Share News

Jagitiala : ‘ప్రజా ఆశీర్వాద సభ’కు సర్వం సిద్ధం

ABN , Publish Date - Apr 20 , 2026 | 01:16 AM

జగిత్యాల, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Jagitiala : ‘ప్రజా ఆశీర్వాద సభ’కు సర్వం సిద్ధం

- నేడు జగిత్యాలకు కేసీఆర్‌ రాక

- జన సమీకరణలో బీఆర్‌ఎస్‌ నాయకుల తలమునకలు

- గులాబీమయమైన జగిత్యాల

-కారెక్కనున్న మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

జగిత్యాల, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి జనాలను సమీకరించే పనిలో నాయకులు తలమునకలయ్యారు. బహిరంగ సభకు సుమారు లక్ష మంది వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనాలను సభకు తరలించేందుకు వాహన సౌకర్యం కూడా కల్పించారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలలోపు సభా ప్రాంగణానికి చేరుకునేలా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఏర్పడి 25ఏళ్లు పూర్తయి 26వ ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న బహిరంగ సభ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ సభను జగిత్యాలలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరనున్న సందర్భంగా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

ఫగులాబీమయమైన జగిత్యాల

జిల్లా కేంద్రంలోని వివేకానంద స్టేడియంలో బహిరంగ సభ ఉండడంతో జగిత్యాల గులాబీమయమైంది. పార్టీ అధినేత కేసీఆర్‌, ఇతర నాయకుల కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, గులాబీ తోరణాలతో కళకళలాడుతోంది. పెద్ద వేదిక.. కళాకారుల ఆటా పాట కోసం ప్రత్యేకంగా మరో వేదిక ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల కోసం పార్కింగ్‌ స్థలం కేటాయించారు. వీఐపీ వాహనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీఐపీలు, మీడియా సిబ్బందికి వీలుగా సభా వేదిక ముందు భాగం గ్యాలరీలు ఏర్పరిచారు.

ఫగంటకుపైగా ప్రసంగించనున్న కేసీఆర్‌..

హైదరాబాద్‌ నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరనున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జగిత్యాల కలెక్టరేట్‌ సమీపంలోని హెలిప్యాడ్‌ వద్ద దిగుతారు. నేరుగా దరూర్‌ క్యాంపులో గల బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయానికి వెళ్లి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో సభా వేదికపైకి చేరుకుంటారు. వేదికపై ఆయన సుమారు గంటకు పైగా ప్రసంగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.

ఫవివేకానంద స్టేడియంలో విస్తృృత ఏర్పాట్లు

జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ పేరిట నిర్వహిస్తున్న బహిరంగ సభలో సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డికి కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించనున్నారు. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యే ఈసభను విజయవంతం చేసేందుకు వారం రోజులుగా బీఆర్‌ఎస్‌ యంత్రాంగం కృషి చేస్తోంది. సభకు దాదాపు లక్ష మంది వస్తారన్న అంచనాతో వివేకానంద స్టేడియంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు చెందిన పార్టీ సీనియర్‌ నేతలు రెండు, మూడు రోజుల ముందు నుంచే జగిత్యాలలో మకాం వేశారు.

ఫరాష్ట్రం దృష్టిని ఆకర్షించేలా..

14 సంవత్సరాలుగా ఉద్యమ పార్టీగా, తొమ్మిదిన్నరేళ్లు అధికార పార్టీగా ప్రస్థానం సాగించిన బీఆర్‌ఎస్‌..గత రెండున్నరేళ్లుగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. 2023 నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు, 2024 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత జగిత్యాలో నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుమారు ఏడాది కాలం తర్వాత తిరిగి జగిత్యాల సభ ద్వారా ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. కేసీఆర్‌ జగిత్యాల సభలో ప్రభుత్వ వైఫల్యాలను మరింత బలంగా, తనదైన శైలిలో ప్రజలకు వివరించే అవకాశం ఉంది. కేసీఆర్‌ ప్రకటించే భవిష్యత్‌ కార్యాచరణపై అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.

ఫఅట్టహాసంగా ఏర్పాట్లు..

జగిత్యాలలో సభ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. వేసవి ప్రతాపం ఉండడంతో 3 లక్షల వాటర్‌ బాటిళ్లు, 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. సభా వేదిక చుట్టూ గల అంతర్గత రహదారులు, ప్రధాన కూడళ్ల వద్ద 20 ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. కేసీఆర్‌తో పాటు సుమారు 50మంది వేదికపై ఆసీనులయ్యే అవకాశం ఉంటుందని నిర్వాహకులు అంటున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్‌ నియంత్రణ కోసం వలంటీర్లను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌కు ధర్మపురి రోడ్డులో గల సీఎస్‌ఐ మైదానం, కరీంనగర్‌ రోడ్డు వైపు గల గీతా విద్యాలయం మైదానం, గొల్లపల్లి రోడ్డు వైపు గల మోతే మైదానం కేటాయించారు.

Updated Date - Apr 20 , 2026 | 01:16 AM