Share News

ఇంటర్‌ యథాతథం..

ABN , Publish Date - May 11 , 2026 | 02:10 AM

ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్‌ కళాశాలలు యథాతథంగా కొనసాగనున్నాయి. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్‌ విద్యను విలీనం చేసే ప్రక్రియకు బ్రేక్‌ పడింది. ఈమేరకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్‌ విద్యను కొనసాగించాలని స్పష్టం చేయడంతో విలీనంపై నెలకొన్న సస్పెన్షన్‌కు తెరపడింది.

ఇంటర్‌ యథాతథం..

- పాఠశాల విద్యలో విలీనానికి బ్రేక్‌

- కళాశాలల యాజమాన్యాల హర్షం

- ఇక అడ్మిషన్ల జాతర

కరీంనగర్‌ టౌన్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్‌ కళాశాలలు యథాతథంగా కొనసాగనున్నాయి. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్‌ విద్యను విలీనం చేసే ప్రక్రియకు బ్రేక్‌ పడింది. ఈమేరకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్‌ విద్యను కొనసాగించాలని స్పష్టం చేయడంతో విలీనంపై నెలకొన్న సస్పెన్షన్‌కు తెరపడింది. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు, లెక్చరర్లతోపాటు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ విద్యావిధానంలో పదవ తరగతి తర్వాత ఇంటర్మీడియట్‌కు బదులుగా +2 కొనసాగిస్తుండడంతో 2026-27 విద్యాసంవత్సరంలోనే పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్‌ను విలీనం చేస్తారని చెబుతూ వచ్చారు.

ఫ అడ్మిషన్లపై సందిగ్ధం

ప్రతి యేడాది మాదిరిగానే ఈయేడూ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ కార్యదర్శి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో అడ్మిషన్లకు షెడ్యూల్‌ జారీ చేశారు. ప్రభుత్వం విలీనం చేయాలని నిర్ణయించిందనే కారణంగా మరుసటి రోజు ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. దీంతో ఇంటర్మీడియట్‌ బోర్డు రద్దు అవుతుందని తెలియడంతో కళాశాలల యాజమాన్యాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించి ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. ప్రతి సంవత్సరం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు పూర్తికాక ముందు నుండే ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేసి ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే ఫీజులో రాయితీ కల్పిస్తామని ప్రకటిస్తుంటాయి. ఈ యేడు ఇంటర్‌ విద్యను విలీనం చేస్తామనడంతో ప్రవేశాలను నిలిపివేశారు. కొంత మంది కళాశాలల యాజమాన్యాలు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా చాలా మంది అధికారికంగా ఇంకా అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టలేదు. సాధారణంగా మే 8 నుంచి మే 31వ తేదీ వరకు అధికారికంగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. జూన్‌ 1 నుంచి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసి తరగతులను ప్రారంభిస్తారు. ఈసారి విలీనం కారణంగా అడ్మిషన్ల ప్రక్రియ నిలిచి పోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులే కాకుండా కళాశాలల నిర్వాహకులు ఎటూ తేల్చుకోలేక పోయారు.

ఫ జిల్లాలో 105 జూనియర్‌ కళాశాలలు

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌, సోషల్‌ వెల్ఫేర్‌, మోడల్‌ స్కూల్స్‌ కలిపి మొత్తం 105 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 55 ప్రైవేట్‌, 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, మిగిలినవి సోషల్‌ వెల్ఫేర్‌, మోడల్‌ స్కూల్‌ ఉన్నాయి. వీటిలో ప్రతి విద్యాసంవత్సరంలో ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్లలో కలిపి 36 వేలకు పై చిలుకు విద్యార్థులు చదువుతుంటారు. ఫస్ట్‌ ఇయర్‌లో 18 వేల నుంచి 20 వేల వరకు అడ్మిషన్లు తీసుకుంటారు. ఇంటర్మీడియట్‌ విద్య విలీనం ప్రతిపాదన చేయకుంటే ఇప్పటికే 10 వేల మంది విద్యార్థుల అడ్మిషన్లు పూర్తయ్యేయి. ఇంటర్‌ విలీనంతో అడ్మిషన్లు ఆగిపోయాయి. ఈనెలాఖరు వరకు అడ్మిషన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో కొంత ఇబ్బందులు తప్పవని, ప్రభుత్వం విలీనం ప్రతిపాదనను తాత్కాలికంగా రద్దు చేయడం హర్షణీయమని జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్‌, లెక్చరర్ల సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. తిరిగి విలీనం చేయాలనుకుంటే అన్ని వర్గాలతో చర్చించి కళాశాలలకు నష్టం జరుగకుండా ప్రణాళికాబద్దంగా నిర్ణయం తీసుకోవాలని ఆయా సంఘాలు కోరుతున్నాయి.

Updated Date - May 11 , 2026 | 02:10 AM