Share News

Jagitiala : పంటలు బుగ్గిపాలు

ABN , Publish Date - May 04 , 2026 | 01:29 AM

జగిత్యాల, మే 3 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి అన్నదాతపై కన్నెర్రజేస్తోంది. ఇప్పటికే చేతికి వచ్చిన పంటను కొనడం లేదని రైతులు ఒకవైపు నిరుత్సాహంతో ఉండగా అకాల వర్షాలు..

Jagitiala :  పంటలు బుగ్గిపాలు

-అగ్ని ప్రమాదాలతో నష్టపోతున్న రైతులు

-రాయికల్‌, మల్లాపూర్‌ మండలాల్లో ఇటీవల వరుస ఘటనలు

-ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుల వినతి

జగిత్యాల, మే 3 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి అన్నదాతపై కన్నెర్రజేస్తోంది. ఇప్పటికే చేతికి వచ్చిన పంటను కొనడం లేదని రైతులు ఒకవైపు నిరుత్సాహంతో ఉండగా అకాల వర్షాలు.. ఇంకో వైపు నిప్పు రవ్వలు చేతికి వచ్చిన పంటలను రైతులకు అందకుండా చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న చేలు కోతకు రావడం, కంకులను కుప్పలుగా వేయడం, విక్రయానికి మార్కెట్‌కు తరలించడం వంటి దశలో ప్రమాదవశాత్తు కాలి బూడిదవుతున్నాయి. ఇటీవల జిల్లాలోని రాయికల్‌, మల్లాపూర్‌ మండలాల్లో మొక్కజొన్న చేలు అగ్నికి ఆహుతై రైతులకు బూడిద మిగిల్చాయి...

ఫరైతుల ఆవేదన..

రాయికల్‌ మండలం అలియానాయక్‌ తండాకు చెందిన ఇద్దరు రైతుల మొక్కజొన్న ప్రమాదవశాత్తు నిప్పంటుకొని దగ్ధమైంది. గ్రామానికి చెందిన లావుడ్య రాజేశ్‌కు చెందిన ఒక ఎకరం 20 గుంటలు, లావుడ్య తిరుమల్‌కు చెందిన 3 ఎకరాలు మొత్తంగా నాలుగు ఎకరాల 20 గుంటల మొక్కజొన్న పంట నష్టానికి గురైంది. ఇటీవల వీరిరువురు మొక్కజొన్న పంటను కోసి సమీపంలో కుప్పలుగా వేశారు. ప్రమాదవశాత్తు మొక్కజొన్న కుప్పకు నిప్పంటుకొని కాలి బూడిదైంది. మల్లాపూర్‌ మండలం రేగుంట గ్రామ శివారులో కలసాని రాజన్న అను రైతుకు చెందిన రెండు ఎకరాల మొక్కజొన్న చేను ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి అయింది. రేగుంట సంఘటనలో రూ.రెండు లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా ఉండగా, రాయికల్‌ మండలం అలియనాయక్‌ తండా సంఘటనలో సుమారు రూ. 3 లక్షల వరకు పంట నష్టం జరిగిందని బాధిత రైతులు వాపోతున్నారు. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిందా...ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాలను అధికారులు నిర్ధారణ చేయాల్సి ఉంది.

ఫప్రభుత్వానికి నివేదిక..

మల్లాపూర్‌ మండలం రేగుంట గ్రామంలో జరిగిన మొక్కజొన్న చేలు దగ్ధం సంఘటనపై ఇటీవల వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు పరిశీలన జరిపారు. క్షేత్ర స్థాయి అధికారులు ఇచ్చిన నివేదకను జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం ద్వారా కలెక్టర్‌ సత్యప్రసాద్‌కు అందించారు. సంబంధిత నివేదికను కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఇటీవల ప్రభుత్వానికి పంపినట్లు అధికార వర్గాలు అంటున్నాయి. పంట నష్టపరిహారం అందించడంలో వివిధ సాంకేతిక కారణాలు అడ్డు వస్తున్నట్లు అధికారులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి సీఎంవో ద్వారా ప్రత్యేక సహాయం చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా రాయికల్‌ మండలం అలియానాయక్‌ తండా సంఘటనపై ఎటువంటి నివేదిక ప్రభుత్వానికి పంపలేదని తెలుస్తోంది. బాధిత రైతులు మొక్కజొన్న పంటను కోసి వ్యవసాయ క్షేత్రంలో కుప్పలుగా వేసి ఉన్న సమయంలో అగ్ని ప్రమాదం జరగడం వల్ల అటు వ్యవసాయ శాఖ అధికారులు గాని, ఇటు విద్యుత్‌ అధికారులు గానీ, రెవెన్యూ అధికారులు గానీ ఎలాంటి నివేదికలను రూపొందించలేదని తెలుస్తోంది. గ్రామ, మండల స్థాయి వ్యవసాయ, రెవెన్యూ, విద్యుత్‌ శాఖ అధికారులు అలియానాయక్‌ తండా సంఘటనపై పరిశీలన జరిపారు.

