Jagitial : చెరువులకు జల సిరి
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:49 AM
జగిత్యాల, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటితో చెరువులు,
- జిల్లాలో మొత్తం చెరువులు...729
- మత్తడి పారుతున్నవి 324
- పూర్తిగా నిండినవి 130
-జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదు
జగిత్యాల, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటితో చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. వందల సంఖ్యలో చెరువులు, కుంటలు జల కళను సంతరించుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదై వరద పోటెత్తడంతో చెరువులు, కుంటలు, ఇతరత్రా జలాశయాలు పూర్తి స్థాయిలో నిండి మత్తడి మీద నుంచి పారుతున్నాయి. జిల్లాకు వర ప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో పాటు వరద కాలువ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, రోళ్లవాగు ప్రాజెక్టు, బొమ్మెన ప్రాజెక్టు, రాళ్లవాగు ప్రాజెక్టు, సుమారు 35 ఎత్తిపోతల పథకాలు, పలు రిజర్వాయర్లలో, చిన్నా చితక ప్రాజెక్టులలోకి నీరు చేరుతోంది. దీంతో జిల్లాలోని ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఫసగానికిపైగా నిండిన చెరువులు 118
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో 729 చెరువులు, కుంటలున్నాయి. వీటి కింద సుమారు 60 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో వంద ఎకరాలకు పైబడి ఆయకట్టు కలిగిన చెరువులు 129 కాగా, వంద ఎకరాల్లోపు ఆయకట్టు గల చెరువులు 600 ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాల వల్ల జిల్లాలోని 324 చెరువులు మత్తడి పారుతున్నాయి. 130 చెరువులు పూర్తిగా నీటితో నిండినవి. 118 చెరువులు సగానికిపైగా నిండినవి ఉన్నాయి. 25 శాతం లోపు నిండిన చెరువులు 79 ఉండగా, 25 శాతం నుంచి 50 శాతం వరకు 78 చెరువులు నిండాయి. 50 శాతం నుంచి 75 శాతం వరకు 118 చెరువులు నిండాయి. జిల్లా పరిదిలోని 14 మండలాల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువ కింద ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 1,67,744 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేస్తున్నారు.
ఫసాగునీటికి తీరిన కొరత...
జిల్లాలోని పలు చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి గత నెలలోనే కొంత నీరు చేరినా పాతిక శాతం కూడా నిండలేదు. దీంతో ఆయకట్టు కింద రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలతో చెరువుల్లోకి నిండుగా నీరు చేరడంతో జలకళను సంతరించుకున్నాయి. ఆయకట్టుకు నీటి కొరత తీరడంతో పాటు మూగ జీవాల దాహార్తి సైతం తీరనుంది. దీంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగనున్నాయి.
ఫఇరు శాఖల సంయుక్త పర్యవేక్షణ...
ప్రస్తుత యేడాది వరద కారణంగా జిల్లా వ్యాప్తంగా చెరువులకు బుంగలు, గండ్లు తదితర అంశాలపై అధికారులు సంయుక్తంగా పర్యక్షిస్తున్నారు. వరదలతో నిండుకున్న చెరువులకు గండ్లు పడకుండా రెవెన్యూ, చిన్న నీటి పారుదల శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చెరువులు, కుంటల స్థితిగతులను పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షిస్తూ రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులకు సమాచారం నివేదించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఫసాధారణ వర్షపాతం నమోదు..
ప్రస్తుత సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదైంది. ప్రస్తుత సీజన్‌లో గత నెల చివరి వరకు సాధారణ వర్షపాతం 460.8 మిల్లీ మీటర్లు కాగా 432.1 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని గొల్లపల్లి మండలం మినహా అన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. అదేవిధంగా సారంగాపూర్, బుగ్గారం, ఎండపల్లి మండలాల్లో అధిక వర్షపాతం కురిసింది. గొల్లపల్లి మండలంలో మాత్రమే లోటు వర్షపాతం కురిసినట్లుగా రికార్డులు తెలుపుతున్నాయి.