భూ ‘భారం’ పెంపు..
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:39 AM
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణ ప్రాంతాల్లో భారీగానే భూ భారం పడింది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా పెంచిన కొత్త భూముల మార్కెట్ విలువ (రిజిస్ట్రేషన్ ధర) శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది.
- అమల్లోకి వచ్చిన భూమి మార్కెట్ విలువ కొత్త రేట్లు
- 50-75 శాతానికి పెరిగిన భూముల మార్కెట్ విలువ
- రిజిస్ట్రేషన్ శాఖ పోర్టల్‌లో వివరాలు అప్లోడ్
- జిల్లాలో పెరగనున్న రిజిస్ట్రేషన్ల ఆదాయం
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణ ప్రాంతాల్లో భారీగానే భూ భారం పడింది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా పెంచిన కొత్త భూముల మార్కెట్ విలువ (రిజిస్ట్రేషన్ ధర) శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం కొద్దిరోజులుగా భూముల విలువ పెంపుపై కసరత్తు చేస్తున్న సమయంలోనే పెరగడం ఖాయమని ఊహించినట్లే రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూముల మార్కెట్ విలువలో పాత రేట్లపై 50 శాతం నుంచి 75శాతం వరకు విలువను పెంచారు. అపార్ట్‌మెంటు,్ల ప్లాట్‌లలో స్వల్పంగానే సవరించారు. 10 నుంచి 20 శాతం జరిగింది.
జిల్లాలో రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతోపాటు 13 తహసీల్దార్ కార్యాలయాల్లో భూక్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. సిరిసిల,్ల వేములవాడ మున్సిపాలిటీలతో పాటు వేములవాడ అర్బన్ గ్రామాలు, వేములవాడ రూరల్, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, బోయిన్‌పల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని గ్రామాల్లో ఆయా ప్రాంతాల భూముల క్రయవిక్రయాలను పరిగణనలోకి తీసుకొని భూముల మార్కెట్ విలువను పెంచారు. 2021-22 సంవత్సరంలో రెండు సార్లు భూముల విలువలను పెంచారు. రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ చార్జీలు కూడా 6 నుంచి 7.5 శాతానికి పెంచారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ భూముల విలువలను ప్రభుత్వం పెంచింది. జిల్లా కేంద్రంలో గజం భూమి విలువ గతంలో రూ 2100 ఉంటే పెరిగిన విలువ ప్రకారం రూ 3200కు చేరింది. అత్యధికంగా గజం రూ 25300 వరకు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ700 నుంచి రూ1100 వరకు పెరిగింది. మండల కేంద్రాల్లో ధర ఎక్కువగా ఉంది. వేములవాడ మున్సిపల్ ప్రాంతంలో రూ 3 వేల నుంచి రూ 6 వేల వరకు పాత మార్కెట్ ధర ఉంటే ప్రస్తుతం రూ 5వేల నుంచి రూ 9 వేల 500 పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో, విలీనం గ్రామాల్లో రూ 15 లక్షల నుంచి రూ 25 లక్షల వరకు ఉన్న విలువ రూ 25 లక్షల నుంచి 40 లక్షల వరకు పెరిగింది. దీంతో భూములను పెంపు నేపథ్యంలో ప్రభుత్వానికి పెద్దఎత్తున ఆదాయం వస్తుంది. స్టాంపు డ్యూటీ యథావిధిగా 7.5 శాతం ఉంది. పెరిగిన భూముల విలువ ప్రకారం ఉదాహరణకు గజానికి రూ 2100 విలువ ఉన్న భూమికి రూ 157 చొప్పున చెల్లించాలి. 100 గజాలకు రూ 15700 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా గజానికి రూ 3200 విలువ ఉంటే రూ 240 చొప్పున 100 గజాలకు రూ 24 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. భూముల విలువను బట్టి చాలా మొత్తం పెరుగుతుంది. దీని ద్వారా జిల్లాలో ఆదాయం భారీగా పెరగనుంది. రిజిస్ట్రేషన్‌ల ద్వారా జిల్లాకు దాదాపు ప్రతి సంవత్సరం రూ 50 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. జిల్లా కేంద్రంలో టెక్స్‌టైల్ రంగంతో పాటు జిల్లా కేంద్రం కావడంతో రూ 30 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ప్రస్తుతం పెరిగిన ధర ప్రకారం అదనంగా రూ 8 నుంచి రూ 10 కోట్ల వరకు ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రతిరోజు రిజిస్ట్రేషన్ ఆఫీసులో 40 స్లాట్ల వరకు అవకాశం ఉండగా సుమారుగా 35 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. గత నెలలో రిజిస్ట్రేషన్ల తాకిడి పెరుగుతుందని భావించి 80 స్లాట్ల వరకు అవకాశం ఇచ్చారు. చివరి రోజు వరకు 60 నుంచి 70 రిజిస్ట్రేషన్లు జరిగాయి.
రియల్ రంగంపై ప్రభావం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో క్రయవిక్రయాలు పడిపోయి రియల్టర్లు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం భూముల విలువలను పెంచడంతో దీని ప్రభావంతో రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని రియల్ ఎస్టేట్ వర్గాలు ఆందోళన చెందుతున్నారు. దీంతోపాటు జిల్లాలో ఆస్తుల కొనుగోలుదారులపై కూడా భారం పడనుంది. ప్రధానంగా సిరిసిల్ల, వేములవాడ పట్టణ ప్రాంతాలతో పాటు మండల కేంద్రాల్లో భూముల విలువ పెంపు ద్వారా పెరుగనున్న రిజిస్ట్రేషన్ భారంతో భూముల క్రయవిక్రయాలు ఇబ్బందికరంగానే మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సవరించిన భూముల విలువ రేట్లు అమలు..
- ఆర్ వెంకటవీరస్వామి, సబ్ రిజిస్ట్రార్ సిరిసిల్ల
ప్రభుత్వం సవరించిన భూముల విలువల రేట్లు అమలులోకి వచ్చాయి. సిరిసిల్ల పరిధిలో ప్రాంతాలవారీగా వివిధ విలువలు నిర్ణయించారు. గత నెలలో 80 స్లాట్లల వరకు పెంచారు, ప్రతిరోజు 40 స్లాట్ల వరకు అవకాశం ఉంటుంది. జిల్లా కేంద్రంలో 50 శాతం వరకు భూముల విలువ పెరిగింది.