ఫఎమ్మెల్యేకు గోడు వెల్లబోసుకున్న రైతులు

రాయికల్‌ మండలం అలియానాయక్‌ తండా సంఘటనపై బాధితులతో పాటు పలువురు రైతులు, ప్రజాప్రతినిధులు ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న కంకులు దగ్ధమైన సంఘటనను వివరించారు. ఎంతో కష్టపడి పండించిన పంట చేతికొచ్చినట్లే వచ్చి బూడిదైందని తమను ఆదుకోవాలని విన్నవించారు.

ఫఅప్రమత్తతతోనే నివారణ..

జిల్లాలో యాసంగి సీజన్‌లో సుమారు 4.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో వరి సాగు అగ్రభాగాన ఉంది. తర్వాత స్థానంలో మొక్కజొన్న పంట సాగు చేశారు. ముందే వరి పంట నూర్పిళ్లు చేపట్టిన రైతులు కొందరు వరి కొయ్యలు, పంట వ్యర్థాలకు నిప్పంటించి నిర్లక్ష్యంగా వదిలివేస్తున్నారు. దీంతో అగ్నికీలలకు గాలులు తోడై సమీపంలో కోతకు వచ్చిన పంటలు పలు సందర్బాల్లో దగ్ధమవుతున్నాయి. బాధిత రైతుల కష్టం మొత్తం నిమిషాల్లో బూడిద అవుతోంది. కొన్ని సంఘటనల్లో ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు, విద్యుత్‌ తీగలు, పైప్‌లైన్లు, కలప చెట్లు సైతం కాలిపోయి తీరని నష్టం వాటిల్లుతోంది. పంట చేలలో జరిగే ప్రమాదాల వెనుక ఉన్న కారణాలను విశ్లేషించి, సరియైున నివారణ చర్యలు చేపట్టాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫతీసుకోవాల్సిన జాగ్రత్తలు..

పొలం మీదుగా వెళ్లే విద్యుత్‌ తీగలు లూజ్‌ ఉన్నా ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నిప్పు రవ్వలు పడుతున్నా వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. పంట కోసే సమయంలో వాహనాలకు తీగలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గట్లపై చెత్త తగలబెట్టేటప్పుడు గాలి వేగాన్ని గమనించాలి.పంట కోసిన తర్వాత కొయ్యలను భూమిలో కలియదున్నడం, ఎరువుగా మార్చుకోవడం వంటివి చేయాలి. కోతల తర్వాత చేను చుట్టూ కొంత స్థలాన్ని దున్ని ఉంచాలి. దీనివల్ల పక్క పొలంలో మంటలు చెలరేగినా వ్యాపించవు. తీగల కింద గడ్డివాములను వేయవద్దు. పొలాలు, గట్ల వెంట వెళ్లేటప్పుడు సిగరెట్లు, బీడీలు కాల్చి పీకలు పడేయకూడదని కూలీలు, పశువుల కాపరులకు అధికారులు అవగాహన కల్పించాలి. ఎక్కడైనా మంటలు కనిపిస్తే వెంటనే అత్యవసర నంబర్లకు ఫోన్‌ చేసేలా పంచాయతీల్లో సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలి.

ప్రభుత్వం ఆదుకోవాలి

-లావుడ్య రాజేశ్‌, బాధిత రైతు, అలియానాయక్‌ తండా, రాయికల్‌ మండలం

మాకు ఉన్న ఒక ఎకరం ఇరవై గుంటల్లో మొక్కజొన్న పంట వేశాం. చేతికి వచ్చిన పంటను ఇటీవల కోతలు పూర్తి చేసి తోట సమీపంలో కంకులను కుప్పలుగా పోశాము. ప్రమాదం వల్ల అగ్నికి ఆహుతి అయింది. బూడిద తప్ప ఏమీ మిగలలేదు. పంటల కోసం రూ. వేలల్లో పెట్టుబడి పెట్టాము. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.

కలెక్టర్‌కు నివేదిక అందించాం

- భాస్కర్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

జిల్లాలోని మల్లాపూర్‌ మండలం రేగుంటలో ఇటీవల జరిగిన మొక్కజొన్న చేలు దగ్ధం సంఘటనపై క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపాము. సుమారు 2 ఎకరాల్లో పంట నష్టం వివరిస్తూ జిల్లా కలెక్టర్‌ సత్య ప్రసాద్‌కు నివేదిక అందించాము. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అంచనా ఉంది. కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపాము. బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాయికల్‌ మండలం అలియానాయక్‌ తండా సంఘటన మా దృష్టికి రాలేదు.

Updated Date - May 04 , 2026 | 01:29 AM