Share News

Jagitiala : బదిలీలకు సై..

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:58 AM

జగిత్యాల, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ బదిలీల ప్రక్రియ కొనసాగనుంది.

Jagitiala :  బదిలీలకు సై..

- మేలో పూర్తి కానున్న ప్రక్రియ

- మూడేళ్లు ఒకే చోట పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులకు స్థానచలనం

- అనువైన చోట పనిచేసేందుకు పలువురి పైరవీలు

జగిత్యాల, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. మూడేళ్లు ఒకే చోట పనిచేసిన వారికి స్థాన చలనం కలగనుంది. అదే సమయంలో నాలుగేళ్లు పని చేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. దీంతో అనువైన చోటుకు వెళ్లేందుకు కొందరు ఉద్యోగులు పైరవీలు షురూ చేశారు. ఇందులో ఆరు శాఖలకు మాత్రం బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఫజిల్లాలో 7 వేల పైచిలుకు ఉద్యోగులు..

జిల్లాలో సుమారు 7 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా 2024లో నెల రోజుల పాటు ఉద్యోగులకు బదిలీల అవకాశం ఇచ్చిన ప్రభుత్వం రెండేళ్ల అనంతరం మళ్లీ అవకాశం కల్పించింది. ఇందులో మూడేళ్లు ఒకే చోట విధులు నిర్వహించిన ఉద్యోగులు బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకునేందుకు అర్హులుగా నిర్ణయించింది. నాలుగేళ్ల పాటు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులు మాత్రం తప్పనిసరిగా బదిలీపై వెళ్లాల్సిందే. కాగా రాష్ట్ర స్థాయి మల్టీ జోనల్‌, జోనల్‌ స్థాయితో పాటు జిల్లా పరిధిలోనూ ఈబదిలీల ప్రక్రియ జరగనుండడంతో అనుకూలమైన పోస్టింగ్‌ కోసం పలువురు ఉద్యోగులు అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిసింది.

ఫమూడేళ్ల పాటు ఒకే చోట 3 వేలకు పైగా..

జిల్లాలోని అన్ని శాఖల పరిధిలో పనిచేసే ఉద్యోగులు సుమారు 7 వేల పైచిలుకు ఉండగా, వారిలో బదిలీ నుంచి మినహాయించిన ఆరు శాఖల ఉద్యోగులు పోనూ మిగితా సుమారు 4 వేల మంది ఉద్యోగులకు బదిలీకి అవకాశం ఉంది. వారిలో మూడేళ్ల పాటు ఒకే చోట పనిచేసిన వారు సుమారు 3 వేల మంది వరకు ఉంటారని అంచనా ఉంది. ఇందులో 1,200 మంది నాలుగేళ్ల సర్వీసు నిండిన వారు ఉన్నట్లు ఉద్యోగ వర్గాలు అంటున్నాయి.

ఫఆరు శాఖలకు మినహాయింపు..

జిల్లాలో అన్ని శాఖలు కలిపి 40 నుంచి 60 వరకు ఉండగా, వాటిలో ప్రత్యేకించి ఆరు శాఖలకు ఈ బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇందులో విద్యాశాఖ, రెవెన్యూ, కమర్షియల్‌, ఎక్సైజ్‌, రవాణా, ఫారెస్ట్‌ శాఖలున్నాయి. విద్యా, రెవెన్యూ శాఖల ఉద్యోగులకు ప్రస్తుతం జరగనున్న జనగణన కారణంగా ఎన్యూమరేటర్లుగా గుర్తించి శిక్షణ ఇస్తున్నారు. అదేవిదంగా కమర్షియల్‌, ఎక్సయిజ్‌, రవాణా శాఖలు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేవి కావడంతో వాటిని మినహాయించారు. ఇక అటవీ శాఖ ప్రత్యేక జీఓ ప్రకారమే బదలాయింపులు ఉంటాయని, ఈ సాధారణ బదిలీలతో ఈ శాఖకు సంబందం ఉండదని సంబంధిత అధికార వర్గాలు అంటున్నాయి.

ఫకొందరికి ప్రత్యేక సడలింపు..

ఏదేని ప్రభుత్వ శాఖలో గరిష్ఠంగా 40 శాతం మించకుండా బదిలీలు చేయాల్సి ఉంటుంది. అలాగే దివ్యాంగులు, స్పౌజ్‌, మరో ఏడాదిలో రిటైర్డ్‌ అయ్యే ఉద్యోగులతో పాటు అనారోగ్యంతో బాధపడే వారికి ఈ బదిలీల నుంచి ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు.

Updated Date - Apr 27 , 2026 | 12:58 AM