చాలనివేతనం.. పోషణభారం
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:42 AM
కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం)ల్లో నియామకమైన పార్ట్‌టైం ఒకేషనల్ టీచర్ల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాల ఆడపిల్లలు పాఠశాల మానేయకుండా, వారికి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారు తమ కాళ్లపై తాము నిలబడేలా ‘చదువు- నైపుణ్యం- ఉపాధి’ అనే త్రిసూత్ర లక్ష్యంతో కేజీబీవీల్లో వృత్తివిద్యను సైతం పదిహేనేళ్ల క్రితం ప్రవేశపెట్టారు.
- దయనీయంగా కేజీబీవీ పార్ట్‌టైం ఒకేషనల్ టీచర్ల పరిస్థితి
- 15 ఏళ్లుగా పనిచేస్తున్నా నెలవారీ వేతనం రూ.7,800
- కనీసం వేతనం రూ.20 వేలు అందించాలని డిమాండ్
- జిల్లాలో 16 మంది టీచర్లు
జగిత్యాల, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం)ల్లో నియామకమైన పార్ట్‌టైం ఒకేషనల్ టీచర్ల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాల ఆడపిల్లలు పాఠశాల మానేయకుండా, వారికి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారు తమ కాళ్లపై తాము నిలబడేలా ‘చదువు- నైపుణ్యం- ఉపాధి’ అనే త్రిసూత్ర లక్ష్యంతో కేజీబీవీల్లో వృత్తివిద్యను సైతం పదిహేనేళ్ల క్రితం ప్రవేశపెట్టారు. ఇందుకోసం పార్ట్ టైమ్ ఒకేషనల్ టీచర్లను నియమించారు. ఒక్కో విద్యాలయంలో ఒక్కో పార్ట్ టైం ఒకేషనల్ టీచర్ చొప్పున రాష్ట్రంలో 495 కేజీబీవీల్లో 495 మంది పార్ట్ టైం ఒకేషనల్ టీచర్లను నియమించారు. జగిత్యాల జిల్లాలోని 16 కేజీబీవీల్లో 16మంది పార్ట్ టైం ఒకేషనల్ టీచర్లు పనిచేస్తున్నారు. బాలికలకు పాఠశాల స్థాయి నుంచే టైలరింగ్, బ్యూటీ అండ్ వెల్‌నెస్, ఐటీ, హెల్త్ కేర్ వంటి రంగాల్లో ప్రయోగాత్మక నైపుణ్యాలు నేర్పించి స్వయంఉపాధి పొందేలా పార్ట్ టైం ఒకేషనల్ టీచర్లు తీర్చిదిద్దుతున్నారు. అరకొర వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం తదితర సమస్యలతో పార్ట్ టైం ఒకేషనల్ టీచర్లు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
- భారంగా కుటుంబపోషణ..
ఇంటర్‌తో పాటు టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ (టీటీసీ) కోర్సు పూర్తి చేస్తేనే పార్ట్ టైం ఒకేషనల్ టీచర్ ఉద్యోగానికి అర్హత లభిస్తుంది. ఇటువంటి అత్యున్నత సాంకేతిక అర్హతలు కలిగి ఉండి, కేజీబీవీల్లో నియామకం అయిన నాటికి వారి నెలవారీ వేతనం రూ.4,500 మాత్రమే పొందారు. ప్రస్తుతం నెలకు రూ.7,800 గౌరవ వేతనం అందిస్తున్నారు. దాదాపుగా పదిహేనేళ్లుగా సేవచేస్తున్నా అరకొర జీతంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని వారు ఆవేదన చెందుతున్నారు.
- కనీస వేతన చట్టం వర్తింపచేయాలని..
కేజీబీవీల్లో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్లను హైస్కిల్డ్ (అత్యంత నైపుణ్యం కలిగిన) కార్మికులుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన కనీస వేతన చట్టం ప్రకారం 2026 జూన 1వ తేదీ నుంచి నెలకు రూ.20 వేల వేతనాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. స్పష్టమైన సర్వీస్ రూల్స్ రూపొందించి, ఉద్యోగ భద్రత కల్పించాలంటున్నారు. కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సౌకర్యం కల్పించేలా హెల్త్ కార్డుల మంజూరు చేయాలని వేడుకుంటున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభంలోనైనా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
రూ.20 వేలు కనీస వేతనం అందించాలి
-గుర్రం స్వప్న, ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన జిల్లా అధ్యక్షురాలు
కేజీబీవీల్లో పనిచేస్తున్న పార్ట్ టైం ఒకేషనల్ టీచర్లకు కనీస నెలవారీ వేతనం రూ.20 వేలు చెల్లించాలి. హైస్కిల్డ్ కార్మికులుగా గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన కనీస వేతన చట్టం ప్రకారం 2026 జూన 1వ తేదీ నుంచి జీతాలు అందించాలి.
సమాన పనికి సమానం వేతనం అమలుచేయాలి
-బైరం హరికిరణ్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు
కేజీబీవీల్లో పార్ట్ టైం ఒకేషనల్ టీచర్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సమానపనికి సమాన వేతనం అమలు చేయాలి. కేజీబీవీ సీఆర్‌టీలతో సమానంగా నెలకు రూ.26 వేతనం ఇవ్వాలి. పదిహేనేళ్లుగా పనిచేస్తున్నప్పటికీ నెలకు రూ.7,800 అందించడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలి.