Jagitiala : కాంగ్రెస్‌లో కీలక మలుపు
ABN , Publish Date - Mar 23 , 2026 | 01:04 AM
జగిత్యాల, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల కాంగ్రెస్ రాజకీయంలో కీలక మలుపు చోటుచేసుకుంది.
-పార్టీకి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి రాంరాం..
-ఈనెల 25న కాంగ్రెస్‌ను వీడతానని ప్రకటన
-బీఆర్‌ఎస్ లేదా బీజేపీలో చేరతారని ప్రచారం
- జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖ చిత్రం
జగిత్యాల, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల కాంగ్రెస్ రాజకీయంలో కీలక మలుపు చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి రాజీనామా నిర్ణయం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. కాంగ్రెస్‌లో చోటుచేసుంటున్న పరిణామాలతో కొంత కాలంగా అసంతృప్తితో ఉన్న జీవన్‌రెడ్డి ఈనెల 25వ తేదీన కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. అయితే రాజీనామా తర్వాత ఏ పార్టీలో చేరుతారు..భవిష్యత్ కార్యాచరణ ఏమిటి అన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు. అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు, స్నేహితులతో చర్చించి భవిత్యత్ రాజకీయ నిర్ణయం తీసుకుంటానని జీవన్‌రెడ్డి ప్రకటించారు. దీంతో భవిష్యత్‌లో జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరుతారా..బీజేపీలోకి వెళ్తారా..స్వతంత్రంగా వ్యవహరిస్తారా అన్న చర్చలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. జీవన్‌రెడ్డి రాజీనామాతో జగిత్యాల రాజకీయ ముఖచిత్రం మారడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఫజగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కండువా మార్పుతో...
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంజయ్ కుమార్ అనంతరం జరిగిన పరిణామాల కారణంగా 2024 జూన్ 23న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కండువా మార్చారు. అప్పటి నుంచి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే జగిత్యాల ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడాన్ని జీవన్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో జీవన్‌రెడ్డిని ఏఐసీసీ అధిష్ఠానం ఢిల్లీకి పిలుపించుకొని బుజ్జగింపులు జరిపింది. అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబులు జీవన్ రెడ్డితో భేటీ అయి మొదటినుంచి పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇవ్వడంతో అలకమానారు. వివాదం కొద్ది రోజులు సద్దుమణిగినప్పటికీ మళ్లీ పలు సందర్భాల్లో జీవన్‌రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
ఫమున్సిపల్ ఎన్నికలతో ముదిరిన వివాదం..
ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల, రాయికల్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక, బీఫాంల జారీ వ్యవహారంలో వివాదం తారా స్థాయికి చేరింది. తన అనుచరులకు టికెట్లు కేటాయించాలని జీవన్‌రెడ్డి పట్టుపట్టారు. అయితే అధిష్ఠానం కొన్ని వార్డులు జీవన్‌రెడ్డి అనుచరులకు, మరికొన్ని వార్డులు ఎమ్మెల్యే సంజయ్ అనుచరులకు కేటాయించింది. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్లు దక్కకపోవడంతో రెబల్స్‌గా పోటీ చేసిన తన అనుచరులకు మద్దతుగా జీవన్‌రెడ్డి ప్రచారం చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో తాను సూచించిన అభ్యర్థికి అవకాశం కల్పించాలని పలువురు మున్సిపల్ విజేతలతో హైదరాబాద్‌లో క్యాంపు నిర్వహించి అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ ఫలితం దక్కకపోవడంతో జీవన్‌రెడ్డి తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అప్పటి నుంచి జీవన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు.
ఫగౌరవం దక్కడం లేదని రాజీనామాకు నిర్ణయం..
నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్న కాంగ్రెస్‌లో ఆశించిన గౌరవం దక్కడం లేదని, పార్టీలో కొనసాగడం కష్టమని జీవన్‌రెడ్డి ఇటీవల బహిరంగంగానే పలు పర్యాయాలు ప్రకటించారు. ఇందుకు తగ్గట్టుగానే ఈనెల 25వ తేదీన రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం స్పష్టం చేశారు. దీంతో ఆయన అనుచరులు, కార్యకర్తలతో పాటు కాంగ్రెస్‌లో కలకలం రేపింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో జీవన్‌రెడ్డి టచ్‌లో ఉంటున్నారని, గులాబీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చలు చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో జీవన్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించడానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలతో చర్చించి జీవన్‌రెడ్డికి కషాయం కండువా కప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీలో చేరితే కీలక పదవి కట్టబెడతామని హామీతో ముందుకు వస్తున్నట్లు ప్రచారం ఉంది. సుదీర్ఘ అనుభవం కలిగిన జీవన్‌రెడ్డి బీజేపీలో చేరినా లేదా బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నా జగిత్యాల రాజకీయ ముఖచిత్రం మారనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.