Share News

Jagitiala : ఉత్కంఠకు తెర

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:50 AM

జగిత్యాల, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మున్సిపల్‌ రిజర్వేషన్లపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.

Jagitiala :  ఉత్కంఠకు తెర

- మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రకటన

- రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఖరారు

- రోటేషన పద్ధతిలో రిజర్వేషన్లు

- చైర్‌పర్సన స్థానాలు సైతం ఖరారు

- ఇక నోటిఫికేషనే తరువాయి

- జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు..136 వార్డు కౌన్సిలర్లు

జగిత్యాల, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మున్సిపల్‌ రిజర్వేషన్లపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. నాలుగు రోజుల క్రితం మున్సిపాలిటీల్లో కౌన్సిలర్‌ స్థానాలకు సామాజికవర్గాల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఏ వార్డు కౌన్సిలర్‌ స్థానాన్ని ఏ సామాజిక వర్గానికి రిజర్వు అవుతుందనే దానిపై ఆశావహుల్లో నిన్న, మొన్నటి వరకు టెన్షన నెలకొంది. ఎట్టకేలకు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ నేతృత్వంలో అధికారులు వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. రొటేషన పద్ధతిలో రిజర్వేషన్లు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించిన మేరకు అదే పద్ధతిలో అధికారులు ప్రక్రియ పూర్తి చేశారు. మహిళా రిజర్వుడు కౌన్సిలర్‌ స్థానాలను కూడా ప్రకటించారు. డ్రా పద్ధతిలో మహిళా రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా 136 వార్డు కౌన్సిలర్‌ స్థానాలున్నాయి.

చైర్‌పర్సన స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు..

మున్సిపల్‌ చైర్‌పర్సన స్థానాల రిజర్వేషన్లను రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రకటించారు. మున్సిపల్‌ పరిపాలన శాఖ డైరెక్టరేట్‌ చైర్‌పర్సన స్థానాల రిజర్వేషన్లు ప్రకటించారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపల్‌ చైర్మన స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీల్లో కలిపి 136 వార్డులున్నాయి. ఇందులో ఎస్టీ జనరల్‌కు ఐదు, ఎస్సీ జనరల్‌కు ఎనిమిది, ఎస్సీ మహిళకు ఐదు, బీసీ జనరల్‌కు 25, బీసీ మహిళకు 24, అన రిజర్వ్‌డ్‌కు 31, అన రిజర్వ్‌డ్‌ మహిళకు 38 స్థానాలను కేటాయించారు. జిల్లాలో 136 వార్డుల్లో 67 స్థానాలను మహిళలకు రిజర్వ్‌ చేశారు.

రాజకీయ పార్టీలతో సమావేశం...

మున్సిపల్‌ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో కలెక్టరేట్‌లో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మహిళా రిజర్వేషన్లను ఖరారు చేశారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలీలకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు కలెక్టరేట్‌లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు.

ఏ క్షణమైన నోటిఫికేషన..

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితాను వారం క్రితమే అధికారులు ప్రకటించారు. పోలింగ్‌ స్టేషన్ల వారీగా ఫోటోలతో కూడిన ఓటరు జాబితాను ప్రదర్శించారు. వార్డుల వారీగా పోలింగ్‌ కేంద్రాలు ఖరారు అయ్యాయి. తాజాగా రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసింది. మున్సిపోల్‌ నగరా మోగించేందుకు అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి. మున్సిపల్‌ చైర్మన స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన జారీ అయ్యే అవకాశాలున్నట్లు రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.

మున్సిపల్‌ చైర్మన స్థానాల రిజర్వేషన ఇలా..

మున్సిపాలిటీ... రిజర్వేషన

జగిత్యాల - బీసీ మహిళ

కోరుట్ల - జనరల్‌ మహిళ

రాయికల్‌ - జనరల్‌ (అన రిజర్వ్‌డ్‌)

మెట్‌పల్లి - జనరల్‌ (అన రిజర్వ్‌డ్‌)

ధర్మపురి - జనరల్‌ మహిళ

Updated Date - Jan 18 , 2026 | 12:50 AM