Share News

కాళేశ్వరంతోనే రైతులకు సాగునీరు

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:32 AM

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే రైతులకు సాగునీరు అందిందని రాష్ట్ర మాజీ మంత్రి, కరీంనగర్‌ శాసన సభ్యుడు గంగుల కమలాకర్‌ అన్నారు. కొత్తపల్లి మండలంలోని నాగుల మల్యాల శివారులోని ఆచంపల్లి వరద కాలువ ఓటీ వద్ద రైతులతో కలిసి ఆదివారం వంటావార్పు, ధర్నా నిర్వహించారు.

కాళేశ్వరంతోనే రైతులకు సాగునీరు
ధర్నాలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

- కేటీఆర్‌ నాయకత్వంలో కన్నెపల్లి వరకు పాదయాత్ర

- ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

భగత్‌నగర్‌/గంగాధర, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే రైతులకు సాగునీరు అందిందని రాష్ట్ర మాజీ మంత్రి, కరీంనగర్‌ శాసన సభ్యుడు గంగుల కమలాకర్‌ అన్నారు. కొత్తపల్లి మండలంలోని నాగుల మల్యాల శివారులోని ఆచంపల్లి వరద కాలువ ఓటీ వద్ద రైతులతో కలిసి ఆదివారం వంటావార్పు, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ రైతుల అవసరాలను గుర్తించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు. కాళేశ్వరం మోటార్లు నడిపితే కేసీఆర్‌కు పేరు వస్తుందనే రాజకీయ కారణాలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగునీటిని విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. పదేళ్లుగా కళకళలాడిన గొలుసుకట్టు చెరువులు కాంగ్రెస్‌ పాలనలో మళ్లి ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డ నుంచి వేలాది క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. వారం రోజుల్లోగా ప్రభుత్వం స్పందించి తూము ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేక పోతే వరద కాలువలో బారీ మోటార్లు ఏర్పాటు చేసి రైతులకు నీరు అందిస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించక పోతే కేటీఆర్‌, హరీష్‌రావు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రైతులతో కలిసి కన్నెపల్లి వరకు పాదయాత్ర నిర్వహించి మోటార్లు ఆన్‌ చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన మాజీ చైర్మన్‌ రవీందర్‌సింగ్‌, పెండ్యాల శాంసుందర్‌రెడ్డి, రెడ్డవేణి మధు, గ్రంఽథాలయ మాజీ చైర్మన్లు పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి, చల్ల హరిశంకర్‌, కాసారపు శ్రీనివాస్‌గౌడ్‌, పిల్లి మహేష్‌గౌడ్‌, పెండ్యాల అంజేయులు, లక్కాకుల మోహన్‌రావు, ఉప్పు రాజశేఖర్‌పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2026 | 12:32 AM