పాఠశాల క్రీడలకు వేలాయే
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:49 AM
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) పోటీలకు రంగం సిద్ధమవుతోంది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) పోటీలకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు మొదటి వారం నుంచి సెప్టెంబరు చివరి వారం వరకు నాలుగు దశల్లో పోటీలను పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా జిల్లాలో ఎస్‌జీఎఫ్ కమిటీల పునర్వ్యవస్థీకరణతో పాటు క్రీడల నిర్వహణకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.
ఫ కొత్త కమిటీల ఏర్పాటుకు కసరత్తు
ప్రస్తుత ఎస్‌జీఎఫ్ కార్యనిర్వహణ కార్యదర్శుల పదవీకాలం ఈ నెలతో ముగియనుండటంతో కొత్త కమిటీల నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. అండర్ 14, అండర్ 17 విభాగాలకు పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు (పీడీలు), అండర్ 19 విభాగానికి ఇంటర్మీడియట్ విద్యాసంస్థల పీడీలను కార్యదర్శులుగా నియ మించనున్నారు. సాధారణంగా ఎస్‌జీఎఫ్ కార్యదర్శుల పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. ఏడాది మాత్రమే పూర్తి చేసిన వారికి మరో ఏడాది కొనసాగింపు ఇవ్వగా, రెండేళ్లు పూర్తి చేసిన స్థానాల్లో కొత్త వారిని నియమించనున్నారు.
ఫ మండలం నుంచి జిల్లా వరకు కమిటీలు
పాఠశాల స్థాయి కమిటీల నియామకం పూర్తయిన వెంటనే మండల, జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. మండల స్థాయిలో ఎంఈవో, తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు సభ్యులుగా ఉండగా, ఆర్గనైజింగ్ కార్యదర్శి నిర్వహణ బాధ్యతలు చేపడతారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, అదనపు కలెక్టర్, డీఈవో తదితర అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తూ క్రీడల నిర్వహణను పర్యవేక్షిస్తారు.
ఫ నాలుగు దశల్లో పోటీలు
పోటీల నిర్వహణను నాలుగు దశలుగా విభజించారు. ఆగస్టు ఒకటి నుంచి రెండు వారాల్లో మండల స్థాయి పోటీలు, ఆగస్టు మూడో వారంలో జోనల్ పోటీలు, సెప్టెంబరు రెండో వారంలో జిల్లా స్థాయి పోటీలు, సెప్టెంబరు నాలుగో వారంలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారు.ప్రతి దశలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు తదుపరి స్థాయికి అర్హత సాధిస్తారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఫ 30కి పైగా క్రీడాంశాల్లో పోటీలు
ఈసారి ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో 30కిపైగా క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. అథ్లెటిక్స్, విలువిద్య, బ్యాడ్మింటన్, బేస్‌బాల్, బాస్కెట్‌బాల్, బీచ్ వాలీబాల్, బాక్సింగ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, జూడో, కరాటే, ఖోఖో, స్కేటింగ్, సాఫ్ట్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ (ఫ్రీస్టైల్, గ్రెకో-రోమన్), యోగాసన తదితర విభాగాల్లో విద్యార్థులు ప్రతిభ చాటుకునే అవకాశం కల్పించనున్నారు.
ఫ ప్రతిభకు తొలి మెట్టు
ఎస్‌జీఎఫ్ పోటీలు గ్రామీణ ప్రాంత విద్యార్థుల క్రీడా ప్రతిభను వెలికితీయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించిన పలువురు క్రీడాకారులు ఎస్‌జీఎఫ్ పోటీల ద్వారానే తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. దీంతో ఈ ఏడాది కూడా జిల్లాలోని పాఠశాలలు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పోటీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అధికారులు కూడా పోటీలను పారదర్శకంగా నిర్వహించి ప్రతిభావంతులను గుర్తించాలని నిర్ణయించారు.