటున్నారు.

ఫనాణ్యతకు ఆదరణ...

మార్కెట్‌కు కొత్త పంట రావడం ప్రారంభం కానుంది. ఎండలు అంతగా లేకపోవడంతో తేమ శాతం అధికంగా ఉన్న పంట మార్కెట్‌కు వస్తున్నట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వర్గాలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉడికించి, ఆరబెట్టి, పాలిషింగ్‌ చేసి తెచ్చిన పంటకు మంచి ధర లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jan 26 , 2026 | 01:52 AM