Share News

ఇంటింటికీ ‘ఇందిరమ్మ బీమా’

ABN , Publish Date - Nov 18 , 2026 | 01:17 AM

ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలుకు శ్రీకారం చుట్టింది.

 ఇంటింటికీ ‘ఇందిరమ్మ బీమా’

జగిత్యాల, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలుకు శ్రీకారం చుట్టింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఈనెల 19వ తేదీన సిద్దిపేట వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం అమలుపై ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించింది. సర్కారు నిర్ణయంతో జిల్లాలో సుమారు 2,83,458 కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ఇందులో గ్రామ పంచాయతీల్లో 2,01,038 కుటుంబాలు, మున్సిపాలిటీల్లో 8,420 కుటుంబాలకు ప్రయోజనం కల్పించాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 481 శిబిర కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో గ్రామ పంచాయతీల్లో 385 శిబిర కేంద్రాలు, మున్సిపాలిటీల్లో 96 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 121మంది పర్యవేక్షకులను నియమించారు.

ఫరూ.5 లక్షల బీమా..

పేద, మద్యతరగతి వర్గాల్లో ఇంటి పెద్ద అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబం పడే వేదన అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా అమలుకు నిర్ణయించింది. ఈ పథకం కింద సంపాదించే ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేయనుంది. ఈ నిర్ణయం పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా భరోసా ఇవ్వనుంది. పథకం అమలుపై ఇటీవల అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఫమార్గదర్శకాలు ఇలా..

ఇంటింటికీ ఇందిరమ్మ బీమా పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి వయస్సు 18 నుంచి 59 సంవత్సరాల్లోపు ఉండాలి. ఆధార్‌లోని పుట్టిన తేదీ ఆధారంగా వయస్సును నిర్ధారిస్తారు. జనాభా గణనలో గుర్తించిన కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా అమలు చేయనున్నారు. పథకం తీరు తెన్నులను ప్రజలకు తెలియజేసేలా 17, 18వ తేదీల్లో జిల్లాలోని ఆయా గ్రామాలు, వార్డుల్లో టాం టాం ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.

ఫఆన్‌లైన్‌ డిజిటలైజ్‌...

ఇందిరమ్మ బీమా పథకం కోసం ఈనెల 20 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీని కోసం గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ గ్రామాలు, గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీల్లో వార్డు స్థాయిలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో డిజిటలైజ్‌ చేయనున్నారు. దీని కోసం నిర్ధిష్ట ప్రొఫార్మా సిద్ధం చేసిన ప్రభుత్వం ఇప్పటికే ఆయా మండలాలు, మున్సిపాలిటీలకు చేరవేసింది. వీటి ద్వారానే ప్రజలు ఈ బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఫఅమలు ఇలా..

బీమా క్లయింలకు సంబంధించి గ్రామ స్థాయిలో అయితే పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, సీపీవో/డీఆర్‌డీవో, కలెక్టర్‌ ఆమోదం ద్వారా బీమా కపెంనీకి ఫార్వర్డ్‌ చేస్తారు. మున్సిపల్‌ స్థాయిలో వార్డు ఆఫీసర్‌ దరఖాస్తులను స్వీకరించనుండగా కమిషనర్‌ పరిశీలించాల్సి ఉంటుంది. కమిషనర్‌తో పాటు సీపీవో/మెప్మా పీడీ పరిశీలించి కలెక్టర్‌కు పంపిస్తారు. వారి ఆమోదం తర్వాత క్లయిం ఫాం బీమా కంపెనీకి వెళ్తుందని అధికారులు చెబుతున్నారు. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువగా సంపాదించేవారు ఉంటే ఎవరి పేరిట బీమా పొందాలనుకుంటున్నారో వారి నామినీలను నిర్ణయించుకునే వెసులుబాటు దరఖాస్తుదారులకు కల్పించింది.

ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా

-సత్యప్రసాద్‌, కలెక్టర్‌

ప్రతి కుటుంబానికి బీమా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈనెల 19వ తేదీన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తుంది. ఈ పథకంపై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నాము. ఈనెల 20 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నాము. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి చేశాము.

జిల్లాలో మండలాల వారీగా కుటుంబాల వివరాలు ఇలా..

-------------------------------------------------

మండలం - జీపీల సంఖ్య - కుటుంబాలు

-------------------------------------------------

బీర్‌పూర్‌ - 17 - 5,667

భీమారం - 13 - 5,679

బుగ్గారం - 10 - 5,303

ధర్మపురి - 25 - 12,573

ఎండపల్లి - 15 - 7,711

గొల్లపల్లి - 27 - 12,581

ఇబ్రహీంపట్నం - 17 - 9,538

జగిత్యాల అర్బన్‌- 5 - 3,249

జగిత్యాల రూరల్‌ - 29 - 15,530

కథలాపూర్‌ - 19 - 12,295

కొడిమ్యాల - 24 - 16,2ృ3

కోరుట్ల - 15 - 10,004

మల్లాపూర్‌ - 23 - 12,063

మల్యాల - 19 - 11,906

మేడిపల్లి - 12 - 8,227

మెట్‌పల్లి - 23 - 12,761

పెగడపల్లి - 23 - 11,234

రాయికల్‌ - 32 - 14,454

సారంగాపూర్‌ - 18 - 7,340

వెల్గటూరు - 19 - 6,710

-------------------------------------------------

మొత్తం - 385 - 2,01,038

-------------------------------------------------

మున్సిపాలిటీలు...

-------------------------------------------------

మున్సిపాలిటీ పేరు - వార్డులు - కుటుంబాలు

జగిత్యాల - 50 - 31,657

కోరుట్ల - 33 - 22,115

మెట్‌పల్లి - 26 - 17,749

ధర్మపురి - 9 - 5,335

రాయికల్‌ - 12 - 5,64

-------------------------------------------------

మొత్తం - 136 - 82,420

-------------------------------------------------

Updated Date - Nov 18 , 2026 | 01:17 AM