Share News

ఇందిరమ్మ ఇళ్లకు ధరాఘాతం

ABN , Publish Date - Jan 07 , 2026 | 01:12 AM

ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్‌ ధరలు అడ్డగోలుగా పెరగడంతో జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. ఆరు మాసాల వ్యవధిలో 40 నుంచి 50 శాతం ధరలు పెరగడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు ధరాఘాతం
నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్‌ ధరలు అడ్డగోలుగా పెరగడంతో జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. ఆరు మాసాల వ్యవధిలో 40 నుంచి 50 శాతం ధరలు పెరగడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు లబ్ధిదారులు వేగంగా చేపట్టేందుకు గాను కలెక్టర్‌ ఇంటి నిర్మాణానికి కావలసిన ఇసుక, కంకర, మట్టి సరఫరాకు, ఇంటి నిర్మాణం చేపట్టే మేస్త్రీల చార్జీలను మధ్యే మార్గంగా ఖరారు చేశారు. అయితే కొద్దిరోజులు అమల్లో ఉన్న ఆ ధరలు ప్రస్తుతం లేకపోవడంతో లబ్ధిదారులపై ఆర్థిక భారం పడుతున్నది. ఇంటి నిర్మాణం చేపట్టే ముందు ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు అదనంగా ఎంత ఖర్చు అవుతుందని వేసుకున్న అంచనాలు ఒక్కసారిగా తారుమారు కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్లు కేటాయించింది. పెద్దపెల్లి జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని, ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలానికి 9438 ఇళ్లను మంజూరు చేశారు. ఇందులో కలెక్టర్‌ 7480 ఇళ్లకు ఆమోదం తెలిపారు. ఇందులో 966 ఇళ్లను కూడా రద్దు చేశారు. ప్రస్తుతం 6514 ఇళ్లకుగాను, 4768 ఇళ్లకు గృహ నిర్మాణ శాఖ అధికా రులు మార్క్‌ అవుట్‌ ఇచ్చారు. ఇందులో 1460 ఇళ్లు బేస్మెంట్‌ లెవల్‌ లో, 778 ఇళ్లు గోడల నిర్మాణంలో, 1462 ఇండ్లు స్లాబ్‌ లెవల్‌ లో ఉన్నాయి. 42 ఇళ్లు పూర్తి కాగా, మిగతా ఇళ్లు ప్రగతిలో ఉన్నాయి.

ఫ నత్తనడకన నిర్మాణాలు..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి మెటీరియల్‌ ధరలు అడ్డగోలుగా పెరగడంతో ఇళ్ల నిర్మాణాలు నత్తన డకన సాగుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకే మెటీరియల్‌ సరఫరా చేసే విధంగా కలెక్టర్‌ ధరలు ఖరారు చేశారు. సాండ్‌ ట్యాక్సీ ద్వారా కాకుండా ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని ఆయా ప్రాంతాలకు ధరలు నిర్ణయించారు. అలాగే ఇటుక వ్యాపారులతో మాట్లాడి తక్కువ ధరకే ఒక్కో ఇటుక 6 రూపాయల 50 పైసలకు ఇవ్వాలని ఇటుక బట్టీల యజమానులతో మాట్లాడారు. అలాగే ఇంటి నిర్మాణాలు చేపట్టే మేస్త్రీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 400 చదరపు అడుగుల నిర్మాణానికి లక్ష 70 వేల రూపాయలు, 600 చదరపు అడుగులలోపు 2 లక్షల ఇరవై వేల రూపాయలు తీసుకోవాలని నిర్ణయించారు. అందుకు మేస్త్రీలు సైతం అంగీకరించారు. ఇప్పుడు కలెక్టర్‌ సమక్షంలో నిర్ణయించిన ధరలు ఏవీ అమలు కావడం లేదు. మానేరు, గోదావరి నదుల నుంచి తీసుకు వచ్చే ఇసుకను ఉచితం చేసినప్ప టికీ ఆయా ప్రాంతాలను బట్టి ధరలను నిర్ణయించిన జిల్లా అధికార యంత్రాంగం ఆ ధరలకు మించి సరఫరా చేస్తున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పర్యవేక్షణ లేకుండా పోయింది. ఉదాహరణకు మానేరు నది నుంచి పెద్దపల్లికి ఒక ట్రాక్టర్‌ ట్రిప్పు ఇసుకకు 1200 రూపా యలు తీసుకోవాల్సి ఉండగా, ప్రస్తుతం 2 వేల నుంచి 3 వేల రూపాయల వరకు ట్రాక్టర్ల యజమానులు వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్‌ ట్రిప్పు 20 ఎంఎం కంకర 2200 రూపాయలకు సరఫరా చేయాల్సి ఉండగా, 3200 నుంచి 4 వేల రూపాయలు తీసుకుంటున్నారు. మేస్త్రీలు సైతం ఒక్కో ఇంటి నిర్మాణానికి మెటీరియల్‌ మినహా గంపగు త్తగా మూడు లక్షల 50 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని లబ్ధిదారులు వాపోయారు. టిప్పర్‌ మట్టి 2500నుంచి 3 వేల రూపాయలు తీసుకోవాల్సి ఉండగా, 4,500ల నుంచి 6 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని లబ్ధిదారులు చెబుతున్నారు. మెటీరియల్‌ సరఫరాదారులు, మేస్త్రీలు ధరలు అడ్డగోలుగా పెంచడంతో లబ్ధిదారులకు భారంగా మారింది. వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఒక్కో ఇంటికి ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షలకు తోడు మూడు లక్షల రూపాయలు సొంతంగా ఖర్చు చేసుకుంటే ఇంటి నిర్మాణం జరుగుతుందని అందరూ భావించారు. పెరిగిన ధరల వల్ల ఒక్కసారిగా అంచనాలు తలకిందులై 10 నుంచి 12 లక్షల వరకు పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి మెటీరియల్‌కు నిర్ణయించిన ధరల ప్రకారం మెటీరియల్‌ సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Updated Date - Jan 07 , 2026 | 01:12 AM