రైతు భరోసాకు వేళాయె!
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:49 AM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు జమ అవుతాయా అని ఎదురుచూస్తున్న రైతుల ఖాతాల్లో రెండు, మూడు రోజుల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నది.
(పెద్దపల్లి, ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు జమ అవుతాయా అని ఎదురుచూస్తున్న రైతుల ఖాతాల్లో రెండు, మూడు రోజుల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నది. మున్సిపల్ ఎన్నికలు అయిన వెంటనే డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 11వ తేదీన జరగగా, 13వ తేదీన కౌంటింగ్ జరిగింది. 16,17తేదీల్లో గెలిచిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారంతో పాటు చైర్మన్, వైస్‌చైర్మన్ల ఎన్నిక పూర్తయ్యింది. దీంతో మంగళవారం నాటికి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో రెండు, మూడు రోజుల్లో ఒకేసారి రైతుల ఖాతాల్లో రైతు భరోసా సాయం జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలను అధికార పార్టీ సాధించ డంతో ఈ యాసంగి సీజన్‌కు గాను రైతుల ఖాతాల్లో పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేసి మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఆ ఎన్నికలు గ్రామీణ ప్రాంతాలకు చెందినవి కావడంతో ప్రభుత్వం ఈ ఎన్నికల్లోనూ మెజారిటీ మండల, జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకునేందుకు గాను సత్వరమే రైతుభరోసా సాయాన్ని రైతులఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికల సమదర్భంగా ఆయాజిల్లాల్లో నిర్వహించిన బహిరంగసభల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా సాయాన్ని జమ చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా కావాల్సిన సుమారు 9 వేలకోట్ల రూపాయలను ఆర్థికశాఖ సమీకరిస్తున్నది. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి సాగు భూములకే రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెబుతున్నది. వానాకాలం సీజన్‌లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. యాసంగి సీజన్‌లో సాగునీటిని బట్టి కొంత విస్తీర్ణం తగ్గుతుంది. కానీ ప్రభుత్వం ఆ లెక్కల జోలికి పోకుండా వానాకాలం సీజన్‌లో పట్టా భూములు కలిగిన ఎంతమంది రైతులకు రైతు భరోసా కింద సాయాన్ని అందించామో వారందరికీ, ఇంకా మిగిలిపోయిన వారందరికీ డబ్బులు జమ చేయాలనే ఆలోచన చేసినట్లు సమాచారం. పంటలు సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇవ్వాలని ఈ యాసింగి సీజన్‌కు ముందు నిర్ణయించి సింథటిక్ ఎపర్చర్ రాడార్(సర్) టెక్నాలజీతో శాటిలైట్ మ్యాపింగ్ సర్వే ఆధారంగా డబ్బులు జమ చేయాలని భావించారు. ఈ సర్వే వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తడంతోపాటు పంటులు సాగుచేసిన రైతులకు పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం అందకుండా పోయే ప్రమాదం ఉందని గమనించిన ప్రభుత్వం వానాకాలం సీజన్‌లో పంటలు సాగుచేసిన రైతులందరికీ డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అధికార వర్గాలకు సమాచారం ఇచ్చిందని తెలిసింది.
ఫ వానాకాలం సీజన్‌లో రైతుల ఖాతాల్లో రూ.42కోట్లు జమ..
గడిచిన వానాకాలం సీజన్‌లో పూర్తిస్థాయిలో ఎకరానికి 6వేల రూపాయల చొప్పున 1,21,698 మంది రైతులఖాతాల్లో 88కోట్ల 86లక్షల రూపాయలను తొమ్మిది రోజుల్లో ప్రభుత్వం జమ చేసింది. అంతకుముందు యాసంగి సీజన్‌లో 3ఎకరాల వరకు భూములు కలిగిన 1,14,313రైతులకు 42కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. 3ఎకరాలకు పైగా భూములు ఉన్న వారికి పెట్టుబడి సాయాన్ని ఇవ్వలేదు. అయితే ఈ సీజన్‌లో పంటలు సాగుచేసిన భూములను గుర్తించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాలని మొదట ప్రభుత్వం శాటిలైట్ మ్యాపింగ్‌తో పాటు వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో చేపట్టే క్రాప్‌బుకింగ్ సర్వేను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. గతంలో పట్టా భూములు కలిగిన వారందరికీ రైతు బంధు పథకాన్ని వర్తింపజేసి ధరణి పోర్టల్‌ను అనుసంధానం చేసుకుని డబ్బులు జమ చేశారు. దీంతో రియల్ ఎస్టేట్ వెంచర్లు, ప్రభుత్వ అవసరాల కోసం భూములు ఇచ్చిన వారికి, పంటలు సాగు కానీ బీడు భూములు, రాళ్లు, రప్పలు, బంచరాయి తదితర భూములు గల వారికి రైతు బంధు డబ్బులను జమ చేశారు. తాము అధికారంలోకి వస్తే అలాంటి పరిస్థితి రానివ్వమని, పంటలు సాగు చేసే వారికే రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని అన్నారు. ఎకరానికి రెండు పంటలకు కలిపి 15 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రకటించింది. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా నిలిచి పోయిన రైతుబంధు పథకం డబ్బులను 2024జనవరిలో రైతుల ఖాతాల్లో జమచేసింది. అదే ఏడాది వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించలేదు. కానీ 2లక్షల రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో సాగులో ఉన్న భూముల గురించి క్షేత్రస్థాయిలో రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు సర్వేచేసి లెక్కలు తీశారు. అయితే ఈసర్వే పకడ్బందీగా జరగలేదని, తూతూ మంత్రంగా జరిగిందని భావించిన ప్రభుత్వం గత ఏడాది యాసంగిసీజన్ జనవరిలో రైతు భరోసా పథకాన్ని ఆరంభించినప్పటికీ, 3 ఎకరాల భూములు కలిగిన వారికి మాత్రమే డబ్బులను రైతుల ఖాతాల్లో వేశారు. వానాకాలం సీజన్‌లో పూర్తిస్థాయిలో రైతుభరోసా కింద డబ్బులు ఇవ్వగా, ఈ సీజన్‌లో శాటిలైట్ మ్యాపింగ్ సర్వే ద్వారా పంటలు సాగుచేసిన రైతులకు డబ్బులు జమ చేయాలని భావించిన ప్రభుత్వం, సాంకేతిక కారణాల వల్ల సర్వేలో జాప్యం జరుగుతుండడంతో వానాకాలం సీజన్‌లో డబ్బులు జమ చేసిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది. దీంతో రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసి మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.