పెరిగిన సహకారం..
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:49 AM
రైతు సేవలను మరింత విస్తృతం చేయడంతో పాటు సౌలాభ్యాన్ని పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
జగిత్యాల, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రైతు సేవలను మరింత విస్తృతం చేయడంతో పాటు సౌలాభ్యాన్ని పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో 12 కొత్త పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం)ల ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో 51 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. వీటిలో సుమారు 1.5 లక్షల మంది సభ్యులున్నారు. వీరిలో అధిక శాతం సభ్యులు ఆయా సంఘాల్లో స్వల్ప, దీర్ఘకాలిక, బంగారు, గృహ నిర్మాణాలు తదితర పద్దుల కింద రూ. కోట్లలో రుణాలు పొందారు. కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్ జగిత్యాల జిల్లా పరిధిలో 17 బ్రాంచీలున్నాయి. రైతుల సౌలభ్యం కొరకు వీటిని విభజించి, కొత్తగా 12 పీఏసీఎస్‌లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో వీటి సంఖ్య 63కు చేరనుంది.
ఫకొత్త సంఘాలివే..
జిల్లాలోని డబ్బు తిమ్మాయిపల్లి, పొలాస, తాట్లావాయి, పాత గూడూరు, మద్దులపల్లి, మల్లన్నపేట, న్యూ దాంరాజ్పల్లి, జగ్గసాగర్, మన్నెగూడెం, కథలాపూర్, బుగ్గారం, నేరేళ్ల గ్రామాల్లో కొత్త సొసైటీలు ఏర్పాటు కానున్నాయి. ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు ప్రతీ మండల కేంద్రంతో పాటు పలు మారుమూల ప్రాంతాల్లో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఏర్పాటు చేశారు. ఈసంఘాలకు ఎన్నికల ప్రక్రియ ద్వారా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజాప్రతినిధులను ఎంపిక చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జిల్లాలు, డివిజన్లు, మండలాలు, కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. దీనికి అనుగుణంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల విస్తరణ జరగలేదు. దీంతో పరిపాలన పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో కొత్తగా పీఏసీఎస్‌ల ఏర్పాటుకు నిర్ణయించారు.
ఫరైతులకు మరింత చేరువగా..
జిల్లాలో కొత్త సహకార సంఘాల ఏర్పాటుతో రైతులకు సేవలు మరింత చేరువ కానున్నాయి. ఎరువులు, విత్తనాల సరఫరాతో పాటు రుణ సదుపాయం మెరుగుపడనుంది. రైతులకు ప్రభుత్వం అందించే పథకాలు, ధాన్యం కొనుగోళ్లు, పంట రుణాల పంపిణీ, గిడ్డంగులు, పెట్రోలు బంకులు, ఇతర కార్యక్రమాలు సైతం సొసైటీలు ద్వారానే అమలవుతున్నాయి. జిల్లాలో 2013 తర్వాత కొత్తగా వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు కాలేదు. ఒకే సొసైటీ రెండు మండలాల పరిధిలోకి రావడం అలాగే ఎక్కువ గ్రామాలకు ఒకే సొసైటీ ఉండడంతో సరైన సేవలందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని చాలా రోజులుగా వినతులు రావడంతో ప్రభుత్వం ఇప్పుడు చర్యలు చేపట్టింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకే..
-మనోజ్ కుమార్, జిల్లా సహకార శాఖ అధికారి
జిల్లా అవసరాల నేపథ్యంలో కొత్తగా పీఏసీఎస్‌ల ఏర్పాటు కోసం గతంలో ప్రతిపాదనలు పంపాము. వాటిని పరిశీలించిన ఉన్నతాధికారులు కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే విభజన ప్రక్రియ చేపడుతాము.