Share News

Jagitiala : యుద్ధ భయంతో గల్ఫ్‌ కుటుంబాల్లో వణుకు

ABN , Publish Date - Mar 02 , 2026 | 01:56 AM

జగిత్యాల, మార్చి1 (ఆంధ్రజ్యోతి): మెరుగైన భవిష్యత్తును ఆశించి ఎడారి బాట పట్టిన గల్ఫ్‌ కుటుంబాలు యుద్ధభయంతో బిక్కు బిక్కు మంటున్నాయి.

Jagitiala :  యుద్ధ భయంతో గల్ఫ్‌ కుటుంబాల్లో వణుకు

- ఇరాన్‌పై విరుచుకుపడిన అమెరికా, ఇజ్రాయిల్‌

- జిల్లాలో వందల సంఖ్యలో ప్రవాస కుటుంబాలు

- క్షేమ సమాచారం కోసం బంధువుల ఆరా

జగిత్యాల, మార్చి1 (ఆంధ్రజ్యోతి): మెరుగైన భవిష్యత్తును ఆశించి ఎడారి బాట పట్టిన గల్ఫ్‌ కుటుంబాలు యుద్ధభయంతో బిక్కు బిక్కు మంటున్నాయి. ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ప్యూరి’ పేరుతో అగ్రరాజ్యం చేపట్టిన దాడులతో గల్ఫ్‌ అంతటా యుద్ధాగ్ని జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పశ్చిమాసియాలో భీకర యుద్ధం జరుగుతుండడం జిల్లాలోని పలు కుటుంబాలను కలవరపరుస్తోంది. ఇరాన్‌ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్‌ భారీ దాడులకు దిగడం, ప్రతిగా గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణులతో విరుచుకు పడుతుండడం తదితర పరిస్థితులు జిల్లాలోని వలస కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం జోరుగా జరుగుతుండడంతో పశ్చిమాసియాకు వేలకొద్ది విమానాలు రద్దయ్యాయి. యుద్ధాన్ని విరమించి చర్చలు జరపాలని భారత్‌ పిలుపు ఇచ్చింది.

ఫ15 లక్షల మంది గల్ఫ్‌ కార్మికులు...

గల్ఫ్‌ దేశాల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వలస కార్మికులు 15 లక్షల వరకు ఉంటారని ఒక అంచనా ఉంది. ఇందులో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా నుంచి 3 లక్షలు, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా నుంచి 2.50 లక్షలు, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా నుంచి 1.80 లక్షల మంది వివిధ దేశాలకు పనుల నిమిత్తం వెళ్లినట్లు అంచనాలున్నాయి. జగిత్యాల జిల్లా వాసులు సుమారు 2 లక్షల మంది విదేశాలకు ఉపాధి నిమిత్తం వలస వెళ్లినట్లు ఓ అంచనా ఉంది. ఇందులో అత్యధికంగా యూఏఈ, సౌదీ అరేబియా వెళ్లగా మరికొంత మంది కువైట్‌, ఓమన్‌, ఖతార్‌, బహ్రెయిన్‌, మలేషియా, సింగపూర్‌ దేశాల్లో జిల్లాకు చెందిన పలువురు వలస కార్మికులు పనులు చేస్తున్నారు.

ఫఫోన్‌ చేసి క్షేమ సమాచారం..

జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్లలోని గ్రామాల నుంచి ఉపాధి కోసం ఎడారి దేశాల్లో అత్యధిక సంఖ్యలో బతుకుతున్నారు. ఇరాన్‌ దేశం యూఏఈతో పాటు ఇతర దేశాలపైన బాంబుల వర్షం కురుస్తుండడంతో అక్కడ ఉంటున్న గల్ఫ్‌ కుటుంబాలు బిక్కు బిక్కుమంటున్నాయి. ఇప్పటికే మిస్సైల్‌ దాడిలో పాకిస్తాన్‌ జాతీయుడు ఒకరు మృతి చెందినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో జిల్లాలోని పల్లెల నుంచి వలస వెళ్లిన వారి కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. పలువురు ఫోన్‌ చేసి క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. రెండు, మూడు రోజులు బయటికి రావద్దని సూచిస్తున్నారు. పలువురు జిల్లా వాసులు కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతూ తాము క్షేమంగా ఉన్నామని ఆందోళన చెందవలసిన అవసరం లేదని సమాచారం ఇస్తున్నారు.

