పెరిగిన విద్యుత్ డిమాండ్
ABN , Publish Date - Oct 30 , 2026 | 12:54 AM
ఎల్‌నినో కారణంగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఎల్‌నినో కారణంగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వరి, పత్తి చివరి తడికి రావడంతో బోర్లు, వ్యవసాయబావుల వినియోగం పెరిగి విద్యుత్‌కు డిమాండ్ ఏర్పడింది. సెప్టెంబరు మాసంలో అత్యధికంగా 1456.48 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. జిల్లావ్యాప్తంగా ప్రతిరోజు 10 నుంచి 11 మిలియన్ యూనిట్ల వినియోగం ఉంటుంది. సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో ఈ వినియోగం 377 మిలియన్ యూనిట్లకు పెరగడంతో విద్యుత్‌శాఖ సరఫరాకు ఆటంకాలు కలుగకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. అత్యధిక విద్యుత్ వినియోగంతో ఇతరత్రా కారణాలతో కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లను మరమ్మతులు చేయడమే కాకుండా కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను నెలకొల్పే విషయంలో దృష్టిసారించింది. ఎల్‌నినో కారణంగా విద్యుత్ కొరత ఏర్పడకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
చివరి తడికి నీటి కోసం..
జిల్లాలో 2.66 లక్షల ఎకరాల్లో వరి, 50వేల ఎకరాల్లో పత్తి సాగు జరుగగా ఇప్పుడు వాటికి చివరిసారి నీరందించాల్సిన దశకు చేరుకున్నాయి. సెప్టెంబరు, అక్టోబరులొ ఈ పంటలకు నీరు ఎక్కువగా అవసరమై ఆయకట్టు ప్రాంత రైతులు కూడా వ్యవసాయబావులు, బోరుబావులపైనే ఆధారపడ్డారు. దీంతో జిల్లాలో విద్యుత్ వినియోగం పెరిగింది. జిల్లాలో 5.76 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా వీటిలో 3,96,200 గృహవిద్యుత్, 1,03,970 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. రెండు నెలలుగా వ్యవసాయానికి నీటి వినియోగం ఎక్కువగా ఉండడం, ఉష్ణోగ్రతలు 35 నుంచి 37 డిగ్రీలకు పెరగడంతో వేసవిని తలపించేలా పరిస్థితులు మారాయి. గృహావసరాలకు, వ్యవసాయ అవసరాలకు విద్యుత్ వినియోగం పెరిగి సెప్టెంబరు మాసంలో 377 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. అర్నాబ్ తుఫాన్ కారణంగా ఆరు రోజులుగా వాతావరణ పరిస్థితులు మారి వాతావరణం చల్లబడడంతో ఇళ్లలో ఏసీలు, ఫాన్ల వినియోగం తగ్గిపోయింది. పొలాలు కోతకు రావడంతో వ్యవసాయ అవసరాలు కూడా తగ్గి అక్టోబరు 28 వరకు 305.4 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు.
సిద్ధమవుతున్న విద్యుత్ శాఖ
విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా విద్యుత్‌శాఖ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, సరఫరా వ్యవస్థ నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. జిల్లాలో 27,205 ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. ఆగస్టు నెలలో 151 ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు జరుగగా సెప్టెంబరులో 341, అక్టోబరులో 360 ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడగా వాటిని పూర్తి చేశారు. ఆగస్టులో 49 ట్రాన్స్‌ఫార్మర్లు, సెప్టెంబరులో 88 ట్రాన్స్‌ఫార్మర్లను నెలకొల్పారు. లైన్ల నిర్వహణ, సబ్‌స్టేషన్ల నిర్వహణపై కూడా దృష్టిసారించి ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నారు.