అర్హులందరికీ.. ఇందిరమ్మ ఇళ్లు
ABN , Publish Date - Aug 22 , 2026 | 01:15 AM
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్‌హాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు, హౌసింగ్ ఎండీ గౌతమ్, వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడ నరసింగరావు, కలెక్టర్ బి సత్యప్రసాద్ తదితరులతో కలిసి మంత్రి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
- రాష్ట్రరెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- జగిత్యాలలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మంత్రి ముఖాముఖి
జగిత్యాల, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్‌హాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు, హౌసింగ్ ఎండీ గౌతమ్, వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడ నరసింగరావు, కలెక్టర్ బి సత్యప్రసాద్ తదితరులతో కలిసి మంత్రి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో ఆర్డీవో కార్యాలయం, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసినట్లు చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిదశలో నూకలపల్లి రూ.25కోట్లతో తాగునీరు, డైన్రేజీ, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. రెండో దశలో పాఠశాల ఏర్పాటు కోసం త్వరలోనే నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. నూకలపల్లి అర్బన్ హౌజింగ్‌కాలనీలో రేషన్‌దుకాణం ఏర్పాటు చేయాలని, బస్సు సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్‌ను ఆదేశించారు. కాలనీలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకోసం మరోసారి పత్రికా ప్రకటన ఇచ్చి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, క్షేత్రస్థాయిలో విచారణ అనంతరం ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. భూ రీ సర్వే ద్వారా రాష్ట్రంలోని అన్ని భూ సమస్యలకు శాశ్వతపరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఏడాదిన్నరలోపు వ్యవసాయ భూములతో పాటు ఆబాది ఆస్తుల రీ సర్వేను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.. రాష్ట్రంలో తొలిదశలో ప్రతి జిల్లాలో 70గ్రామాలను ఎంపిక చేసి భూ రీసర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. జగిత్యాల జిల్లాలో కూడా ఎంపిక చేసిన గ్రామాల్లో రీసర్వే కొనసాగుతోందన్నారు. రీసర్వే అనంతరం అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుం టామని చెప్పారు. నకిలీ పాస్‌పుస్తకాలను గుర్తించి రద్దు చేస్తామని తెలిపారు. భూ రీ సర్వే అనంతరం నిజమైన రైతుల హక్కులను పరిరక్షిస్తూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని వివరించారు.
ధర్మపురిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి
- రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా, మున్సిపాలిటీగా విరాజిల్లుతున్న ధర్మపురిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. ధర్మపురిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సైతం ఏర్పరచాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పాత, ప్రస్తుతం వినియోగంలో లేని ట్రాక్టర్ ఉన్న కారణంగా కొందరు అర్హులు నష్టపోతున్నారని తెలిపారు. అలాంటి అర్హులైన కుటుంబాలకు నిబంధనల్లో సడలింపు కల్పించాలని కోరారు. ధర్మపురి ప్రజల చిరకాల కోరిక అయిన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనికోరారు. ధర్మపురిలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం మంజూరు చేయాలని కోరారు. మాల్యాల మండలంలో చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు
- జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
నూకలపల్లి అర్బన్ హౌజింగ్ కాలనీని జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేయడానికి చర్యలు తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. తారకరామనగర్, నూకలపల్లిని జగిత్యాల పట్టణంలో విలీనం చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలోని పలువురు సీనియర్ జర్నలిస్టుల కోసం జర్నలిస్టు కాలనీ ఏర్పాటు చేయాలని, భీర్‌పూర్ నూతన మండలానికి తహసీల్దార్ కార్యాలయం మంజూరు చేయాలని, రాయికల్ మున్సిపాలిటీకి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు.
పేదలకు గౌరవప్రదమైన ఇళ్లు
- ఎమ్మెల్సీ ఎల్ రమణ
పేదలకు గౌరవప్రదమైన ఇళ్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. నూకలపల్లి అర్బన్ హౌజింగ్ కాలనీలో వేల సంఖ్యలో ఇళ్లు నిర్మించారని, అయితే ప్రస్తుతం సుమారు 50శాతం ఇళ్లలో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారని తెలిపారు. కాలనీలో మిగిలిన ఇళ్లలో కూడా ప్రజలు నివసించేలా రవాణా, సెల్‌ఫోన్ టవర్లు తదితర అవసరమైన మౌలిక వసతులను త్వరితగతిన కల్పించాలని కోరారు. వేల సంఖ్యలో ఇళ్లతో నూకలపల్లి ఒక చిన్న టౌన్‌షిప్‌గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. బ్లాక్‌ల వారీగా ఇళ్లకు నంబర్లు కేటాయించాలని సూచించారు.
పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు
- చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ ప్రభుత్వ సంక్షేమపథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎన్నడూలేని విదంగా జరుగుతున్నాయన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అభినందిం చారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి తొలి,మలి విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి పండుగ వాతావరణం ప్రభుత్వం కల్పించిందన్నారు.
కోరుట్ల నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం
- రాష్ట్ర వెలమ కార్పోరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగ రావు
కోరుట్ల నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగ్ రావు అన్నారు. ముందస్తుగా ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసిన వారిని ప్రోత్సహి స్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు.
అర్హులకు ఇళ్లు అందిస్తాం
- కలెక్టర్ బి. సత్యప్రసాద్
జిల్లాలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లాలో మొత్తం 10,365ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 2,208 ఇళ్లు నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు 8,079మంది లబ్ధిదారులకు రూ.227.32కోట్ల నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4,710 ఇళ్లు పూర్తయ్యాయని, 4,386 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, మరో 324 మంది లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉందని తెలిపారు. జిల్లాలో మొత్తం 1,562 గుడిసెలను గుర్తించగా, 1,319 గుడిసెలను పరిశీలించి ధ్రువీకరించినట్లు వివరించారు.
కార్యక్రమం అనంతరం 12మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, అదనపు కలెక్టర్ రాజగౌడ్, జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్, జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల ఆర్డీవోలు మధుసూదన్, నరసింహారావు, జీవాకర్ రెడ్డి, జగిత్యాల మున్సిపల్‌చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.