కాల్చితే నష్టం.. కలియదున్నితే మేలు..
ABN , Publish Date - May 23 , 2026 | 01:11 AM
వరి కోతలు పూర్తి కాగానే మిగిలిన వరి కొయ్యలను కాల్చడం రైతులకు ఆనవాయితీగా మారింది. వాటిని కాల్చడం వల్ల భూసారం దెబ్బతిన్నడమే గాకుండా పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని తెలిసినా కూడా రైతులు అదేపనిగా వరి కొయ్యలను కాలుస్తున్నారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల గాలికి, ఎండ తీవ్రతకు మంటలు అదుపులోకి రాక పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
- వరి కొయ్యలు కాల్చితే అనర్థమే
- పొలంలో కలియ దున్నడమే మేలు
- భూసారానికి దెబ్బ, పర్యావరణానికి నష్టం
- కొయ్యలకు నిప్పు పెట్టడంతో జిల్లాలో అనేకచోట్ల అగ్నిప్రమాదాలు
- అవగాహన కల్పించకుంటే మరింత నష్టం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
వరి కోతలు పూర్తి కాగానే మిగిలిన వరి కొయ్యలను కాల్చడం రైతులకు ఆనవాయితీగా మారింది. వాటిని కాల్చడం వల్ల భూసారం దెబ్బతిన్నడమే గాకుండా పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని తెలిసినా కూడా రైతులు అదేపనిగా వరి కొయ్యలను కాలుస్తున్నారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల గాలికి, ఎండ తీవ్రతకు మంటలు అదుపులోకి రాక పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ యాసంగి సీజన్‌లో జిల్లాలోని ఓదెల, కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి, ముత్తారం, సుల్తానాబాద్, జూలపల్లి, తదితర మండలాల్లో రైతులు వరి కొయ్యలు కాల్చడం వల్ల పంట పొలాలు, ధాన్యం కుప్పలు, సంచుల్లో నింపిన ధాన్యం దగ్ధమై తీరని నష్టం వాటిల్లింది. వ్యర్థాలను తగలబెట్టడం వల్ల పర్యావరణానికి, నేలకు, రైతు ఆదాయానికి ఎంతో నష్టం కలుగుతోంది. ఏటా వానాకాలం దుక్కులకు ముందు రైతులు పొలాల్లో ఉన్న వ్యర్థాలను తొలగించుకోవాలి తప్ప మంట పెట్టడం శ్రేయస్కరం కాదని శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అదికారులు సూచిస్తున్నారు. పర్యావరణానికి నష్టమే కాకుండా భూమిలో పోషకాలు, పంటలకు మేలు చేసే కీటకాలు చనిపోయి చీడపీడలకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు.
ఫ పర్యావరణానికి, ఆస్తి, ప్రాణాలకు ప్రమాదమే..
వరికొయ్యలు, పత్తికట్టెలు, మొక్కజొన్న వ్యర్థాలను తగలబెట్టినపుడు కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ లాంటి విషవాయువులు విడుదల అవుతాయి. వాయుకాలుష్యం బాగా పెరుగుతుంది. పొగతోపాటు బూడిద గాలిలో కలిసి చుట్టూ ఊర్లు, నగరాల్లో శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు పెరుగుతాయి. అలాగే భూసారం కూడా దెబ్బతిననున్నది. పంట వ్యర్ధాలు కాల్చడం వల్ల నేలలో ఉండే సేంద్రియ కర్బనం, వైట్రోజన్, ఫాస్పరస్, పొటాష్, గంధకం లాంటి పోషకాలు నాశనం అవుతాయి. ఒక