డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:09 AM
మత్తు పదార్థాలపై విద్యార్థులు, యువతను అప్రమత్తం చేయాలని, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు.
కరీంనగర్ క్రైం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాలపై విద్యార్థులు, యువతను అప్రమత్తం చేయాలని, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, డీఆర్‌ఓ స్వామి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు నమోదైన కేసులు, నిర్వహించిన తనిఖీలు, మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, బాధితులకు అందిస్తున్న వైద్య సేవలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, వినియోగంపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాల ఆకర్షణకు లోనుకాకుండా విద్యాసంస్థల స్థాయి నుంచే నిరంతర అవగాహన కల్పించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. విద్యాసంస్థలు, మెడికల్ షాపులు, బస్టాండ్ల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.
ఫ రహదారి భద్రతా నిబంధనలు అమలు చేయాలి
రహదారి భద్రతా నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. రహదారులపై ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అవసరమైన మరమ్మతులు, భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల వల్ల ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సూచించా రు. జాతీయ రహదారులపై ప్రమాద బాధితులకు అందిస్తున్న వైద్యసేవల గురించి అధికారులతో సమీక్షించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు, ఈ-చలాన్లు, హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.