Share News

వసతిగృహాల తనిఖీ

ABN , Publish Date - Jul 31 , 2026 | 11:52 PM

జమ్మికుంట పట్టణంలోని బీసీ, ఎస్సీ బాలుర వసతి గృహాలను కలెక్టర్‌ చిత్రా మిశ్రా శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు.

వసతిగృహాల తనిఖీ

జమ్మికుంట, జూలై 31 (ఆంధ్రజ్యోతి) జమ్మికుంట పట్టణంలోని బీసీ, ఎస్సీ బాలుర వసతి గృహాలను కలెక్టర్‌ చిత్రా మిశ్రా శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. జూలై 14న ‘శిథిలావస్థలో బీసీ హాస్టల్‌’ అనే కథనం ప్రచురిమైంది. ఈ కథనానికి స్పందించిన కలెక్టర్‌ చిత్రా మిశ్రా బీసీ వసతి గృహంలోని గదులు, పడక గదులు, వంటగది, స్టోర్‌రూమ్‌ను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. వసతి, చదువు, భోజనం, ఆరోగ్యం గురించి ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం, టిఫిన్లు అందిస్తున్నారా.. అని ప్రశ్నించారు. దోమల సమస్య, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. స్టోర్‌రూమ్‌లోని బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనెను పరిశీలించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఎట్టిపరిస్థితుల్లో వినియోగించవద్దని సిబ్బందిని హెచ్చరించారు. హాస్టల్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. బీసీ, ఎస్సీ హాస్టల్‌ భవనాల్లో ఉన్న లోపాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈఈ అశోక్‌కుమార్‌ను ఆదేశించారు. వెంటనే మరమ్మతులను పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించాలని స్పష్టం చేశారు. కలెక్టర్‌ వెంట డిప్యూటీ తహసీల్దార్‌ శంకర్‌, ఏఈ రమేష్‌, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 11:52 PM