Share News

ఎస్‌జీఎఫ్‌ క్రీడలకు వేళాయె..!

ABN , Publish Date - Sep 04 , 2026 | 12:56 AM

విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించే పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌) పోటీలకు వేళైంది.

ఎస్‌జీఎఫ్‌ క్రీడలకు వేళాయె..!

జగిత్యాల, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించే పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌) పోటీలకు వేళైంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధిం చిన క్రీడా అంశాలు, మార్గదర్శకాలను ఇటీవల రూపొం దించారు. సెప్టెంబరు మొదటి, రెండో వారంలో క్రీడా పోటీల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబరు 11వ తేదీ వరకు మండల స్థాయి పోటీలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 30వ తేదీ లోపు జిల్లా స్థాయి క్రీడా పోటీలకు విద్యార్థులను సిద్ధం చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్‌స్కూళ్లు, ఇతర పాఠశాలల విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్‌ విద్యార్థులు కూడా ఈ పోటీల్లో పాల్గొననున్నారు.

ఫఅధికారుల సన్నాహాలు

పాఠశాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాలుగు దశల్లో పోటీలను నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగే క్రీడా పోటీలను పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించనున్నారు. తొలిదశలో పాఠశాల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మండల స్థాయి పోటీలకు ఎంపికవుతారు. అక్కడ విజేతలైన వారు జిల్లా స్థాయిలో పోటీపడనున్నారు. జిల్లా స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులకు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభించనుంది.

ఫవిభాగాల వారీగా పోటీలు...

జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వయో విభాగాల వారీగా క్రీడల్లో పాల్గొననున్నారు. బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అండర్‌-14, అండర్‌-17 విభాగాల్లో పాఠశాల విద్యార్థులు పోటీపడనుండగా, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడా నిబంధనలకు అనుగుణంగా క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. అథ్లెటిక్స్‌తో పాటు జట్టు క్రీడలు, వ్యక్తిగత క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభను పరీక్షించుకోనున్నారు.

ఫజిల్లా కమిటీ చైర్మన్‌గా కలెక్టర్‌

క్రీడా పోటీలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా స్థాయిలో ఎస్‌జీఎఫ్‌ కమిటీని ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పోటీలకు ఎస్‌జీఎఫ్‌ జిల్లా కమిటీ చైర్మన్‌గా కలెక్టర్‌ వ్యవహరించనున్నారు. మండల స్థాయిలో ఎంఈవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో పాటు ఆర్గనైజింగ్‌ సెక్రెటరీలు సభ్యులుగా ఉంటారు. వివిధ క్రీడలకు సంబంధించిన బాధ్యతలను ఉపాధ్యాయులు, పీఈటీలు, క్రీడా నిపుణులకు అప్పగించే అవకాశం ఉంది. పోటీల నిర్వహణ, ఆటగాళ్ల ఎంపిక, మైదానాల ఏర్పాట్లు, షెడ్యూళ్ల ఖరారు వంటి అంశాలపై కమిటీలు దృష్టి సారించనున్నాయి.

ఫ మంజూరు కాని నిధులు

క్రీడా పోటీల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమైనప్పటికీ నిధుల విడుదలపై మాత్రం స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ప్రభుత్వం నుంచి పోటీల నిర్వహణకు అవసరమైన నిధులు సకాలంలో వస్తాయా లేదా అన్న సందేహం నెలకొంది. విద్యార్థులను మండల, జిల్లా స్థాయి పోటీలకు తీసుకెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు, భోజన వ్యయాలు, ఇతర ఏర్పాట్ల కోసం ఉపాధ్యాయులు ముందస్తుగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడు తుందేమోనని భావిస్తున్నారు.

ఫఉపాధ్యాయులపై అదనపు భారం...

విద్యార్థులను పోటీలకు తీసుకెళ్లడం, వారి ప్రయాణం, భోజనం, వసతి వంటి ఏర్పాట్లు చేయడం ఉపాధ్యాయులకు సవాలుగా మారుతోంది. పోటీల నిర్వహణకు ప్రత్యేక నిధులను ముందుగానే విడుదల చేస్తే ఇబ్బందులు ఉండవని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. గతంలో జరిగిన పోటీల సందర్భంగా ఖర్చుల భారం ఉపాధ్యాయులపై పడిన ఉదంతాలు ఉన్నాయని, ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఫప్రతిభకు వేదిక...

గ్రామీణ ప్రాంతాల్లోని అనేక మంది విద్యార్థులకు క్రీడా ప్రతిభ ఉన్నప్పటికీ సరైన వేదికలు లభించడం లేదు. ఎస్‌జీఎఫ్‌ పోటీలు అలాంటి విద్యార్థులకు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు మంచి అవకాశంగా మారనున్నాయి. పాఠశాల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎదిగే అవకాశం ఉండడంతో విద్యార్థులు ఇప్పటికే పోటీల కోసం సన్నద్ధమవుతున్నారు. అయితే ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పోటీల్లో పాల్గొనేలా ప్రభుత్వం అవసరమైన నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది.

ఫనిర్వహించే క్రీడాంశాలు..

జిల్లా వ్యాప్తంగా పాఠశాల స్థాయిలో విద్యార్థులు అండర్‌-14, అండర్‌- 17 విభాగాల్లో పోటీ పడనున్నారు. బాల బాలికలకు వేర్వేరుగా పోటీలు ఉంటాయి. అథ్లెటిక్స్‌, అర్చరీ, బాస్కెట్‌ బాల్‌, బ్యాడ్మింటన్‌, బేస్‌ బాల్‌, వాలీ బాల్‌, బాక్సింగ్‌, చెస్‌, క్రికెట్‌, సైక్లింగ్‌, ఫుట్‌బాల్‌, జిమ్నాస్టిక్స్‌, హ్యాండ్‌ బాల్‌, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, ఖోఖో, నెట్‌ బాల్‌, స్కేటింగ్‌, స్విమ్మింగ్‌, యోగా తదితర అంశాల్లో పోటీలు జరిగే అవకాశాలున్నాయి. కొన్ని పోటీలను మండల స్థాయిలో, మరికొన్నింటిని జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తారు.

క్రీడా నైపుణ్యాన్ని గుర్తించే అవకాశం

- రాము, జిల్లా విద్యాశాఖ అధికారి

విద్యార్థులల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని గుర్తించేందుకు పాఠశాల స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీలు దోహదపడుతాయి. ఇక్కడి నుంచే విద్యార్థుల్లో క్రీడల పట్ల ఉన్న మక్కువ తెలుస్తుంది. ఎస్‌జీఎఫ్‌ ద్వారా పాఠశాల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ప్రతీ యేడాది జిల్లా నుంచి విద్యార్థులు వెళ్తున్నారు. పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను క్రీడల్లో పాల్గొనే విధంగా కృషి చేయాలి.

Updated Date - Sep 04 , 2026 | 12:56 AM