మోత మోగింది..
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:43 AM
దీపావళికి జిల్లాలో మోత మోగింది. టపాసుల చప్పుళ్లతోపాటు తారాజువ్వల వెలుగుల జిలుగులు పండుగకు వన్నె తెచ్చాయి.
- నగరంలో దద్దరిల్లిన టపాసులు
- జిల్లాలో రూ.8 కోట్ల వ్యాపారం
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్)
దీపావళికి జిల్లాలో మోత మోగింది. టపాసుల చప్పుళ్లతోపాటు తారాజువ్వల వెలుగుల జిలుగులు పండుగకు వన్నె తెచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లో పండుగ సందడి అధికంగా కనిపించింది. చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా కరీంనగర్ ఈ దీపావళికి సరికొత్త కాంతులీనుతూ కనిపించింది. రాత్రివేళలో ఎక్కడ చూసినా నింగికి ఎగురుతున్న తారాజువ్వలు, వెలుగులను విరజిమ్మే టపాసుల వెలుగులే దర్శనమిచ్చాయి. భారీ మోతలతో కూడిన ధ్వని తీవ్రత ఈసారి ఎక్కువగా వినిపించింది. సాధారణంగా ఉండే నగరం కన్నా ఈ సారి సగటు ధ్వనికన్నా ఎక్కువ డెసిబుల్స్ తీవ్రత జనాల చెవిని తాకింది.
ఫ శబ్ద తీవ్రత రెట్టింపు..
టపాసుల మోత వల్ల నగరంలో శబ్ద తీవ్రత రెట్టింపయ్యింది. మనిషి వినికిడికి 70 డెసిబెల్ దాటిన శబ్దం హాని కలిగిస్తుంది. సురక్షితమైన ఈస్థాయిని దాటితే ఇబ్బంది పెరుగుతుంది. దీపావళి సందర్భంగా పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ ధ్వని ప్రభావం అనూహ్యంగా పెరిగింది. నగరంలోని కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరికరం ద్వారా అప్పుడప్పుడు ధ్వనితోపాటు వాయు కాలుష్యాన్ని లెక్కిస్తున్నారు. దీని ఆధారంగానే వాతావరణంలో పెరుగుతున్న కాలుష్య ఉద్గారాలను గుర్తిస్తున్నారు. టపాసుల మోత ఈసారి పెరగడంతో శబ్ద తీవ్రత కూడా చాలచోట్ల రెట్టింపైంది. ఇక పెరిగిన పొగ వల్ల వాయు కాలుష్యం కూడా పెరిగింది. శ్వాస కోశ ఇబ్బందులున్న వారు, హృద్రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఫ కొనుగోళ్ల సందడి..
గతేడాదితో పోలిస్తే ఈసారి టపాసుల దుకాణాల వద్ద సందడి కనిపించింది. సంప్రదాయంగా వస్తున్న పండుగను ఘనంగా నిర్వహించుకునే క్రమంలో జిల్లాలో జనాలు విరివిగా కొనుగోలు చేశారు. జిల్లాలో ప్రజానీకం పండుగను అత్యంత ఇష్టంగా నిర్వహించుకుని సందడి చేశారు. గతేడాది కరీంనగర్లో 133 దుకాణాలు వెలువగా ఈసారి వాటి సంఖ్య 250కి చేరింది. జిల్లావ్యాప్తంగా 300కుపైగా నెలకొల్పారు. నగరంలోని ఒక్కో దుకాణంలో గడిచిన వారం రోజులుగా సగటున మూడు లక్షల గిరాకీ అయింది. ఇతర పట్టణాల్లో ఈ కొనుగోళ్లు కరీంనగర్‌తో పోలిస్తే తక్కవగా జరిగాయు. మొత్తంగా ఈ దీపావళి పండుగకు జిల్లాలో ఎనిమిది కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు వ్యాపారవర్గాలు తెలిపాయి.