Share News

అక్రమాలు కోకొల్లలు..

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:23 AM

దీపావళి.. ఇంటిల్లిపాదికి సరదాను ఇచ్చేది టపాసులు కాల్చడం. చిన్నాపెద్ద తేడా లేకుండా వివిధ టపాసులు కాలుస్తూ సంబరంగా ఆదివారం దివ్వెల పండుగను జరుపుకోనున్నారు. ఈ పండుగకు సరిగ్గా 48 గంటలు జరిగే వ్యాపారంలో కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. ఈ అక్రమాలు కోకొల్లలుగా జరుగుతాయి. ప్రతి యేడాది రాజన్న సిరిసిల్ల జిల్లాలో జీరో వ్యాపారం సాగుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తారనే విమర్శలు ఉన్నాయి.

అక్రమాలు కోకొల్లలు..

- జిల్లాలో జోరుగా టపాసుల వ్యాపారం

- అలా లైసెన్స్‌.. ఇలా సరుకు..

- సరుకు లక్షల్లో... బిల్లులు నామమాత్రం

- డిస్కౌంట్‌ల పేరిట వ్యాపారుల దోపిడీ

- అ‘ధర’గొడుతున్న పేలుడు సామగ్రి

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

దీపావళి.. ఇంటిల్లిపాదికి సరదాను ఇచ్చేది టపాసులు కాల్చడం. చిన్నాపెద్ద తేడా లేకుండా వివిధ టపాసులు కాలుస్తూ సంబరంగా ఆదివారం దివ్వెల పండుగను జరుపుకోనున్నారు. ఈ పండుగకు సరిగ్గా 48 గంటలు జరిగే వ్యాపారంలో కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. ఈ అక్రమాలు కోకొల్లలుగా జరుగుతాయి. ప్రతి యేడాది రాజన్న సిరిసిల్ల జిల్లాలో జీరో వ్యాపారం సాగుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తారనే విమర్శలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వంద వరకు లైసెన్స్‌లు పొంది భారీగా టపాసులు, బాణాసంచా వ్యాపారం సాగుతుంది. చాలా గ్రామాల్లో అనధికారిక అమ్మకాలు కూడా సాగుతాయి. రెండు రోజుల వ్యాపారానికి తీసుకునే లైసెన్సు కూడా 48 గంటల ముందే వారి చేతికి అందడంతోనే వివిధ టపాసులు దిగిపోతాయి. దుకాణాల్లో ఉండే సరుకు, బిల్లులకు పొంతన ఉండదు. జీఎస్టీ మాటే ఉండదు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత టపాసులపై 28 శాతం పన్ను విధించారు. బాణాసంచా ధరలు పెరగడం, వ్యాపారంపై ప్రభావం పడుతుందని టపాసులుపై జీఎస్టీ కౌన్సిల్‌ స్లాబును 18శాతానికి తగ్గించింది. ఇందులో కేంద్ర జీఎస్టీ 9 శాతం రాష్ట్ర జీఎస్టీ 9శాతంగా నిర్ణయించారు. వ్యాపార ప్రయోజనాల కోసం జీఎస్టీ తగ్గినా వ్యాపారులు మాత్రం చెల్లించడం లేదని తెలుస్తోంది. తమిళనాడులోని శివకాశీ ప్రాంతం నుంచి అత్యధికంగా బాణాసంచా రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు పొరుగున ఉన్న జగిత్యాల, సిద్దిపేట ప్రాంతాలకు వస్తుంది. అక్కడి నుంచి సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు తాత్కాలిక లైసెన్సులు పొంది దుకాణాలు ఏర్పాటు చేసుకొని విక్రయాలు ప్రారంభిస్తున్నారు. తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారు కూడా జీఎస్టీ చట్టంలో సీటీపీ అనే ప్రత్యేక సదుపాయం కల్పించారు. దుకాణం ఏర్పాటు చేసుకునే ఐదు రోజుల ముందే జీఎస్టీ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. కానీ ఎవరు కూడా పట్టించుకోరు. దీనివల్ల ఒక్కో వ్యాపారి కనీసంగా రూ.10 లక్షల వరకు వివిధ రకాల టపాసులు తీసుకొచ్చి విక్రయిస్తారు. ఇందులో కూడా తెల్లకాగితం పైన బిల్లులు ఉంటాయి. మరికొందరు రెండు మూడు లక్షలకే బిల్లు తెచ్చుకుంటారు. దీనివల్ల జీఎస్టీ అధికారులు తనిఖీలకు వచ్చినా వ్యాపారులపై పెద్ద ప్రభావం పడదు. అధికారులు కూడా తీసుకొచ్చిన సరుకులు లెక్కించి పన్ను వసూలు చేయడంలో స్పష్టత లేకుండా పోయింది. వ్యాపారులు చూపిందే బిల్లు అన్న చందంగా జిల్లాలో టపాసుల వ్యాపారం ప్రతి ఏటా సాగుతుంది. అధికారులు కూడా నామమాత్రంగా తనిఖీలు చేసి మామూలుగానే వదిలేస్తారని ఆరోపణలు ఉన్నాయి. లైసెన్స్‌ వచ్చిన వెంటనే తీసుకొచ్చే సరుకులు అక్రమంగా దిగుమతి చేసుకున్న అమ్ముతున్నారా, బిల్లుల ప్రకారం తెస్తున్నారా అని తనిఖీలే ఉండవు. దీంతో వినియోగదారులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు.

