Share News

Jagitiala : రాయితీపై డ్రోన్లు

ABN , Publish Date - Mar 27 , 2026 | 12:57 AM

జగిత్యాల, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయంలో పొలాల దుక్కితో మొదలుకొని పంట చేతికి వచ్చే వరకు అత్యాధునిక పరికరాల వినియోగం పెరిగింది.

Jagitiala :  రాయితీపై డ్రోన్లు

- రైతులకు తీరనున్న పురుగు మందుల పిచికారీ వెతలు

- జిల్లాకు 10 యూనిట్లు కేటాయింపు

- సహకార, మహిళా సంఘాలకు ప్రాధాన్యం

- ఒక్క యూనిట్‌కు రూ.4 లక్షల వరకు సబ్సిడీ

జగిత్యాల, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయంలో పొలాల దుక్కితో మొదలుకొని పంట చేతికి వచ్చే వరకు అత్యాధునిక పరికరాల వినియోగం పెరిగింది. యాంత్రీకరణతో వ్యవసాయ పనులు చకాచకా సాగడంతో పాటు కూలీల కొరత తీరుతోంది. ప్రధానంగా పంటల్లో చీడ పీడల నివారణ కోసం పురుగు మందుల పిచికారీకి డ్రోన్ల వినియోగం నానాటికీ పెరుగుతోంది. ఈనేపథ్యంలో ప్రభుత్వం అన్నదాతలకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్ధేశంతో రాయితీపై డ్రోన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం డ్రోన్లకు పంపిణీ చేయడానికి సంఘాల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. జిల్లాలో సాగుకు అనుకూలమైన పంట పొలాలు 5.50 లక్షల ఎకరాల్లో ఉన్నాయి. అందులో ప్రధానంగా వరి, మొక్కజొన్న, పసుపు, చెరుకు, నువ్వులతో పాటు వివిధ రకాల పంటలను పండిస్తున్నారు.

ఫతక్కువ ఖర్చు.. సమయం ఆదా

వ్యవసాయ రంగంలో డ్రోన్లతో పొలాలకు ఎరువులు, పురుగు మందులు చల్లడం తేలిక. ఖర్చు తగ్గడంతో పాటు రైతులకు సమయం వృథా కాకుండా ఉంటుంది. కూలీలతో పురుగు మందులు పిచికారీ చేయడం ద్వారా రైతు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు సమయం చాలా తీసుకుంటుంది. పంటలకు సకాలంలో పురుగు మందులు పిచికారీ చేయకపోతే రైతులు ఆర్థికంగా నష్టాలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వ్యవసాయ రంగంలో డ్రోన్ల ఉపయోగించుకునేలా అవకాశం కల్పించింది.

ఫ40శాతం రాయితీ

పంటలకు పురుగు మందుల పిచికారీలో నూతన విధానానికి అనుగుణంగా డోన్లు వినియోగించేలా అవసరమైన శిక్షణతో పాటు పరికరాలను రాయితీపై రైతులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మొదటి విడతలో జిల్లాకు పది డ్రోన్లు కేటాయించింది. తర్వాత డిమాండ్‌కు అనుగుణంగా వాటి సంఖ్య పెంచే అవకాశం ఉంది. ఒక్కో డ్రోన్‌ యూనిట్‌ వ్యయం రూ.9.50 లక్షల నుంచి రూ.11.50 లక్షల వరకు ఉంటుంది. ప్రతి యూనిట్‌కు రూ.4లక్షలు రాయితీ ఇవ్వనున్నారు. రైతు ఉత్పత్తిదారు సంఘాలతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, స్వయం సహాయక మహిళా సంఘాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కొనుగోలులో 40 శాతం రాయితీతో గరిష్ఠంగా రూ.4లక్షల వరకు సబ్సిడీ అందజేయనున్నారు. కొనుగోలు చేసిన సంఘాల నుంచి రైతులు అద్దెకు తీసుకొని తమ అవసరాలకు వినియోగించుకోవచ్చు.

ఫప్రయోజనం ఇలా...

డ్రోన్లతో ఎరువులు, పురుగు మందులు చల్లడం ద్వారా అన్నదాతలకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఒక డ్రోన్‌ కెపాసిటీ 10 లీటర్ల వరకు ఉండగా... ఎకరానికి 2నుంచి 3 లీటర్ల మందు పిచికారీ చేస్తుంది. సాధారణ పద్ధతిలో ఎకరానికి 200 లీటర్ల ద్రావణం వాడుతుండగా, డ్రోన్‌ ద్వారా అయితే 10 లీటర్లు సరిపోతుంరని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో డ్రోన్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పలు కంపెనీలను ఎంపిక చేసింది.

సద్వినియోగం చేసుకోవాలి

-భాస్కర్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సబ్సిడీపై డ్రోన్లు కేటాయించడం ఆనందదాయకం. రైతులు డ్రోన్లు వినియోగించుకోవడంవల్ల తక్కువ సమయంలో ఎక్కువ పంటకు పురుగు మందులు పిచికారీ చేసే అవకాశం ఉంటుంది. రాయితీపై అందించే డోన్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

Updated Date - Mar 27 , 2026 | 12:57 AM