ఫసెల్ఫీ వీడియోల విడుదల...

ఇప్పటికే పలువురు వలస కార్మికులు వివిధ రకాల సెల్ఫీ వీడియోలు విడుదల చేస్తున్నారు. తమకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దూసుకువస్తున్న మిస్సైల్స్‌తో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఎడారి దేశాల్లో ఉంటున్న వలస కార్మికుల్లో ఆందోళన కనబడుతోంది. ఇప్పటికే చాలా మంది బయటకు వెళ్లడం మానేశారు. ముందస్తుగా కావాల్సిన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. యుద్దం ముగిసిన తర్వాతనే బయటకు వస్తామని కుటుంబ సభ్యులకు వివరిస్తున్నారు. మొత్తంగా గల్ఫ్‌ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో జిల్లా ప్రవాస కుటుంబాలు మరింత ఆందోళనకు గురవుతున్నాయి.

ఫవిమాన సర్వీసులు రద్దు..

ఇరాన్‌, గల్ఫ్‌లో యుద్ద పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి అబుదాబి, కువైట్‌, దోహకత్తర్‌, దుబాయి తదితర దేశాలకు రాకపోకలు సాగిస్తున్న 44 అంతర్జాతీయ విమాన సర్వీసులను వాటి నిర్వహణ సంస్థలు రద్దు చేశాయి. గల్ఫ్‌ దేశాల నుంచి రావాల్సిన పలు విమానాలతో పాటు శంషాబాద్‌ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దు అయ్యాయి. తాము ప్రకటించే వరకు టికెట్లు బుక్‌ చేసుకోవద్దని ఆయా సంస్థల ప్రతినిధులు ప్రకటించారు.

పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి...

-రాజేశుని కృష్ణ, ఫార్మస్యూటికల్‌ కంపెనీ ఉద్యోగి, తిమ్మాపూర్‌ గ్రామం

ఎడారి దేశాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అయితే మేము క్షేమంగానే ఉన్నాము.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎడారి దేశానికి ఉపాధి నిమిత్తం వచ్చా. అయితే యుద్ధం జరుగుతుండడం వల్ల కొంత ఆందోళనకు గురవుతున్నాము. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాము.

వలస కుటుంబాల్లో ఆందోళన

- బోడ లక్ష్మణ్‌, తిమ్మాపూర్‌ గ్రామం, జగిత్యాల జిల్లా

మా అబ్బాయి దుబాయికి ఇటీవలే వెళ్లాడు. అక్కడ రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో కొంత ఆందోళన నెలకొంది. యుద్ధ పరిస్థితుల వల్ల జిల్లాలోని వలస కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఫోన్‌ చేసి యోగ క్షేమాలు తెలుసుకుంటున్నాము. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాము. భారత ప్రభుత్వం సైతం భరోసా కల్పించడానికి ప్రయత్నిస్తోంది.

అక్కడి చట్టాలను అనుగుణంగా వ్యవహరించాలి

-చెన్నమనేని శ్రీనివాస్‌రావు, ఎన్‌ఆర్‌ఐ అడ్వయిజరీ కమిటీ సభ్యులు, జగిత్యాల జిల్లా

పశ్చిమాసియాలో భీకర యుద్ధం జరుగుతుండడం పలు కుటుంబాలను కలవరపరుస్తోంది. అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వం చర్చలు జరపాలని పిలుపునిచ్చింది. ఎప్పటికప్పుడు ప్రవాస కుటుంబాలు యోగ క్షేమాలు తెలుసుకుంటున్నాయి. అక్కడి చట్టాలను గౌరవిస్తూ నిబంధనలు పాటించాలి. అక్కడ గల గల్ఫ్‌ సంక్షేమ సంఘాలతో అనుసంధానంతో ఉండి జాగ్రత్త వహించాలి.

Updated Date - Mar 02 , 2026 | 01:56 AM