టన్ను పంట వ్యర్థం కాల్చడం వల్ల సుమారు 5నుంచి 6 కిలోల నత్రజని, 2నుంచి 3కిలోల పాస్ఫరస్, 25కిలోల కంటే ఎక్కువ పొటాష్, 400కిలోల సేంద్రీయ కర్బనం నష్టం జరుగుతుందని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. నేలపై మంట వల్ల తేమ శాతం, మేలు చేసే బ్యాక్టీరియా, ఫంగై తగ్గడంతో నేల బురదగా మారి దున్నడం కష్టమవుతుంది. తర్వాత పంట దిగుబడి తగ్గుతుంది. అలాగే మట్టి తేమ ఆవిరై, భూగర్భ జలాలు ఎక్కువగా వాడాల్సి రావడం వల్ల నీటి ఖర్చు, వంపు ఖర్చు పెరుగుతుంది. పోషకాలు లేకపోవడం వల్ల రసాయనిక ఎరువులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడి ఖర్చు పెరుగుతుంది. దీర్ఘకాలంలో దిగుబడి తగ్గడంతో రైతుకు ఆర్థికంగా తీరని నష్టం వాటిల్లనున్నది. పొలాల్లో వ్యర్థాలు నిప్పుపెట్టడం ద్వారా దగ్గరలో ఉన్న ఇతర పంటలు, జీవాలు, గృహాలు, విద్యుత్‌బోర్ల వంటి ఆస్తులు మంటల్లో కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ పొగ, వేడివల్ల పశువులకు శ్వాసకోశ సమస్యలు, కళ్ల సమస్యలు ఏర్పడి పాడి ఉత్పత్తి తగ్గిపోనున్నది. ఇలాంటి నష్టాలు తగ్గించేందుకు వంట వ్యర్థాలను కాల్చకుండా బయోగ్యాస్, కం పోస్టు, మృత్తిక పొగ మంచు, బయోచార్ వంటి మార్గాల్లో ఉపయోగించడం మంచిదని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలను రైతులు పండిస్తున్నారు. వరి పంటను హార్వెస్టర్ల ద్వారా కోయడం వల్ల పొలాల్లో కొయ్యలు ఉంటున్నాయి. ఆ తర్వాత పంట కోసం పొలాన్ని సిద్ధం చేయడంలో భాగంగా రైతులు వరి కొయ్యలను కాల్చుతున్నారు. కానీ వాటి అవశేషాలను కాల్చకుండా నేలలోనే కలియ దున్నడం వల్ల వరి కొయ్యలు మట్టిలో కలుస్తాయి. క్రమేపి వాటి నుంచి సేంద్రీయ కర్బనం, నైౖట్రోజన్ వంటి పోషకాలు నేలకు అందుతాయి. ఇది నేలలో నీరు పట్టుకునే శక్తి, నేల గాలి ప్రసారం పెంచి, తరువాత పంట వరకు భూసార వినియోగాన్ని తగ్గిస్తుంది.
ఫ ట్రాక్టర్ రోటవేటర్‌తో దున్నితే మేలు..
వరికోసి మిగిలిన కొయ్యకాళ్లను తగలబెట్టకుండా పొలంలోనే వదిలేసి తర్వాత ట్రాక్టర్ రోటవేటర్‌తో రెండు, మూడుసార్లు దున్నితే కొయ్యలు ముక్కలై నేలలోకి పోతాయి. వర్షం ఉండే పొలానికి నీరు పెట్టి, ఎకరాకు 50నుంచి 100కిలోల సూపర్ ఫాస్పేట్ వేస్తే 20నుంచి 30రోజుల్లో కొయ్యలు కుళ్లి సేంద్రియ కర్బనం, పోషకాలు నేలకు అందుతాయి. వరిగడ్డి కొయ్యలను చిన్న ముక్కలుగా కత్తిరించి పేడ, గొబ్బరం, కిరోసిన్ లేదంటే పేపర్‌కలిపి కుప్పల్లో పేర్చి, వేస్ట్ డీకంపోసర్ లేదా సాధారణ కంపోస్టు బ్యాక్టీరియాతో పిచికారి చేస్తే 30నుంచి 45రోజుల్లో కంపోస్ట్ తయారవుతుందని అధికారులు తెలిపారు. జిల్లాలో రైతులు వరికొయ్యలు కాల్చకుండా ఉండేందుకు వ్యవసాయ శాఖాధికారులు రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించకుంటే జిల్లాలో మరిన్ని పంట పొలాలు దగ్ధమయ్యే అవకాశాలున్నాయి.