ఎల్3 కేటగిరీలో ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు
ABN , Publish Date - May 05 , 2026 | 01:19 AM
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకుని ఎల్ 3 కేటగిరీలో ఉన్న వారికి కొత్తగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకుని ఎల్ 3 కేటగిరీలో ఉన్న వారికి కొత్తగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నా యని అధికార వర్గాల సమాచారం. దీంతో జిల్లాలో 20 వేల మందికి పైగా ప్రయోజనం కలగనున్నది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ఆరంభించిన విషయం తెలిసిందే. ఒక్కో అసెంబ్లీ నియో జకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించింది. 2023 డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు జరిగిన ప్రజాపాలన గ్రామసభల సం దర్భంగా ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం, మహా లక్ష్మి, గృహలక్ష్మి, రైతు భరోసా, చేయూత పథకాల కోసం ఒకే ప్రొఫార్మాలో దరఖాస్తులను స్వీకరించింది. అందులో భాగంగా జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 1,85,404, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలంతో పాటు ఇళ్లు మంజూరు కోసం 2,707 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖా స్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన ప్రభుత్వం ఒక ప్రత్యేక యాప్‌ను క్రియేట్ చేసి తద్వారా క్షేత్రస్థాయిలో సర్వే చేయించారు. సర్వే అనంతరం దరఖాస్తుదారులను మూడు కేటగిరీలో చేర్చారు. ఎల్ 1 కేటగిరీలో సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకునే వాళ్లు, ఎల్ 2 కేటగిరీలో స్థలం లేని వాళ్లను, ఎల్ 3లో డాబా ఇళ్లు ఉండి, నాలుగు చక్రాల వాహనాలు, వ్యవసాయ భూములు గల వారిని, గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరై అర్ధంతరంగా నిలిపి వేసిన వారిని కూడా ఇదే జాబితాల్లో చేర్చారు. మొదటి విడతలో సొంతంగా ఇంటి స్థలం గల ఎల్ 1 కేటగిరీలో ఉన్న వాళ్లకే ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించింది. ఎల్ 3 కేటగిరీలో ఉండి గతంలో ఇందిరమ్మ ఇళ్లు బేస్‌మెంట్ లెవెల్ వరకు నిర్మించుకుని అర్ధంతరంగా వదిలేసిన లబ్ధిదారులకు కొత్తగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు అవకాశం కల్పించింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చిం తకుంట విజయరమణారావు ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లారు. ఆ విషయమై ప్రభుత్వం పాత లబ్ధిదారులకు ఊరట కల్పిస్తున్నది. ఎల్ 3 కేటగిరీలో 45 వేల మందికి పైగా ఉండగా, గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరై బేస్‌మెంట్ లెవెల్ వరకు ఇళ్లు నిర్మించుకున్న వాళ్లు 20 వేల వరకు ఉంటాయని జిల్లా గృహ నిర్మాణ శాఖాధికారి రాజేశ్వర్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
ఫ జిల్లాలో 6452 ఇళ్లు మంజూరు..
జిల్లాకు మొదటి విడతలో ప్రభుత్వం 9,438 ఇళ్లు మంజూరు చేసింది. పెద్దపల్లి నియోజకవర్గానికి 3,500 ఇళ్లకుగాను 3,100 ఇళ్లు, రామగుండం నియోజకవర్గంలో 3,500 ఇళ్లకుగాను 1,408, మంథని నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు 1,750 ఇళ్లకు గాను 1,439, ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ధర్మారం మండలానికి 688 ఇళ్లకు గాను 505 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో ఇప్పటివరకు 6,452 ఇళ్లు లబ్ధిదారులకు మంజూరు చేయగా, 5,937 ఇళ్లకు ముగ్గులు పోశారు. ప్రగతిలో 4,689 ఇళ్లు ఉన్నాయి. ఇందులో 1322 ఇళ్లు బేస్‌మెంట్ లెవెల్‌లో, 544 ఇళ్లు లెంటల్ లెవెల్‌లో, 2,160 ఇళ్లు స్లాబ్ లెవెల్‌లో, 663 ఇళ్లు పూర్తి దశలో కొనసాగుతున్నాయి. కొందరు లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేస్తున్నప్పటికీ, సకాలంలో నిర్మాణ పనులు ఆరంభించకపోతే ఆ వెంటనే ఇళ్లను రద్దు చేస్తున్నారు. మొదటి దశలో కొందరు ఎల్ 3 కేటగిరీలో ఉన్న వారికి కూడా ఇళ్లు మంజూరు కాగా, వాటిని రద్దు చేశారు. ఇందులో గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరై బేస్‌మెంట్ స్థాయి వరకు నిర్మించుకున్న వారికి కూడా ఇళ్లు మంజూరు చేశారు. అయితే ఆన్‌లైన్ బిల్లు చేసేటప్పుడు సదరు లబ్ధిదారుడి పేరు ఎల్ 3 కేటగిరీలో ఉన్నట్లు తేలడంతో ఆ ఇళ్లను రద్దు చేశారు. కొందరు ఇంటి పనులను కూడా మొదలు పెట్టినప్పటికీ బిల్లులు మంజూరు కాలేదు. వీటి విషయమై ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లడంతో అలాంటి వారికి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. అంతేగాకుండా కొత్తగా మంజూరు ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నది. దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. ఆ ఉత్తర్వులు వెలువడితే మాత్రం జిల్లాలో 20 వేల మందికి దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే అవకాశమున్నది.