Share News

Jagitial : పీఏసీఎస్‌ పాలక వర్గాల నియామకానికి కసరత్తు

ABN , Publish Date - Jul 20 , 2026 | 12:50 AM

జగిత్యాల, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌)కు నామినేటెడ్‌ పద్ధతిలో పాలక వర్గాలను నియమించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Jagitial :  పీఏసీఎస్‌ పాలక వర్గాల నియామకానికి కసరత్తు

-నామినేటెడ్‌ పద్ధతిలో ఎంపిక

- చైర్మన్‌, డైరెక్టర్లను సిఫారసు చేయనున్న ఎమ్మెల్యేలు

-ప్రజాప్రతినిధుల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు

జగిత్యాల, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌)కు నామినేటెడ్‌ పద్ధతిలో పాలక వర్గాలను నియమించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా సొసైటీలకు పాలక వర్గాలను ఎమ్మెల్యేల సిఫారసు మేరకు ప్రకటించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఒక్కో సొసైటీలో చైర్మన్‌తో పాటు 11 లేదా 13 మంది డైరెక్టర్లను ఎంపిక చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో 51 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. వీటిలో సుమారు 1.50 లక్షల మంది సభ్యులున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక మండళ్లు, డీసీఎంఎస్‌లు, డీసీసీబీ పాలకవర్గం గడువు 14 ఫిబ్రవరి 2025న ముగిసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం వాటి గడువును మరో ఆరు నెలలు పొడిగించింది. అనంతరం మరో ఆరు నెలల గడువును పొడిగిస్తూ 2025 ఆగస్టు 14న అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పొడిగింపు గడువు 2026 ఫిబ్రవరి 14 వరకు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాలక వర్గాలను రద్దు చేసి పర్సన్‌ ఇన్‌చార్జీలను నియమిస్తూ 2025 డిసెంబరు 19న ఉత్తర్వులు జారీ చేసింది.

ఫ కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం

ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సహకార సంఘాలకు ఎన్నికలకు బదులుగా నామినేటెడ్‌ విధానంతో పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ గడువు ఉండగానే పాలక మండళ్లను రద్దు చేయడం, ఎన్నికల విధానానికి బదులుగా నియమిత విధానానికి వెళ్లడంపై పలువురు న్యాయపోరాటానికి దిగారు. ఈమేరకు విచారణ జరిపిన కోర్టు పాత పాలక మండళ్లనే కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు సూచన మేరకు ప్రస్తుత యేడాది మే 5 నుంచి పాత పాలకమండళ్లను పునరుద్ధరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సహకార సంఘాల్లో పాత పాలకవర్గాలు కొలువుదీరాయి. పర్సన్‌ ఇన్‌చార్జీల నుంచి పాత పాలకవర్గ చైర్మన్లు బాధ్యతలను తిరిగి స్వీకరించారు.

ఫఎమ్మెల్యేల కసరత్తు....

పీఏసీఎస్‌లకు పాలక వర్గాలను నియమిస్తుండడంతో అధికార పార్టీ నేతల్లో పదవుల కోసం పోటీ నెలకొంది. ఒక్కో సొసైటీలో 13 పదవులు ఉండడంతో ఆశావాహులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు తమ అనుచరులకు ఈ పదవులను కట్టబెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క సొసైటీకి కూడా కమిటీని ప్రకటించలేదు. ఎన్నికలు జరిగి ఉంటే సభ్యులందరికీ ఓటు హక్కు ఉండేది. నామినేటేడ్‌ విధానం కారణంగా ప్రస్తుతం ఆ అవకాశం లేదు. సభ్యత్వం ఉన్న రైతుల్లో కొందరికి పదవి దక్కనుంది. పీఏసీఎస్‌ పాలక వర్గాలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించే వరకు ప్రస్తుతం ఎమ్మెల్యేలు నామినేట్‌ చేసే పాలక వర్గాలే కొనసాగే అవకాశం ఉంది.

ఫఐదేళ్ల పదవికి బదులు ఆరు నెలలే...

ఎన్నికల ద్వారా ఏర్పడే పాలకవర్గాలకు ఐదేళ్ల పదవీకాలం ఉంటుంది. నామినేట్‌ చేసే కమిటీకి ఆరు నెలలు లేదా ఎన్నికలు జరిగే వరకు మాత్రమే పదవీ కాలం ఉండేలా ప్రభుత్వం నిబంధనలను విధించింది. దీంతో అవసరమైతే మధ్యలోనే పాలక వర్గాలను మార్చేలా ఈ నిబంధనను పొందుపరిచింది.

ఫ11 నుంచి 13 మందితో...

జిల్లాలోని సహకార సంఘాల్లో ఇటీవల పాత పాలకమండళ్లు మళ్లీ కొలువు దీరిన నేపథ్యంలో నామినేటెడ్‌ విధానంలో ఒక్కో సహకార సంఘానికి 11 నుంచి 13 మందితో కూడిన జాబితాను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా జాబితాలను పంపడానికి ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలను ప్రసన్నం చేసుకోవడానికి ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పల్లెల్లో సహకార సంఘాల నామినేటెడ్‌ పదవులు పొందడానికి నేతల్లో సందడి నెలకొంది.

ఫన్యాయ పోరాటంలో పాత పాలక వర్గాలు

సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, నామినేటేడ్‌ విధానం చట్ట విరుద్ధమని పేర్కొంటూ ఆశావహులు, ప్రతిపక్ష పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయింంచి న్యాయ పోరాటం చేస్తున్నారు. సహకార సంఘాల చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నామినేటెడ్‌ పద్ధతిలో పాలకవర్గాల నియామకానికి కసరత్తులు జరుగుతుండడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నామినేటెడ్‌ యోచనను విరమించుకోవాలి

-సాగర్‌రావు, పోతారం సింగిల్‌విండో చైర్మన్‌

సహకార సంఘాల పాలకవర్గాలను నామినేటెడ్‌ పద్ధతిలో నియమించే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. కేవలం కాంగ్రెస్‌ కార్యకర్తల రాజకీయ నిరుద్యోగం తగ్గించుకోవడానికి నామినేటెడ్‌ విధానాన్ని తెరపైకి తెచ్చారు. విలువైన ఆస్తులను కలిగియున్న సహకార సంఘాలు మున్ముందు నిర్వీర్యం అయ్యే ప్రమాదం పొంచి ఉంది.

ఎన్నికలు నిర్వహించాలి

-మహేందర్‌రెడ్డి, విశాల సహకార సంఘం మాజీ చైర్మన్‌, మెట్‌పల్లి

సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి. నామినేటెడ్‌ విధానంలో కాకుండా ప్రత్యక్ష ఎన్నిక విధానంలో సహకార సంఘాల పాలకవర్గాలను ఏర్పాటు చేయాలి. సభ్యులకు జవాబుదారితనంతో ఉండే విధంగా పాలకవర్గాలు పనిచేయాల్సి ఉంటుంది. నామినేటెడ్‌ విధానంతో జవాబు దారి తనం లోపిస్తుంది. ప్రత్యక్ష ఎన్నికల విధానమే మేలు.

Updated Date - Jul 20 , 2026 | 12:50 AM