jagitial : నీటి సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టాలి
ABN , Publish Date - Oct 30 , 2026 | 11:47 PM
పెగడపల్లి/గొల్లపల్లి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టి, భూగర్భ జలాల పెంపుతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించాలని కలెక్టర్ జి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ సత్యప్రసాద్
పెగడపల్లి/గొల్లపల్లి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టి, భూగర్భ జలాల పెంపుతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించాలని కలెక్టర్ జి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెగడపల్లి మండలంలోని నంచర్ల గ్రామంలో, గొల్లపల్లి మండలంలోని అగ్గిమల్ల, గంగాదేవిపల్లి గ్రామాల్లో ఫామ్‌పాండ్ నిర్మాణ పనులను తనిఖీ చేసి పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో మండల అధికారులు, పంచాయతీకార్యదర్శులు, వీబీజీరాంజీ ఉద్యోగులతో జలసిరిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలినినో ప్రభావం దృష్ట్యా ప్రతి గ్రామపంచాయతీలో జలసిరి కార్యక్రమం కింద నీటి సంరక్షణ పనులను ప్రణాళికాబద్దంగా చేపట్టాలన్నారు. ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, స్టోన్ ట్రెంచెస్, కాంటూరు కందకాలు వంటి అవసరమైన ప్రాంతాల్లో గుర్తించి చేపట్టాలన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు భూమి తేమను కాపాడి వ్యవసాయ ఉత్పాదకత పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు సీఈవో గౌతమ్ రెడ్డి, డీఆర్డీవో రఘువరన్, ఆర్డీవో మధుసూదన్, ఈఈ లక్ష్మణ్ రావు, డీఈ అశ్విన్, డీఎల్‌పీవో విమల, ఎంపీడీవో ప్రేమ్‌సాగర్‌రావు, తహసీల్దార్ నిజామొద్దీన్ సర్పంచులు అమిరిశెట్టి లక్ష్మీనారాయణ, కుంటాల వనజ శ్రీనివాస్, ఏపీవో అనీల్ కుమార్ తదితరులు ఉన్నారు.
పంటలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
జగిత్యాల : ప్రతి రైతుకు సంబంధించిన భూములను జియో ట్యాగింగ్ చేయడంతోపాటు, రైతులు సాగుచేస్తున్న పంటల వివరాలను డిజిటల్ క్రాప్‌సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో సేకరించి ఆన్‌లైన్‌లో నమోదదు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. అగ్రిస్టాక్, వ్యవసాయ యాంత్రీకరణ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభ ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులందరికీ ఫార్మర్ రిజిస్ర్టీ తప్పనిసరిగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అగ్రి స్టాక్ ద్వారా రైతుల భూములు, పంటల వివరాలను డిజిటలైజేషన్ చేయాలని, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలనురైతు సంఘాల ద్వారా సద్వినియోగం చేసుకోవాలని, ధాన్యం కోనుగోలు కేంద్రాలను ప్రారంభించి అవసరమైన అన్ని మౌళిక సదుపాయాలతో సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంకు ఒక పీఏసీఎస్‌ను ఎంంపిక చేసి వాటి ద్వారా సీహెచ్ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అగ్రికల్చర్, హర్టికల్చర్, సహకార మార్కెటింగ్, డీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు.