jagitial : ఆడించే వారేరి..?
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:45 AM
జగిత్యాల, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఆటలపై ఆసక్తి ఉన్నా ఆడించే వారు లేక విద్యార్థులు క్రీడలకు దూరం అవుతున్నారు. విద్యార్థులకు చదువుతో
-ఇంటర్ కళాశాలల్లో పీడీ పోస్టులన్నీ ఖాళీ
- ఏళ్ల తరబడి నియామకం చేపట్టని ప్రభుత్వం
- క్రీడలకు దూరమవుతున్న విద్యార్థులు
జగిత్యాల, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఆటలపై ఆసక్తి ఉన్నా ఆడించే వారు లేక విద్యార్థులు క్రీడలకు దూరం అవుతున్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని అధికారులు, ప్రజాప్రతినిధులు వివిధ సందర్భాల్లో చెబుతుంటారు. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వ్యాయామ లెక్చరర్ల పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో విద్యార్థులకు క్రీడా సాధనకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ ఫిజికల్ డైరెక్టర్(పీడీ) పోస్టు భర్తీకి నోచుకోకపోవడం పట్ల విద్యార్థులు, క్రీడాకారులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
ఫజిల్లాలో పరిస్థితి ఇలా..
జిల్లా వ్యాప్తంగా 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా సుమారు 10 వేల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇందులో 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు మంజూరు అయినప్పటికీ భర్తీకి నోచుకోలేదు. దీంతో కొన్ని సంవత్సరాలుగా పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. జిల్లాలో ధర్మపురి, కోరుట్ల బాలికల కళాశాల, జగిత్యాల బాలుర కళాశాల, కొడిమ్యాల, మెట్‌పల్లి, మేడిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు మంజూరు కావాల్సి ఉంది. కాగా జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు క్రీడా మైదానం లేకపోవడం, క్రీడా మైదానం ఉన్న కళాశాలల్లో సైతం నిర్వహణ లేకపోవడంతో పిచ్చిమొక్కలు, చెత్తా చెదారంతో అస్తవ్యస్తంగా ఉంటు న్నాయి. క్రీడలు నిర్వహించకపోవడంతో మైదానాలు నిరుపయోగంగా ఉంటున్నాయి. మెట్‌పల్లి, కోరుట్ల బాలుర, బాలికల కళాశాలలు, మల్లాపూర్ తదితర కళాశాలల్లో మైదానాలు లేవు. మల్లాపూర్ కళాశాల గుట్టపై ఉండడం వల్ల మైదానం ఏర్పాటు చేయడం కుదరడం లేదని అంటున్నారు.
ఫ ప్రతిభ గల విద్యార్థులకు నిరుత్సాహం...
ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో ఫీజుల భారం భరించే స్థోమత లేని పేద విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరుతున్నారు. ప్రైవేటు, గురుకులాల్లో వ్యాయామ అధ్యాపకులు అన్ని చోట్ల ఉండగా, ప్రభుత్వ కళాశాలల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒక్కచోట కూడా ఫిజికల్ డైరెక్టర్లు లేకపోవటం గమనార్హం. దీంతో ఆయా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆటలకు దూరంగా ఉంటున్నారు. పదో తరగతి వరకు ఆటల్లో మెరికలుగా ఉన్న వారు సైతం ఇంటర్మీడియట్‌లోకి రాగానే చతికిల పడిపోతున్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఉజ్వల భవితకు బాటలు వేసుకోవాలనుకునే విద్యార్థుల లక్ష్యం నెరవేరని పరిస్థితి నెలకొంది.
ఫనిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు
క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక క్రీడా కోటాను అమలు చేస్తున్నారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించిన వారిని రిజర్వేషన్‌ను వర్తింపజేస్తున్నారు. చదువుకు ఇది అదనపు అర్హతగా గుర్తిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు ఇలాంటి అవకాశాల్ని కోల్పోవాల్సి వస్తోంది. గత విద్యా సంవత్సరంలో పలు జూనియర్ కళాశాలలకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. ఆడించే వారు లేకపోవటంతో క్రీడా ప్రాంగణాలు, సామగ్రి నిరుపయోగంగా మారాయి.
పోస్టులు భర్తీ చేయాలి
-తిరుపతి, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్-711, జగిత్యాల
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయాలి. కళాశాలల్లో ప్రతీ శనివారం టైంటేబుల్‌లో విద్యార్థుల ఆటలకు ఒక ప్రత్యేక పీరియడ్ కేటాయిస్తున్నారు. కానీ ఏ ఒక్క ప్రభుత్వ కళాశాలలోనూ ఫిజికల్ డైరెక్టర్ పోస్టును భర్తీ చేయకపోవడం బాధకరం. ఫిజికల్ డైరెక్టర్లను నియమించినట్లయితే విద్యార్థులు క్రీడల్లో మరింత రాణించే అవకాశాలున్నాయి.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
-బొప్పరాతి నారాయణ, జిల్లా ఇంటర్ విద్య అధికారి
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫిజికల్ డైరెక్టర్లు లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఉన్నతాధికారుల దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లాం. పీడీల నియామకాల అంశం ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది. ప్రస్తుతానికి క్రీడల్లో ప్రతిభ ఉన్న వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నాం. పోటీల్లో పాల్గొనే వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.