ఇంటింటికీ ‘ఇందిరమ్మ’ కుట్టుమిషన్లు..
ABN , Publish Date - Aug 22 , 2026 | 01:12 AM
తెలంగాణ సర్కార్ మహిళల సాధికారత, ఆర్థికాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి ద్వారా సంక్షేమ పథకాలు, అవకాశాలు కల్పిస్తోంది. ఈక్రమంలోనే బీసీ సామాజిక వర్గంలో నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా 100 శాతం సబ్సిడీతో ఉచితంగా ప్రభుత్వం ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకాన్ని ప్రకటించింది.
- బీసీ మహిళలకు ఉచితంగా రూ.12వేల విలువైన ఆటోమేటిక్ కుట్టుమిషన్లు
- 18 నుంచి 55 ఏళ్లలోపు మహిళలు అర్హులు
- వితంతు, ఒంటరి మహిళలు, మేర, మేరు సామాజిక వర్గానికి ప్రత్యేక ప్రాధాన్యం
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
తెలంగాణ సర్కార్ మహిళల సాధికారత, ఆర్థికాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి ద్వారా సంక్షేమ పథకాలు, అవకాశాలు కల్పిస్తోంది. ఈక్రమంలోనే బీసీ సామాజిక వర్గంలో నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా 100 శాతం సబ్సిడీతో ఉచితంగా ప్రభుత్వం ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా చేసుకునే విధంగా షెడ్యూల్ ప్రకటించింది. ప్రభుత్వం ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు రూ.500కే గ్యాస్‌సిలిండర్, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా వ్యాపార అవకాశాలు, వడ్డీలేని రుణాలు, రుణ బీమా పథకం, ఆరోగ్యలక్ష్మి, స్వయంఉపాధి పథకాలను అందిస్తోంది. ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెనుకబడిన తరగతుల మహిళలకు ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం మరింత ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ తొలి విడతగా రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ కుట్టుమిషన్లు పంపిణీ చేయడానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది.
జిల్లాకు 2 వేల కుట్టు మిషన్లు..
ప్రభుత్వం తొలి విడతగా ప్రతి నియోజకవర్గానికి వెయ్యి కుట్టుమిషన్లు వంద శాతం సబ్సిడీతో అందించాలని నిర్ణయించింది. ఇందులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ రెండు ప్రధాన నియోజకవర్గాలు ఉన్నాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, తంగళ్లపల్లి, వీర్నపల్లి, సిరిసిల్ల మున్సిపాలిటీ ఉండగా, వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ అర్బన్, వేములవాడ మున్సిపాలిటీ, వేములవాడ రూరల్, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాలతో పాటు జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్న కథలాపూర్, భీమారం, మేడిపల్లి మండలాలు ఉన్నాయి. జిల్లాలోని బోయినపల్లి మండలం చొప్పదండి నియోజకవర్గంలో ఉండగా, ఇల్లంతకుంట మండలం మానకొండూరు నియోజకవర్గంలో ఉంది. ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12 వేల వరకు ఉంటుంది. వీటిని రాజన్న సిరిసిల్ల జిల్లాకు 2 వేల వరకు ఆటోమేటిక్ కుట్టుమిషన్లు మహిళలకు అందిస్తారు.
సెప్టెంబరు 15 దరఖాస్తులకు గడువు
జిల్లాలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన 18 నుంచి 55 సంవత్సరాల వరకు ఉన్న మహిళలు ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబరు 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునే వీలు కల్పించారు. మహిళలు కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షల వరకు మించకూడదు. ఒక కుటుంబం నుంచి ఒక రేషన్ కార్డుపై ఒకరికి మాత్రమే ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని వర్తింపచేస్తారు. దరఖాస్తు చేసుకునే మహిళ తప్పనిసరిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. పేద మహిళలు, నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలకు ప్రాధాన్యం ఇస్తారు. దీంతో పాటు మేర, మేరు సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
కనీస విద్యార్హత ఉండాలి
ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్ లబ్ధి పొందాలంటే మహిళలకు కనీస విద్యార్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునే క్రమంలో ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డ్, సమ్మర్ పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను మండల, మున్సిపాలిటీ స్థాయి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయిస్తారు. ఆన్‌లైన్ చేసిన దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకొని మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది.
కుట్టుమిషన్లకు పైరవీలు
రాజన్న సిరిసిల్ల జిల్లాకు 2 వేల వరకు కుట్టు మిషన్లు మహిళలకు ఉచితంగా పంపిణీ కానున్నాయి. ఆన్‌లైన్ ద్వారా ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియతో పాటే పైరవీలు మొదలయ్యాయి. మున్సిపాలిటీలో వార్డు కౌన్సిలర్లు, గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యులు అధికార పార్టీ నాయకుల చుట్టూ మహిళలు కుట్టుమిషన్లు ఇప్పించమంటూ తిరుగుతున్నారు. మండల పరిషత్, మున్సిపాలిటీలో కుట్టు మిషన్లకు ఎంపిక ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు కూడా తమ వర్గీయులకు ఇప్పించుకునే పనిలో పడ్డారు. ఎన్నికల్లో మహిళా సంఘాల సభ్యులు అండగా ఉండడంతో వారికి చిన్నపాటి సాయం కూడా చేయకపోతే ఎలా అంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అర్హులైన బీసీ మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
- కలెక్టర్ గరిమ అగ్రవాల్
జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల్లో అర్హులైన బీసీ మహిళలు ఆన్‌లైన్ ద్వారా ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో కోరారు. అర్హులైన బీసీ మహిళలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, 100 శాతం సబ్సిడీతో రూ12వేల విలువైన కుట్టు మిషన్ అర్హులకు అందిస్తామని పేర్కొన్నారు.