Share News

భూముల విలువ పెంపు

ABN , Publish Date - May 26 , 2026 | 12:59 AM

ప్రస్తుతం భూములు, అపార్ట్‌మెంట్‌, ప్లాట్ల క్రయవిక్రయాలు చాలా వరకు తగ్గిపోవటంతో రియల్‌ఎస్టేట్‌ రంగం ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నది.

భూముల విలువ పెంపు
కరీంనగర్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో కిక్కిరిసిన కొనుగోలుదారులు

కరీంనగర్‌ క్రైం, మే 25 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం భూములు, అపార్ట్‌మెంట్‌, ప్లాట్ల క్రయవిక్రయాలు చాలా వరకు తగ్గిపోవటంతో రియల్‌ఎస్టేట్‌ రంగం ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నది. గత రెండు సంవత్సరాలుగా భూములు, ఇళ్ల స్థలాల ధరలు 20 శాతం పడిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు, వాణిజ్య స్థలాల ప్రభుత్వ మార్కెట్‌ ధరలను పెంచేందుకు చేస్తున్న కసరత్తు చివరి దశకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే పనిలో భాగంగా మార్కెట్‌ విలువలను సవరించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న భూముల మార్కెట్‌ ధరలను బహిరంగ మార్కెట్‌లో ధరలను పోల్చిచూస్తూ ఏ మేరకు రేట్లను సవరించుకునే వీలుంటుందో సూచిస్తూ జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లా నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించి ఏ మేరకు మార్కెట్‌ విలువలను పెంచుతారనేది నిర్ణయించాల్సి ఉన్నది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జిల్లాల్లో అర్బన్‌ ప్రాంతాల్లో జేసీ చైర్మన్‌గా మార్కెట్‌ వాల్యూ రివిజన్‌ కమిటీ సభ్యులు మున్సిపల్‌ కమిషనర్‌, జెడ్పీ సీఈఓ, సబ్‌రిజిస్ట్రార్‌లు, రూరల్‌ ఏరియాలో ఆర్‌డీఓ చైర్మన్‌గా తహసీల్దార్‌, ఎంపీడీఓ సభ్యులుగా, కన్వీనర్‌గా సబ్‌రిజిస్ట్రార్‌లు కమిటీలు సమావేశమై ప్రస్తుతం జిల్లాల్లోని భూముల మార్కెట్‌ విలువకు ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌ విలువకు వ్యత్యాసంపై రిజిస్ట్రేషన్‌ ఐజీకి నివేదిక పంపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినప్పటికీ భూముల మార్కెట్‌ వాల్యూ పెంపు చేపట్టలేదు.

ఫ వ్యవసాయేతర భూములపై ప్రభావం

ప్రస్తుతం కరీంనగర్‌ అర్బన్‌ ప్రాంతాల్లో భూములకు ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ వాల్యూ గజానికి అత్యల్పంగా(సీతారాంపూర్‌, లక్ష్మిపూర్‌, ఆరెపల్లి, చింతకుంట) 3,200 రూపాయలు, అత్యధికంగా(కరీంనగర్‌లోని రాజీవ్‌చౌక్‌ ప్రాంతం) 37,400 రూపాయల వరకు ఉంది. కానీ బహిరంగ మార్కెట్‌లో దీని ధర 3 నుంచి 4 వంతులు ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ నిర్ధారిత విలువలకన్నా అధిక మొత్తంలో భూములు, ఆస్థుల క్రయవిక్రయాలు జరుగుతున్నా 90 శాతం మంది ప్రభుత్వ నిర్ధారిత విలువకే రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఇది ప్రభుత్వా ఆదాయానికి గండికొట్టడమే అవుతున్నది. మార్కెట్‌ విలువకన్నా చాలా తక్కువ ధరలు రిజిస్ట్రేషన్‌ విలువ ఉన్న కారణంగా కొన్ని సందర్భాలలో కొనుగోలుదారులు బ్యాంక్‌ రుణాలు పొందడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కరీంనగర్‌లో భూముల ధరలకు రెక్కలువచ్చి అమాంతం పెరిగాయి. కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పరిసర గ్రామాలు విలీనంతో పాటు ఉమ్మడి జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన నిర్వాసితులు అధిక శాతం కరీంనగర్‌లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి స్థిరపడటం, మరో వైపున సాగునీటి ప్రాజెక్టుల కారణంగా భూగర్భజలమట్టం పెరిగి వ్యవసాయం ఊపందుకుంది. దీంతో వ్యవసాయ భూముల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్‌ ధరలను 25 నుంచి 100 శాతం వరకు పెంచేలా ప్రతిపాదనలు సవరించారు. కొన్ని ప్రాంతాల్లో 25 శాతం, మరికొన్ని చోట్ల 50-75 శాతం వరకు పెరుగుదల ఉండవచ్చని తెలుస్తోంది. ఈ మార్పులు జూన్‌ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రాంతాల అభివృద్ధిని బట్టి భూముల మార్కెట్‌ విలువల పెంపు ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువల సవరణలో ప్రధానంగా కమర్షియల్‌ ప్లాట్లు, రెసిడెన్షియల్‌ ప్లాట్లు, ప్రధాన రహదారులకు చేరువలో ఉన్న భూముల ఽరేట్లను భారీగా పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. వ్యవసాయ భూముల ఽవిలువలను పెంచినా కొద్దొగొప్పో పెంచే అవకాశాలుంటాయని, ఇప్పటికే వ్యవసాయ భూముల ధరలు పెరిగినందున వాటిపై పెద్దగా ప్రభావం పడక పోవచ్చని భావిస్తున్నారు.