పొంతన లేని ధరలు..

దీపావళి బాణాసంచా ధరలు ముందే పేలుతున్నాయి. మరోవైపు డిస్కౌంట్ల పేరిట వ్యాపారులు వినియోగదారులను దోపిడీకి గురి చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు అవుతున్న దుకాణాల్లో టపాసులు పరిశీలిస్తే ఒక్కో ఐటంపై రూ.2వేల పైన ఎంఆర్పీ ఉంటే సగం ధరకే విక్రయిస్తారు. మరోవైపు కేజీ సెల్‌, ప్రత్యేక డిస్కౌంట్ల పేరిట ఆకర్షిస్తారు. జిల్లాలో ప్రతియేటా దాదాపు రూ.4 కోట్ల నుంచి రూ.4.50 కోట్ల వరకు బాణాసంచా వ్యాపారం జరుగుతుంది. గతంలో ఒక బాంబుల ప్యాకెట్‌ రూ.150 ఉంటే ఈసారి రూ.200 దాటినట్లుగా వ్యాపారులు తెలిపారు. దుకాణం ఏర్పాటు చేసుకోవడానికి లైసెన్స్‌ పొందడానికి కొన్ని శాఖలకు ప్రభుత్వానికి చెల్లించే చలాన్ల డబ్బులతో పాటు చేతులు తడపాల్సిన పరిస్థితి ఉందని వ్యాపారులు వాపోతున్నారు. విక్రయాల కోసం తాత్కాలికంగా పొందిన లైసెన్స్‌, షెడ్‌ నిర్మాణాలకు రూ.30 నుంచి రూ.40 వేల వరకు ఖర్చు అవుతుందని వ్యాపారులు తెలిపారు.

నిబంధనలు దూరమే...

సిరిసిల్ల, ఇతర ప్రాంతాల్లో బాణాసంచా అమ్మకాలు జనావాసాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగిస్తున్నారు. సిరిసిల్లలో బతుకమ్మ ఘాట్‌ వద్ద నిబంధనల ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగానే దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఒక దుకాణానికి మరో దుకాణానికి మధ్య కనీసం మూడడుగుల దూరం ఉండడంతో పాటు ఇసుక, నీరు, నీటి డ్రమ్ములు ఏర్పాటు చేసుకోవాలి. ఈ నిబంధనలు ఏమీ పాటించకుండా కేవలం వరుస షెడ్లు ఏర్పాటు చేసుకొని విక్రయాలు జరుపుతున్నారు. ఫైర్‌ సేఫ్టీని పట్టించుకోవడం లేదు. నిబంధనలు పాటించకపోయినా ఆయా శాఖల అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - Nov 07 , 2026 | 01:23 AM