Jagitiala : ఫిట్‌నెస్ ఉండాల్సిందే..
ABN , Publish Date - Jun 08 , 2026 | 01:07 AM
జగిత్యాల, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు పాఠశాలల బస్సుల ఫిట్‌నెస్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించారు.
- జిల్లాలో 518 స్కూల్ బస్సులు
- నిబంధనలకు విరుద్ధంగా తిరిగే వాటిపై నిఘా
- కేసులు నమోదు చేస్తామంటున్న రవాణా శాఖ అధికారులు
జగిత్యాల, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు పాఠశాలల బస్సుల ఫిట్‌నెస్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం ఎంత ముఖ్యమో తిరిగి భద్రంగా ఇంటికి చేరడం అంతే ప్రధానమని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. పిల్లల బంగారు భవిష్యత్ కోసం తల్లిదండ్రులు రూ. లక్షల్లో వ్యయం చేస్తూ ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తుంటే అంతే బాధ్యతగా పాఠశాలల యాజమాన్యాలు బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోవాలంటున్నారు. వాహనాలు రహదారులపైకి వచ్చే లోపు ఫిట్‌నెస్ చేయించుకోకుంటే దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఫవాహనాల ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి..
విద్యా సంస్థల బస్సులకు ప్రతీ సంవత్సరం ఫిట్‌నెస్ పరీక్షలు చేసుకోవాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. కానీ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలను విస్మరిస్తున్నాయి. దీంతో విద్యార్థులను ఇంటి నుంచి పాఠశాలకు తరలించే బస్సులు ఫిట్‌లెస్‌గా మారుతున్నాయి. ఈనెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ లోపు విద్యా సంస్థల వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీఏ నిబంధనల ప్రకారం ప్రతీ విద్యా సంస్థ నియమాలను పాటించాల్సి ఉంటుంది. నిబంధనలు విస్మరించే పాఠశాల వాహనాలపై చర్యలు తీసుకోవడంపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు.
ఫజిల్లాలో పాఠశాలల వాహనాల పరిస్థితి ఇలా..
జిల్లా వ్యాప్తంగా రవాణాశాఖ ఆధ్వర్యంలో రిజిస్టర్ అయిన బస్సులు 518 ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు 390 వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకున్నారు. మరో 128 వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించలేదు. అయితే జిల్లాలో సుమారు 220 పాఠశాల వాహనాలు 15 సంవత్సరాల కాలపరిమితి పూర్తి చేసుకొని కాలం చెల్లి ఉండడంతో వాటికి ఫిట్‌నెస్ పరీక్షలు చేయడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. కాగా ఒక్కో ఫిట్‌నెస్ పరీక్షకు సంవత్సరానికి ఒకసారి రూ.5వేలు ఖర్చవుతుంది. ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి నుంచి నెలకు సుమారు రూ. వెయ్యి చొప్పున వసూలు చేస్తాయి. ఈ లెక్కన ఒక బస్ సీటింగ్ కెపాసిటీ ఆధారంగా 40 మందికి నెలకు రూ.40 వేలు వసూలు చేస్తారు. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేసే పలు స్కూలు యాజమాన్యాలు కేవలం ఫిట్‌నెస్ కోసం రూ. 5వేలు ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థులను తరలించే వాహనాలకు యాజమాన్యాలు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించాల్సి ఉంది. పాఠశాలల పునః ప్రారంభానికి ముహూర్తం దగ్గర పడుతున్న నేపథ్యంలో యాజమాన్యాలు ఫిట్‌నెస్ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
ఫ293 ప్రైవేటు పాఠశాలలు..
జిల్లా వ్యాప్తంగా 293 వివిధ ప్రైవేటు పాఠశాలలున్నాయి. ఇందులో 15 ప్రాథమిక పాఠశాలలు, 149 ప్రాథమికోన్నత పాఠశాలలు, 129 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిల్లో సుమారు 68,019 మంది విద్యార్థులు ప్రతీ యేటా ప్రవేశాలు పొంది విద్యను అభ్యసిస్తున్నారు. సుమారు 3,689 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. పిల్లలను పాఠశాలల నుంచి తీసుకువెళ్లి తిరిగి ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన ప్రైవేటు పాఠశాలల బస్సుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు ఫిట్‌నెస్ లేని వాహనాలను నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఆర్టీఏ అధికారులు, పోలీసులు పాఠశాలల బస్సుల తనిఖీలు చేస్తున్నారు. అయితే ముందుగానే సమాచారం తెలుసుకుంటున్న కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తప్పించుకుంటూ వాహనాలను ఇతర మార్గాల్లో వినియోగిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బస్సులను ఎటువంటి ఫిట్‌నెస్ లేకుండానే యథేచ్ఛగా తిప్పుతుండడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫఇవీ నిబంధనలు...
వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్ష చేయించాలనుకుంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాలకు సంబంధించిన వివరాలు, డిజిగ్నీషన్, సెల్ నంబర్, బస్సు మోడల్, డ్రైవర్ వివరాలు, అటెండర్, ఫొటోలు, బస్సు నడిచే మార్గం, సీట్ల పరిమితి తదితర విషయాలను నమోదు చేయాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా వాహనంలో మెడికల్ కిట్లు, గాలి, వెలుతురు వచ్చేలా కిటికీలు, సీట్ల మధ్య రాడ్లు అమర్చి ఉండాలి. విద్యార్థులు బస్సులో ఎక్కేందుకు, దిగేందుకు అనుకూలంగా 325 మిల్లీమీటర్ల ఎత్తు ఉండేలా బస్సు మెట్లు ఉండాలి. ఆపద సమయంలో బయటకు దిగేందుకు అత్యవసర ద్వారం తప్పకుండా ఏర్పాటు చేయాలి. విద్యార్థులు బస్సు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు డ్రైవర్‌కు కనబడేలా రెండు వైపులా సైడ్ అద్దాలు, అన్ని కిటికీలను కలుపుతూ ఇనుప జాలి అమర్చి ఉండాలి. వాహనం టైర్లు, బ్రేకులు నాణ్యతతో ఉండేలా చూసుకోవాలి. బస్సుపై ఏ పాఠశాలకు చెందినదో తెలిపేలా పూర్తి వివరాలు రాసి ఉండాలి. పాఠశాల వాహనాలు నడిపే డ్రైవర్లకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలి. రాత్రి వేళల్లో బస్సులను గుర్తుపట్టేలా నాలుగు వైపులా రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేయాలి.
ఫిట్‌నెస్ లేకుంటే చర్యలు
-మహ్మద్ సందాని, జిల్లా రవాణా శాఖ అధికారి
అనుమతులు లేకుండా పాఠశాల యజమానులు స్కూల్ బస్సులు నడిపితే చర్యలు తీసుకుంటాం. స్కూల్ యాజమాన్యాలు వారి వాహనాలకు ఫిట్‌నెస్ చేయించుకోవాలి. అనుభవం ఉన్న వారిని డ్రైవర్‌గా నియమించుకోవాలి. నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు చేస్తాం. పాఠశాలలు పునః ప్రారంభించి బస్సులను రహదారులపైకి తీసుకవచ్చే లోపు ఫిట్‌నెస్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని పాఠశాలల వాహన యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తాం.