ఫ రిజిస్ట్రేషన్ల ఫీజు భారం

ప్రస్తుతం సేల్‌డీడ్‌కు మార్కెట్‌ వాల్యూపై స్టాంపు డ్యూటీ 5.5 శాతం, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 1.5 శాతం, రిజిస్ట్రేషన్‌ ఫీజు 2 శాతం కలిపి మొత్తం 7.5 శాతం ఫీజును వసూలు చేస్తున్నారు. మార్టిగేజ్‌ రుణాలకు బ్యాంక్‌ ఇచ్చే రుణం విలువలో స్టాంపు డ్యూటీ 3.6 శాతం, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 0.1 శాతం వసూలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం భూముల మార్కెట్‌ విలువలను పెంచడంతో పాటు రిజిస్ట్రేషన్‌ ఫీజును కూడా పెంచుతున్నరా? లేక భూముల మార్కె ట్‌ ధరలను మాత్రమే సవరించనున్నరా అనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది. 2022లో అప్పటి ప్రభుత్వం రాష్ట్రంలో భూముల మార్కెట్‌ వాల్యూను పెంచగా, 2021లో లాండ్‌ మార్కెట్‌ వాల్యూతోపాటు, రిజిస్ట్రేషన్‌ ఫీజును పెంచి రెండు మార్గాలలో ఆదాయం సమకూర్చుకున్నది. సాధారణంగా భూములు, ఇళ్లు, ఇళ్ల స్థలాల మార్కెట్‌ విలువలు పెంచిన సందర్భంలో ప్రభుత్వాలు స్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలు తగ్గించేవి. ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనుందనేది ఒకటి రెండు రోజుల్లో వెల్లడయ్యే అవకాశమున్నది. అయితే భూములు, ఇళ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్‌ల మార్కెట్‌ విలువల ధరల పెంపుతో కొనుగోలుదారులపై ఆ మేరకు రిజిస్ట్రేషన్ల ఫీజు భారం పడనుంది.

ఫ కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో 14 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. ఈ 14 ఎస్‌ఆర్‌ఓల ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 95,235 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్ల ద్వారా స్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్‌ఫీజు, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ కింద మొత్తం 7.5 శాతంతో ప్రభుత్వానికి 24,417 కోట్ల 26 లక్షల ఆదాయం సమకూరింది. 2026 సంవత్సరంలో జనవరి నుంచి మే 24వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల రూపంలో 8,661 కోట్లు 72 లక్షల ఆదాయం వచ్చింది.

ఫ పెరిగిన రిజిస్ర్టేషన్లు

ప్రభుత్వం భూముల మార్కెట్‌ విలువలు పెంచుతున్నదనే సమాచారంతో క్రయవిక్రయదారులు పెద్ద సంఖ్యలో రిజిస్ర్టేషన్‌ కోసం వస్తున్నారు. పెరిగిన ధరల ప్రకారం రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు చెల్లిస్తే అదనపు భారం పడుతుందనే భయంతో నెలాఖరులోపే ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నారు. సాధారణంగా కరీంనగర్‌లో రోజుకు 25 నుంచి 30 ఆస్థుల రిజిస్ట్రేషన్లు కోసం స్లాట్‌ బుకింగ్‌లు అయ్యేవి. గత 15 రోజుల నుంచి 40 నుంచి 50 బుకింగ్‌ అవుతున్నాయి. అయితే శుక్ర, శనివారాల్లో కరీంనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సర్వర్‌ డౌన్‌ అవటంతో రిజిస్ట్రేషన్‌లు చాలా వరకు నిలిచిపోయాయి. వారితో పాటు సోమవారం బుక్‌ చేసుకున్నవారు కూడా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాయానికి ఉదయమే చేరుకోవటంతో కిక్కిరిసిపోయింది.

ఫ అధికారులపై ఆగ్రహం

ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం ముందస్తుగా స్లాట్‌ బుక్‌ చేసుకున్నప్పటికీ ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్‌లు విధులకు గైర్హాజరవటంతో ఆగ్రహించిన క్రయవిక్రయదారులు గొడవకు దిగారు. కరీంనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఇద్దరు ఎస్‌ఆర్‌ఓ పోస్టులు ఉండగా ప్రస్తుతం ఒకరు సెలవులో ఉండటంతో ఒక్క ఎస్‌ఆర్‌ఓనే రిజిస్ట్రేషన్లు చేస్తుండటంతో కొంత జాప్యం జరుగుతున్నది. సోమవారం మద్యాహ్నం వరకు ఆ ఒక్క సబ్‌రిజిస్ట్రార్‌ కూడా కలెక్టరేట్‌లో సమావేశానికి వెళ్లటంతో కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన కొనుగోలుదారులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మూడు రోజులుగా తాము కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకో కుండా రిజిస్ట్రేషన్లు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు వెంటనే ఎస్‌ఆర్‌ఓను రప్పించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించటంతో శాంతించారు.

Updated Date - May 26 , 2026 | 12:59 AM