Share News

Jagitiala : అంగన్‌వాడీ ఖాళీల భర్తీకి కసరత్తు

ABN , Publish Date - Jun 01 , 2026 | 01:43 AM

జగిత్యాల, మే 31 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ కావడంతో జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు.

Jagitiala :  అంగన్‌వాడీ ఖాళీల భర్తీకి కసరత్తు

- మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

- త్వరలో పదోన్నతులు, బదిలీలు

-జిల్లాలో 73 టీచర్లు, ఒక సూపర్‌వైజర్‌, బ్లాక్‌ కోఆర్డినేటర్‌ పోస్టులు రెండు ఖాళీ

జగిత్యాల, మే 31 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ కావడంతో జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. మొదట పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టిన తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు సైతం విడుదల కావడంతో త్వరలో ప్రక్రియను చేపట్టేందుకు సంబంధిత శాఖ అధికారులు సిద్ధమయ్యారు.

ఫ జిల్లాలో 1,065 అంగన్‌వాడీ కేంద్రాలు

జిల్లా వ్యాప్తంగా నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1,065 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో జగిత్యాల ఐసీడీఎస్‌ ప్రాజెక్టులో 307 కేంద్రాలు, ధర్మపురిలో 219, మల్యాలలో 227, మెట్‌పల్లిలో 312 అంగన్‌ వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 73 ఖాళీలు, .ఒకటి సూపర్‌వైజర్‌, 2 బ్లాక్‌ కోఆర్డినేటర్ల పోస్టులు ఖాళీలున్నాయి. అంగన్‌ వాడీ ఆయా పోస్టులు సుమారు 200 పోస్టులకు పైగా ఖాళీలున్నట్లు ఐసీడీఎస్‌ వర్గాలు అంటున్నాయి. జిల్లాలో ధర్మపురి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో 20 టీచర్‌ పోస్టులు, జగిత్యాల ప్రాజెక్టులో 22, మల్యాలలో 15, మెట్‌పల్లిలో 16 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్‌ పోస్టులను అర్హులైన ఆయాలకు పదోన్నతుల కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నారు. వీరిలో ఇంటర్మీడియట్‌ చేసి అయిదేళ్లు అనుభవం ఉన్న వారికి అవకాశం కల్పించనున్నారు. మిగిలిన ఖాళీలను ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం భర్తీ చేయనున్నారు. దీంతో పాటు ఆయాల విషయంలో 65 ఏళ్లు నిండిన వారిని గుర్తించ స్వచ్ఛంద పదవీ విరమణపై ఆసక్తి ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు.

ఫప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో..

అంగన్‌వాడీ టీచర్ల ఖాళీలను పారదర్శకంగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. చైర్మన్‌గా కలెక్టర్‌, సభ్యులుగా ఆర్‌డీఓ, జిల్లా వైద్యాధికారి, కన్వీనర్‌గా జిల్లా సంక్షేమ శాఖ అధికారి వ్యవహరించనున్నారు. జిల్లాలో జగిత్యాల, ధర్మపురి, మెట్‌పల్లి, మల్యాల ప్రాజెక్టులున్నాయ.ఇ ఈ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీల వివరాలపై ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారుల నుంచి జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాస్కర్‌ వివరాలను సేకరించి కలెక్టర్‌ సత్య ప్రసాద్‌కు అందజేస్తారు. అనంతరం నోటిఫికేషన్‌ విడుదల చేసి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఎంపిక జాబితాను ప్రభుత్వానికి నివేదించి ఆమోదం పొందిన తర్వాత నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే..

- ఆడెపు భాస్కర్‌, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభించాము. ముందుగా పదోన్నతుల ప్రక్రియను సాధ్యమైనంత తొందరలో పూర్తి చేస్తాం. అనంతరం ఖాళీల వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు అందజేస్తాము. తర్వాత మిగిలిన ఖాళీలపై నోటిఫికేషన్‌ విడుదల చేసి నిబంధనల ప్రకారం భర్తీ చేస్తాం.

Updated Date - Jun 01 , 2026 | 01:43 AM